విశాఖపట్నంలో ప్రమాదకర స్థాయికి చేరుకున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించాలి

విశాఖపట్టణంలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వాయు నాణ్యత సూచి (ఏక్యూఐ) ప్రకారం నగరంలో కాలుష్యం ‘అనారోగ్యకర, తీవ్రంగా అనారోగ్యకర’ స్థాయిలకు పెరిగిపోయింది. చలి కాలంలో ఇది ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. గాలి అత్యంత ప్రమాదకరమైన పిఎం 2.5 ధూళి కణాలతో నిండిపోతోంది.

అభివృద్ధి కోసం శిలాజ ఇంధనాల మీద ఆధారపడటం, తామరతంపరగా పెరుగుతున్న పరిశ్రమలు, ఇబ్బడిముబ్బడిగా పెరిగిన వాహనాలు, వ్యర్థాల దహనం, భవన నిర్మాణాలు అన్నీ కాలుష్యం పెరగడానికి దోహదం చేస్తాయి. వీటి ఫలితంగా పిఎం 10, పిఎం 2.5 ధూళి కణాల శాతం అనారోగ్యకర స్థాయికి పెరిగిపోయింది. నగరంలోని వాయు కాలుష్య నిర్ధారిత స్టేషన్లలో నమోదైన వివరాలే దీనికి తార్మాణం.

విశాఖపట్టణం దక్షిణ భారతదేశంలోనే అత్యంత కాలుష్య నగరం అని గ్రీన్  పీస్‌ సంస్థ వారి తాజా పరిశోధన ప్రకటించింది. తరువాత స్థానంలో హైదరాబాద్‌ నగరం వుంది. రెండూ కూడా అభివృద్ధి నమూనాలేనాయె! ఈ రెండు నగరాలలో కూడా పిఎం 10, పిఎం 2.5 ధూళికణాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ, నేషనల్‌ యాంబియెంట్‌ ఎయిర్‌ క్వాలిటీ స్టాండర్డ్స్‌ సూచించిన పరిమితుల కంటే ఏడెనిమిది రెట్లు ఎక్కువ ఉన్నాయి! 

విశాఖపట్నం పోర్ట్‌ ట్రస్ట్‌ వదిలే బొగ్గు ధూళి సముద్రపు గాలుల కారణంగా నగరం మొత్తం మీద పరుచుకుంటాయి. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాల తరువాత కూడా పరిస్థితిలో పెద్ద మార్పు లేదు. బొగ్గు వాయు వ్యర్థాలను తరుచుగా పీలుస్తూ పోతే ఊపిరితిత్తులు బలహీనపడి గాలి పీల్చడం కష్టం అవుతుంది. ఇతర ప్రభుత్వ, ప్రయివేటు పరిశ్రమలు కూడా యధాశక్తి కాలుష్యానికి కారణమవుతున్నాయి. 

వాస్తవం ఇలా ఉంటే అధికారులు మాత్రం మేము నియంత్రణ కార్యక్రమాలు తగిన రీతిలో చేపడుతున్నామనీ, వాయు కాలుష్యం తగ్గించటానికి ఆధునిక పద్ధతులు పాటిస్తున్నామననీ చెప్పుకుంటున్నారు. ఇవన్నీ ఉత్త గాలి మాటలు. వాయు కాలుష్యం పెరుగుతూనే ఉన్నది. 

చిన్న పిల్లలకు, ముసలి వాళ్ళకు, ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళకి ఈ కాలుష్యం మరింత ప్రమాదకరం. కాలుష్యం తక్కువ స్థాయిలో ఉన్నా కూడా దాని ప్రభావం మానవ ఆరోగ్యం మీద తీవ్రంగా వుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన ‘కొత్త ప్రపంచ వాయు నాణ్యత మార్గదర్శకాలు’ తెలియచేస్తున్నాయి. పిఎం 2.5, పిఎం 10 లాంటి కాలుష్య పదార్థాలను కొద్దిసేపు పీల్చినా చాలు ఊపిరితిత్తుల క్యాన్సర్‌, గుండె జబ్బులు, మెదడు జబ్బులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువనేది ఇప్పడు శాస్త్రీయంగా నిరూపితం అయిన విషయం.

కాలుష్యాన్ని నివారించి ప్రజలనూ, జీవ రాశులనూ సంరక్షించడంలో ప్రభుత్వం విఫలం కావడమనేది ప్రజల జీవన, ఆరోగ్య హక్కులని భంగపరచడమే. కాలుష్యం తీవ్రమై ప్రజల ఆరోగ్యాలు ప్రమాదంలో పడే పరిస్థితికి చేరుకుంటున్నప్పుడయినా ప్రజా ప్రతినిధులు స్పందించకపోవడం విచారకరం. అటు కాలుష్య నియంత్రణ మండలి లాంటి ప్రభుత్వ నియంత్రణ సంస్థలు కూడా ఇలాంటి సందర్భాల్లో కిమ్మనకుండ కూర్చోడం చూస్తే కాలుష్య వ్యతిరేక చట్టాలని ఇసుమంతైనా అమలు చేసే ఉద్దేశ్యం వారికి లేదని అర్థమవుతోంది.

ప్రభుత్వం తగిన చర్యలను తక్షణమే చేపట్టి ప్రజల ఆరోగ్యాలకు భరోసా ఇవ్వాలని మానవ హక్కుల వేదిక డిమాండ్‌ చేస్తూంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి కూడా ప్రస్తుతం అమలులో ఉన్న జాతీయ వాయు నాణ్యత ప్రమాణాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా మార్చాలని మేము కోరుతున్నాము.

మానవహక్కుల వేదిక
ఆంధ్రప్రదేశ్‌
9 ఫిబ్రవరి 2022

Related Posts

Scroll to Top