రిజర్వేషన్‌లను లంబాడాలే తన్నుకుపోతున్నారన్న ఆదివాసుల ఫిర్యాదు న్యాయబద్ధమైనదే

లంబాడాలను షెడ్యూల్డ్‌ తెగల జాబితా నుంచి తొలగించాలని కోరుతూ గత కొంత కాలంగా ఆదివాసులు చేస్తున్న ఆందోళనపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని మానవ హక్కుల వేదిక డిమాండ్‌ చేస్తోంది. కల్లెక్టర్లను, ఎస్పీలను బదిలీ చేయడం కంటే మరింత అర్ధవంతమైన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం.

ఈ సమస్య సంక్లిష్టమైనదని, పరిష్కరించడంలో అనేక పార్శ్వాలను పరిగణనలోకి తీసుకోవాలని మేము గుర్తించకపోలేదు. షెడ్యూల్డ్‌ తెగల జాబితాలోకి కొత్త తెగలను చేర్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని మా ఉద్దేశం. అందులో ప్రధానమైనది, ఇప్పటి పరిస్థితికి కారణమైనది – షెడ్యూల్డ్‌ ప్రాంతాలలో నివసిస్తున్న ఆదివాసులను సంచార తెగలవారితో, డీ నోటిఫైడ్ తెగలవారితో కలపడం. దీనికి తోడు ఆయా సందర్భాలలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగాను, కొన్నిసార్లు తమ నిర్లక్ష్యంతోను రాష్ట్ర సరిహద్దులకు అటూ ఇటూ నివసించే ఒకే రకమైన తెగల వారిని వేరు వేరు కేటగిరీలలో చేర్చి సమస్యను మరింత జటిలం చేశాయి. ఆరు దశాబ్దాలు దాటినా ఇటువంటి లోటుపాట్లను సరిదిద్దే చర్యలేమీ ప్రభుత్వ యంత్రాంగం చేపట్టకపోవడం దారుణం. షెడ్యూల్డ్‌ ప్రాంతాన్నీ, అందులో నివసిస్తున్న తెగలనూ సంరక్షించాల్సిన బాధ్యత గల రాజ్యాంగ ధర్మకర్తలు తమ విధులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల జరిగిన నష్టం ఇది.

రాజ్యాంగపరంగా తమకు దక్కాల్సినవి దక్కడం లేదనే ఆగ్రహంతోనే ఆదివాసులు ఇవ్వాళ రోడ్డెక్కారు. ఈ రోజు ఎస్టీ రిజర్వేషన్‌ నుండి అత్యధిక ప్రయోజనం పొందుతున్నది తెలంగాణలో లంబాడాలొక్కరే కాదు, ఆంధ్రప్రదేశ్‌ లో ఎరుకల వాళ్ళు కూడా. దీని వల్ల ఫిఫ్త్ షెడ్యూల్డ్‌ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసి తెగలన్నీ నష్టపోతున్నాయి. లంబాడా, ఎరుకల వంటి మైదాన ప్రాంత తెగల వల్ల నష్టపోతున్న వారిలో గోండులు, కోయలు, తోటీలు, కొలాములు, చెంచులు, కొండరెడ్లు తదితరులున్నారు. వీరంతా శతాబ్దాలుగా ఫిఫ్త్ షెడ్యూల్డ్‌ ప్రాంతంలో నివసిస్తున్నప్పటికీ ఎస్టీ రిజర్వేషన్లలో, వివిధ సంక్షేమ పధకాలలో లంబాడా, తదితర తెగలు సింహ భాగం తీసుకుంటున్నందు వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించిన ఏ గణాంకాలు పరిశీలించినా ఈ విషయం స్పష్టమవుతుంది. 1976 లో ఎప్పుడైతే తెలంగాణలో లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చారో అప్పటి నుండి వారి జనాభా విపరీతంగా పెరిగిపోయింది. దానికి కారణం – కర్ణాటకలో ఎస్సీలుగా, మహారాష్ట్రలో బీసీలుగా, రాజస్తాన్‌ లో ఓసీలుగా ఉన్న లంబాడాలు పెద్దఎత్తున తెలంగాణలోకి వలస రావడం. దానితో తెలంగాణలోని ఆదివాసీ తెగల నిష్పత్తిలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుని వివిధ తెగల మధ్యనున్న సమతుల్యం దెబ్బతిన్నది. అప్పటి నుండి విద్యా ఉద్యోగ రంగాలలోనే కాక తెలంగాణలోని ఫిఫ్త్ షెడ్యూల్డ్‌ ప్రాంతమంతటా – మరీ ముఖ్యంగా పాత ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, మహబూబ్‌ నగర్‌ జిల్లాలలో భూమి కూడా పెద్దఎత్తున లంబాడాల చేతుల్లోకి వెళ్లిందనేది నిర్వివాదాంశం. రాజ్యాంగపరంగా తమకు రావాల్సిన ప్రయోజనాలన్నీ లంబాడాలు తన్నుకుపోతున్నారని, తాము మోసపోతున్నామని ఆదివాసులు చేస్తున్న ఫిర్యాదు పూర్తిగా న్యాయబద్దమైనదని మానవ హక్కుల వేదిక విశ్వసిస్తోంది. దీని గురించి వారు చాలా ఏళ్ళుగా ఫిర్యాదులు చేస్తున్నా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవడమే నేటి ఈ స్థితికి కారణం.

తెలంగాణ ప్రభుత్వం తక్షణమే ఆదివాసులతో చర్చలు జరిపి వారి ఫిర్యాదులను, డిమాండ్లను తెలుసుకోవాలి. ఎస్టీ రిజర్వేషన్లలో ఏ తెగకు ఎంత లభిస్తున్నదో ఒక కమిషన్‌ వేసి అధ్యయనం చేయించాలి. ఒకటి రెండు తెగలే అన్ని ప్రయోజనాలనూ పొందుతున్నాయనే ఆరోపణలపై విచారణ జరిపించాలి. లంబాడాలకు ఇచ్చిన ‘ఏజెన్సీ సర్జిఫికేట్‌’లను తనిఖీ చేయడంతో పాటు ఫిఫ్త్ షెడ్యూల్‌ ప్రాంతాలలో భూమి యాజమాన్యం తీరుతెన్నులను కూడా క్షుణ్ణంగా పరిశీలింప చేయాలి. ఏ మాత్రం ఆలస్యం లేకుండా ప్రభుత్వం ఈ పని మొదలు పెట్టాలని మేము డిమాండ్‌ చేస్తున్నాం.

ఈలోగా ఇరువర్గాలవారూ హింసకు పాల్పడకుండా శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకునేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సోషల్‌ మీడియాలోనూ, ఇతరత్రా పరస్పరం అసభ్యంగా దూషించుకోవద్దని, సంయమనం పాటించమని కోరుతున్నాం.

జి. మోహన్‌
HRF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ

జి. మాధవరావు
HRF రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ

21.12.2017

Related Posts

Scroll to Top