‘బుల్లీ బాయి’ అనే పేరు మీద ఆన్లైన్లో నకిలీ వేలం వెబ్సైట్ ఒకటి ఏర్పాటు చేసి, అందులో గరిష్ట వేలందారులకు ముస్లిం మహిళల ‘అమ్మకం’ అని ప్రకటించడం హేయమైన చర్యగా మానవ హక్కుల వేదిక (HRF) భావిస్తోంది. సదరు ముస్లిం మహిళలకి మా సానుభూతినీ, మద్దతును తెలియచేస్తున్నాము. ఈ చర్య ద్వారా వందకు పైగా ముస్లిం మహిళలను, ముఖ్యంగా పాత్రికేయులు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలను అత్యంత జుగుప్సాకరమైన రీతిలో వేధించటం జరిగింది. అందులో హైదరాబాద్‌కి చెందిన ఒక సామాజిక కార్యకర్త, ఒక పాత్రికేయురాలు కూడా ఉన్నారు. అనేక విషయాల మీద తమ గొంతుక వినిపిస్తున్న ముస్లిం మహిళలని వాళ్ళ జెండర్, మతం ఆధారం చేసుకుని గొంతెత్తకుండా చెయ్యటానికి హిందుత్వ ట్రోల్స్ ఒక పద్ధతి ప్రకారం చేస్తున్న ప్రయత్నం ఇది.
ఈ యాప్ (App) గిట్ హబ్ అనే ప్లాట్ఫారం మీద నడిచింది. సామాజిక మాధ్యమాలలో వ్యతిరేకత వచ్చిన తరువాతే దీనిని ఆ ప్లాట్ఫారం తొలగించింది. గతేడాది జూలైలో ఇదే రీతిలో ‘సుల్లీ బాయి’ అనే యాప్ ఇలాంటి హేయమైన పనికే దిగింది. కొద్ది వారాల అనంతరం దానిని తొలగించారు. ఆ యాప్‌కి సంబంధించి పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసినా కూడా దానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవటంలో విఫలమయ్యారు. ఈ ఆన్లైన్ వేధింపులని, హింసాత్మక స్త్రీ ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నవారు కేంద్రంలోని పాలకవర్గాలు తమకి కలిగిస్తున్న రక్షణని అడ్డుపెట్టుకుని చెలరేగుతున్నారు.
ఈ యాప్స్ పేర్లే ముస్లిం మహిళలని కించపరిచే ఉద్దేశంతో పెట్టినవి. మహిళలను అవమానపరిచి, బెదిరించి మాట్లాడకుండా చెయ్యటమే ఈ జుగుప్సాకరమైన ఆన్లైన్ లైంగిక వేధింపుల లక్ష్యం అని మేము భావిస్తున్నాము. డిజిటల్ వాతావరణం ఏ విధంగా ముస్లిం ద్వేషం, ముస్లిం మహిళల పట్ల ద్వేషంతో నిండి ఉన్నదో ఈ ఆన్లైన్ అమ్మకాలు మనకి తెలియచేస్తున్నాయి. వారి దిగజారుడుతనం మాటలకి అందనిది.
ఇటువంటి విద్వేష నేరాలకి పాల్పడుతున్న వారిని త్వరితగతిన విచారించి ప్రాసిక్యూట్ చెయ్యాలని అధికారులను మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తున్నది. ఆలాగే గిట్ హబ్ లాంటి సంస్థలు తమ ప్లాట్‌ఫారాలలో ఇటువంటి వేధింపులకి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల వేదిక కోరుతున్నది.
మానవ హక్కుల వేదిక
ఆంధ్ర – తెలంగాణ రాష్ట్రాల సమన్వయ కమిటీ
4 జనవరి 2022