శిరోముండనం కేసులో నేరస్తుడే అభ్యర్థా?

వెంకటాయపాలెం శిరోముండనం కేసులో 29 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత నేరం రుజువైందని నిర్ధారిస్తూ విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు ఏప్రిల్ 16న తీర్పునిచ్చింది. ఈ కేసులో ప్రథమ ముద్దాయి తోట త్రిమూర్తులు వై.ఎస్.ఆర్.సి.పి తరఫున అభ్యర్థిగా నేరస్తునిగా నిర్ధారణ అయిన తర్వాతనే నామినేషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ముద్దాయిలు ఐపిసి 323, 342, 506 మరియు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం లోని sec 3(1)(iiii), 3(1)(x) సెక్షన్ల ప్రకారం నేరాలు చేసినట్లుగా రుజువైందని న్యాయస్థానం నిర్ధారించింది. ఈ సెక్షన్లకు వరుసగా 6, 6, 6, 18, 18 నెలలు జైలు శిక్ష విధించింది.

శిక్షాకాలం కనీసం రెండు సంవత్సరాలు అయితే ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసే అర్హత కోల్పోతారు. కానీ ఈ కేసులో గరిష్ట శిక్ష కాలం 18 నెలలు మాత్రమే కావడంతో చట్టపరంగా అతని అభ్యర్థిత్వానికి ఎటువంటి అడ్డంకి లేదు కానీ మన రాజకీయాలలో నైతికత, సిగ్గులేనితనం ఎంతవరకు దిగజారిపోయాయో ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ఏదో ఆవేశంలో జరిగిన సాధారణ నేరం లాంటిది కాదు. సమాజంలో వేళ్ళూనుకుని ఉన్న కుల అధిపత్యం, అణిచివేత వికృత రూపంలో బయటపడ్డ ఒక సందర్భం.

నేర తీవ్రతకు సరిపడగా శిక్షాకాలం లేదని బాధితులు, వారికి బాసటగా నిలబడ్డ సంఘాలు వాపోతుండగా మళ్లీ నేరస్తున్నే అభ్యర్థిగా నిలబెట్టడం రాజ్యాంగాన్ని, చట్టబద్ధ పాలనను అపహాస్యం చేయడమే. రాజకీయాల్లో నైతిక విలువలకు చోటు లేదని అందరికీ తెలుసు. అయితే ఈ దిగజారుడుతనాన్ని ఎక్కడో ఒకచోట అడ్డుకోకపోతే రాజ్యాంగ వ్యవస్థలే విచ్ఛిన్నమైపోతాయి. దానివల్ల ఎక్కువగా నష్టపోయేది సామాన్య ప్రజలే!

మానవ హక్కుల వేదిక
ఆంధ్రప్రదేశ్

Latest Pamphlets

Scroll to Top