ప్రభుత్వం నియమించిన రైతుబంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ అయిన పల్లా రాజేశ్వర్ రెడ్ది జనవరి మూడవ తేదీ నిర్వహించిన పత్రికా సమావేశంలో రైతు స్వరాజ్య వేదిక అనే స్వచ్చంద స౦స్థపై చేసిన వ్యాఖ్యలను మానవహక్కుల వేదిక ఖండిస్తున్నది. రైతుబంధు పథకంపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ అయన రైతు స్వరాజ్య వేదిక అనే స్వతంత్ర సంస్థఫై రాజకీయ పార్టీలఫై చేసినట్టు తప్పుడు ఆరోపణలు, అనైతిక వ్యాఖ్యలు చేశాడు.
రైతు స్వరాజ్య వేదిక ఆంధ్రా వ్యాపారులు ఏర్పరిచిన ఓ వ్యాపార సంస్థ అనీ, రైతులు ఆత్మహత్యలు చేసుకోకపోయినా చేసుకున్నట్లు చూపిస్తున్నదని అభాండాలు వేశాడు. ఏ సాధారణ చావుని వారు రైతు ఆత్మహత్యగా చిత్రించారో ఒక్క ఉదాహరణని అయినా పేర్కొని ఉంటే ఆయన పదవికి తగినట్లుగా హుందాగా ఉండేది. ముందుగా ఆయన రైతు ఆత్మహత్య వార్తలపై చట్ట ప్రకారం జరగాల్సిన త్రిసభ్య కమిటీ విచారణలు ఎందుకు జరిపించడం లేదనే దానికి వివరణ ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన విచారణలు, నిర్ధారణలు వదిలిపెట్టి, రైతు ఆత్మహత్యల గణాంకాలపై కేంద్ర సంస్థ (NCRB) ఇచ్చే నివేదికపై ఆధారపడటంలోనే పాలకుల పరిపాలనా డొల్లతనం బహిర్గతమౌతున్నది.
రైతు స్వరాజ్య వేదిక అనేది రాజకీయాలతో సంబంధంలేని, వ్యవసాయ రంగానికి మాత్రమే పరిమితమైన స్వచ్చంద సంస్థ. సుస్థిర, శాస్త్రీయ వ్యవసాయ విధానాన్ని రైతులకు నేర్పించటం, నోరులేని రైతుల పక్షాన నిలబడి మాట్లాడటమే వాళ్ల కార్యక్రమం. రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలను క్షేత్ర స్థాయి నుండి వెలుగులోకి తెచ్చి, సమాజంలో చర్చనీయాంశం చేయటంలో వారి పాత్ర శ్లాఘనీయం. రైతుల మేలుకోరే ప్రభుత్వాలు అటువంటి వాళ్లను అభినందిస్తూ, వారి సహాయం తీసుకుంటూ పనిచేయాలి. అది చేయకపోగా, ఇటువంటి సంస్థలు వాస్తవాలు మాట్లాడటం వల్ల తమకు రాజకీయంగా నష్టం జరుగుతున్నదనే అసహనంతో దౌర్జన్యానికి దిగుతున్నారు. ప్రజల కోసం లాభాపేక్ష లేకుండా పనిచేసే ఓ సంస్థ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా మాట్లాడడం సభ్యత అనిపించుకోదు. బాధ్యతా రహితంగా మాట్లాడిన పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను మేం ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటి గతితప్పిన, చవకబారు ఆరోపణలు మానుకోవాలని, స్వతంత్ర సంస్థలను, మేధో వర్గాన్ని గౌరవించటం నేర్చుకోవాలని మేం తెరాస నాయకులకు సూచిస్తున్నాం.
మానవ హక్కుల వేదిక
తెలంగాణ
13 జనవరి 2022