హెచ్‌.ఆర్‌.ఎఫ్‌. కార్యకర్తలపై తప్పుడు కేసులను ఎత్తివేయాలి

కర్నూలు జిల్లా ఆదోనిలో న్యాయవాదిగా పని చేస్తున్న మానవ హక్కుల వేదిక (హెచ్‌.ఆర్‌.ఎఫ్‌.) ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఉభయ రాష్ట్రాల కార్యదర్శి యు.జి. శ్రీనివాసులపై గత కొన్నాళ్లుగా అక్కడి పోలీసులు చేస్తున్న వేధింపు చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.

గత మూడు సంవత్సరాలుగా పోలిసులు శ్రీనివాసులపైనే కాక , ఆదోనిలో అనేక ఇతర కార్యకర్తలపై కూడా అనేక తప్పుడు క్రిమినల్‌ కేసులు బనాయించారు.

పోలిసుల అక్రమ, దుందుడుకు చర్యలను శ్రీనివాసులు నాయకత్వంలో హెచ్‌.ఆర్‌.ఎఫ్‌. నిశితంగా విమర్శిస్తుంది కాబట్టే పోలీసులు ఆయనపై బూటకపు కేసులు నమోదు చేసి వేధిస్తున్నారు. శ్రీనివాసులు కర్నూలు జిల్లాలో ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి హాని చేస్తున్న పరిశ్రమలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వాటికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. బడుగువర్గాలపై జరిగే వేధింపు చర్యలను ప్రశ్నిస్తున్నారు. ఎస్‌.సి. ఎస్‌.టి. (అత్యాచార నిరోధక) చట్టం కింద కేసులు నమోదు చేయవలసిన సందర్భాల్లో పోలీసులు ఉదాసీనత ప్రదర్శిస్తే ఆ చట్టాన్ని సక్రమంగా అమలయ్యేటట్లు చూస్తున్నారు. చట్టబద్ధ పాలన, లౌకికవాద విలువల పరిరక్షణ కొరకు అనేక మంది వ్యక్తులతోనూ, సంస్థలతోనూ కలిసి కృషి చేస్తున్నారు. గత మూడు దశాబ్దాలుగా అణగారిన వర్గాల వారి మౌలిక హక్కుల పరిరక్షణ కోసం పని చేస్తున్నారు. వారి హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు స్పందిస్తారు. ఆయన చేపట్టిన కార్యక్రమాలన్నీ అహింసాయుతామైనవే. పారదర్శకత, ప్రజాస్వామిక విలువలతో కూడినవి.

శ్రీనివాసులు చేపట్టే న్యాయసమ్మతమైన ఈ కార్యక్రమాలు పోలిసులకు కంటగింపయ్యాయి. అందుకే చట్టాన్ని దుర్వినియోగపరచి ఆయనపై బూటకపు కేసులు నమోదు చేసారు. ఆదోనిలో పర్యావరణ చట్టాలను ఉల్లంఘిస్తూ గాలినీ, భూమినీ, నీటిని కాలుష్యమయం చేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడే పరిశ్రమలపై చట్టపరమైన చర్యలు చేపట్టాల్సిందిపోయి పోలీసులు హెచ్‌.ఆర్‌.ఎఫ్‌. కార్యకర్తలపై ఎస్‌.సి. ఎస్‌.టి. (అత్యాచార నిరోధక) చట్టం కింద అబద్ధపు కేసులు నమోదు చేసారు. ఆదోనిలో పోలిసులు విచక్షణా రహితంగా 460 మందిపై రౌడీ షీట్లు తెరిచేసరికి ఆ విషయాన్నీ శ్రీనివాసులు ప్రశ్నించారు. అవమానకర ఈ వేధింపు చర్యలను ప్రశ్నించే సరికి దాన్ని  సరిదిద్దుకోవలసింది పోయి పోలిసులు తిరిగి యు.జి. శ్రీనివాసులపైనే రౌడీ షీటు తెరిచారు! అతనిపై ఐ.పి.సి. సెక్షన్‌ 153ఏ (భిన్న మతస్తుల మధ్య వైషమ్యాలు పెంచే నేరం) కింద కేసు నమోదు చేసారు. ఒక హక్కుల కార్యకర్తపై ఈ సెక్షన్‌ కింద తప్పుడు కేసు నమోదు కావడం ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో బహుశా ఇదే మొదటి సారేమో.

అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నిస్తున్న శ్రీనివాసులు పైనా , ఇతర వ్యక్తుల మీదా ఇటువంటి తప్పుడు కేసులు నమోదు చేసి వేధింపు చర్యలకు పాల్పడితే వారు భయపడి ప్రశ్నించడం మానేస్తారనే భావనతోనే పోలీసులు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని మాకు తెలుసు. అన్యాయాలపై గళమెత్త వారి గొంతు నులమాలనే ఉద్దేశంతోనే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని మేము అనుకుంటున్నాము. నిరసనను నేరంగా చిత్రీకరించే చర్య ఇది.

నిరసన తెలిపే హక్కు, రాజ్యాంగం కాపాడే అనేక ఇతర స్వేచ్చలు మన ప్రజాస్వామ్య భావంలో ఇమిడి ఉన్నాయి. నిరసన తెలిపే హక్కును హరిస్తుంటే మేము చూస్తూ ఉండబోము. ప్రజాస్వామిక విలువలను కాలరాస్తూ సమాజంలో విమర్శకు, చర్చకు తావులేకుండా చేసే ఈ చర్యలను మేము ప్రశ్నించి తీరుతాం.

ప్రభుత్వం, దాని అనుబంధ సంస్థలు చట్టానికి, ప్రజాస్వామిక విధానాలకు లోబడి పనిచేయాల్సిందే అనే విషయాన్ని మేము పదేపదే గుర్తు చూస్తూనే ఉంటాము. సమాజంలో మానవ హక్కుల సంస్కృతిని కాపాడటానికి, దాన్ని బలోపేతంచేయడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటాము.

బాధాకర విషయం ఏమిటంటే పోలీసులు రాజకీయ ప్రభుత్వ కనుసన్నలలోనే, దాని అంగీకారంతోనే చట్టబద్ధ, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుంటారు. కాబట్టి కర్నూలు పోలీసుల అధికార దుర్వినియోగంపై ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి సారించి వారి చర్యలకు కళ్ళెం వేయాలని మేము కోరుతున్నాము. యు.జి. శ్రీనివాసులపై బనాయించిన కేసులను ఎత్తివేయాలని మేము డిమాండు చేస్తున్నాము.

వి.ఎస్‌. కృష్ణ
(హెచ్‌.ఆర్‌.ఎఫ్‌ ప్రధాన కార్యదర్శి)

ఎస్‌. జీవన్‌ కుమార్‌
(హెచ్‌.ఆర్‌.ఎఫ్‌ అధ్యక్షులు)

06.04.2017

Related Posts

Scroll to Top