తుర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెం గ్రామం దళితుల శిరోముండనం కేసు 20 ఏళ్ళకు తుది దశకు చేరుకొన్నది. ఈ కేసులో ముద్దాయిలైన తోట త్రిమూర్తులు, అతని వర్గీయులు ఈ 20 ఏళ్ళలో రాజకీయంగా మరింతగా బలపడ్డారు. వాళ్ళకున్న అధికారంతోను కులపరంగా ఉన్న ఆధిక్యతతోనూ, ఈ కేసును అన్ని రకాలుగా నీరు కార్చడానికి ప్రయత్నించారు. అడుగడుగునా పురోగతిని అడ్డుకున్నారు. వాళ్ళకున్న రాజకీయ బలంతో గ్రామంలో బాధితులకు, వారి తరపు సాక్షులకు న్యాయంగా అందాల్సిన ప్రభుత్వ పథకాల లబ్ది కూడా అందకుండా చేశారు.
బాధితులు న్యాయం కోసం అనేక ఒత్తిళ్ళ మధ్య గత 20 ఏళ్ళుగా పోరాడుతూనే ఉన్నారు. అయితే కేసు విచారణ చివరి స్థాయికి చేరుతున్న ఈ సమయంలో త్రిమూర్తులు అతని వర్గీయులు గ్రామం లోని బాధితులను వారి తరపు సాక్షులను తీవ్రమైన బెదిరింపులకు, ప్రలోభాలకు గురి చేస్తున్నారని బాధితులు మానవ హక్కుల వేదిక సభ్యులకు తెలియజేసారు. చుండూరు, కారంచేడు ఇంకా అనేక ఇతర దళితులపై దాడులు జరిగిన సంఘటనల లోనే బాధితులకు న్యాయం జరగలేదనీ, న్యాయస్థానాలలోనే తమకు న్యాయం జరగకపోతే ఇంక ఎవరిని ఆశ్రయించాలనీ వారు ప్రశ్నించారు. ఈ కేసు కూడా అలాగే అవుతుందని వారు భయాందోళనలకు గురౌతున్నారు.
ప్రాసిక్యూషన్ వారు స్పందించి ముద్దాయిలపై చట్ట పరమైన చర్యలు తీసుకుని బాధితులకు వారి సాక్షులకు భరోసా కల్పించాలనీ, కేసు విచారణ పూర్తయే వరకూ వారికి రక్షణ కల్పించాలనీ మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది.
మానవ హక్కుల వేదిక
ఆంధ్ర – తెలంగాణ రాష్ట్రాల సమన్వయ కమిటీ
07 మార్చి 2017