లోపభూయిష్టంగా జరిగిన జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియను ప్రభుత్వం సరిదిద్దాలి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్తగా పదమూడు జిల్లాలు ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయానికి పాలనాపరమైన పునాది, హేతుబద్ధమైన తర్కం లోపించిందని మానవ హక్కుల వేదిక (HRF) అభిప్రాయపడుతున్నది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది ఆహ్వానించదగ్గ విషయమే. నిజానికి ఎప్పుడో చేయాల్సిన పని. అయితే ఈ పునర్వ్యవస్థీకరణని ఒక విస్తృతమైన, అర్ధవంతమైన ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా చేయకపోవడం విచారకరం.

పైపెచ్చు పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ మొత్తం ఒక పద్ధతి లేకుండా సాగటమే కాక మౌలిక, భౌగోళిక అవగాహన లేకుండా జరిగింది. జిల్లాలని ఇప్పుడు పేర్కొన్న విధంగా పునర్వ్యవస్థీకరిస్తే కనుక రాష్ట్రంలో అనేక ప్రాంతాలు తమ ప్రతిపాదిత జిల్లా కేంద్రం నుండి చాలా దూరంలో ఉండిపోతాయి. కొన్ని చోట్ల కొత్త జిల్లా కేంద్రానికి ప్రజలు వెళ్లాలంటే ఎంతో దూరం వెళ్లాల్సి ఉంటుంది. ఉదాహరణకి పాడేరు జిల్లా కేంద్రంగా ఆల్లూరి సీతారామరాజు జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు. ఆ జిల్లా పరిధిలోకే రంపచోడవరం నియోజకవర్గాన్ని కూడా కలిపారు. ఇదే జరిగితే రంపచోడవరంలో ఒక రెవెన్యూ డివిజన్‌ అయిన ఏటపాక పాడేరు నుండి 277 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రయాణ సమయం ఏడు గంటలకు పైమాటే. అలాగే రంపచోడవరంలోని కూనవరం, వి.ఆర్‌. పురం, దేవీపట్నం, మారేడుమిల్లి లాంటి అనేక మండలాలు పాడేరు నుండి 240 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరంలో ఉంటాయి.

నాన్‌-షెడ్యూల్డ్‌ ప్రాంతంలో పరిస్థితి కూడా ఏమీ మెరుగ్గా లేదు. ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్‌లోని మండలాలు జిల్లా కేంద్రం ఒంగోలు నుండి 140 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరంలో ఉంటాయి. గిద్దలూరు, ఎర్రగొండపాలెం లాంటి ప్రాంతాల నుండి ఒంగోలు చేరుకోవడానికి మూడు గంటలకు పైనే సమయం పడుతుంది. మరో ఉదాహరణ ఒంగోలు నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న కందుకూరు డివిజన్‌ కేంద్రాన్ని తీసుకొచ్చి నెల్లూరు జిల్లాలో కలిపారు. కందుకూరు, నెల్లూరు మధ్య దూరం 112 కిలోమీటర్లు. అంటే జిల్లా కేంద్రం ఇప్పుడు రెండింతల కన్నా ఎక్కువ దూరం అయ్యింది. అలాగే ఒంగోలు నుండి 39 కిలోమీటర్ల దూరంలో ఉన్న అద్దంకిని బాపట్ల జిల్లాలో కలిపారు. ఇక్కడ కూడా జిల్లా కేంద్రం నుండి దూరం రెండింతలు అయ్యింది. కర్నూలులోని హోలగుండం, ప్రతిపాదిత సత్యసాయి జిల్లాలోని అమరాపురం, అగలి, ప్రతిపాదిత ఏలూరు జిల్లాలోని కుకునూరు కూడా తమ తమ జిల్లా కేంద్రాల నుండి 110 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరంలో ఉన్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన ప్రాధమిక ఉత్తర్వు చూస్తే ఇటువంటి విపరీతాలు అనేకం కనపడతాయి. ఊర్లు జిల్లా కేంద్రాల నుండి ఇంతింత దూరంలో ఉంటే కొత్త జిల్లాలు చేసి ప్రయోజనం ఏమిటి? జిల్లాలని ఈ విధంగా విభజిస్తే పునర్వ్యవస్థీకరణ ద్వారా మెరుగైన పాలన తేవాలన్న ప్రభుత్వ లక్ష్యం ఎన్నటికీ నెరవేరదు.

పార్లమెంట్‌ నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాలని పునర్వ్యవస్థీకరించటం అనేది మౌలికంగా లోపభూయిష్టమైన ఆలోచన. ప్రస్తుతం ఉన్న జిల్లాల పరిమాణాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి జిల్లాని మూడు జిల్లాలుగా విభజించాలి అనేది మానవ హక్కుల వేదిక అభిప్రాయం. జూలై 2020లో ఈ ప్రతిపాదన ప్రభుత్వం నుండి మొదటిసారి వచ్చినప్పుడు మేము ఏమి చెప్పామో ఇప్పుడూ అదే చెబుతున్నాము.

రాష్ట్రంలో ప్రస్తుత జిల్లాల్లో ప్రతి జిల్లాని మూడు జిల్లాలుగా పునర్వ్యవస్టీకరిస్తే బావుంటుంది. రాష్ట్రంలో పెద్ద జిల్లాలయిన   అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాలను  నాలుగు జిల్లాలుగా పునర్వవస్థీకరించవచ్చు. మిగిలిన జిల్లాలను ఒక్కొక్కదానిని మూడు జిల్లాలుగా విభజిస్తే రాష్ట్రంలో మొత్తం 39 నుండి 40 జిల్లాలు ఏర్పడతాయి. 1,30,058 చదరపు కిలోమీటర్ల వైశాల్యం గల తమిళనాడులో 38 జిల్లాలు ఉన్నాయనేది గమనార్హం. 1,60,205 చదరపు కిలోమీటర్ల వైశాల్యం గల ఆంధ్రప్రదేశ్‌ తమిళనాడు కంటే పెద్దది. 1,55,707 చదరపు కిలోమీటర్ల వైశాల్యం గల ఒడిషాలో 30 జిల్లాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం 2016లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిపి అప్పటివరకు వున్న 10 జిల్లాలను 38 జిల్లాలను చేసింది. 1,12,077 చదరపు కిలోమీటర్ల వైశాల్యం గల తెలంగాణ విస్తీర్ణం రీత్యా ఆంధ్రప్రదేశ్‌ కంటే చిన్నది. కొత్తగా ఏర్పడే జిల్లాలకు జిల్లా కేంద్రాలను ఎంపిక చేసేటప్పుడు వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వడం, జిల్లా కేంద్రాలు నైసర్గికంగా అన్ని ప్రాంతాలకు దగ్గరగా ఉండటం అనేది దృష్టిలో పెట్టుకోవాలి.

ఇక ఐదవ షెడ్యూల్‌ ప్రాంతానికి వస్తే ప్రస్తుతం చెలామణిలో వున్న ప్రతి సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐ.టీ.డీ.ఏ. ) కేంద్రంగా ఒక జిల్లాను ఏర్పాటు చేయవచ్చు. అనగా, శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట, విజయనగరం జిల్లాలో పార్వతీపురం, విశాఖపట్నం జిల్లాలో పాడేరు, తూర్పు గోదావరి జిల్లాలో రంపచోడవరం, పశ్చిమ గోదావరి జిల్లాలోని బుట్టాయిగూడెం మండలంలో వున్న కోట రామచంద్రపురం, ఖమ్మం నుండి విడగొట్టి ఇటీవల ఏర్పడిన ఐటీడీఏ కేంద్రమైన చింతూరుని జిల్లాలుగా ఏర్పాటు చేయవచ్చు. గోదావరి నది ఆవలిగట్టున వున్న వేలేరుపాడు, కుక్కునూరు మండలాలను చింతూరుతో కలపవచ్చు. ఐదవ షెడ్యూల్‌ ప్రాంతంలో వున్న ఈ జిల్లాలకు గంటం దొర, తమ్మన్న దొర వంటి ఆదివాసీ మృతవీరుల పేర్లు పెట్టవచ్చు.

మానవ హక్కుల వేదిక
ఆంధ్రప్రదేశ్‌
28 జనవరి 2022

Related Posts

Scroll to Top