గుంటూరుకు చెందిన పి. రంగనాయకి (60) పై ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం (సి.ఐ.డి.) పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని మానవ హక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్.) ఖండిస్తోంది. ఎల్.జి. పొలిమెర్స్ స్టైరీన్ ఆవిరి లీక్ కేసు దర్యాప్తు గురించి కొన్ని అనుమానాలు వ్యక్తం చేసే పోస్టును తన ఫేస్బుక్ అకౌంట్ లో షేర్ చేసినందుకు ఆమెపై ఐ.పి.సి. సెక్షన్ 153ఏ, 120బి , 188, 505(2), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2008 సెక్షన్ 67 కింద కేసు నమోదు చేశారు. ఇది భావప్రకటనా స్వేచ్ఛపై జరిగిన దాడి తప్ప మరొకటి అనిపించుకోదు. రంగనాయకిపై పెట్టిన క్రిమినల్ కేసును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని హెచ్.ఆర్.ఎఫ్. డిమాండ్ చేస్తోంది. ఆమెపై కేసు నమోదు చేయడం ద్వారా అధికారంలో ఉన్న వారు తమ అసహనాన్ని ప్రదర్శించారు. విషయాలు తెలుసుకోవడం, చర్చించడం, విమర్శించడం, విభేదించడం, నిరసన తెలపడం మొదలైన హక్కులను భారత రాజ్యాంగం కాపాడుతుంది. సమాజం ఆరోగ్యకరంగా, ప్రజాస్వామికంగా కొనసాగాలంటే ఇటువంటి హక్కుల కొనసాగింపు అత్యవసరం. ఈ చర్య ముమ్మాటికీ రాజ్యాంగం కాపాడే హక్కుల ఉల్లంఘన.
రంగనాయకి చేసినదల్లా ఏమిటంటే విశాఖపట్నం ఎల్.జి.పొలిమెర్స్ కేసు దర్యాప్తుకు సంబంధించి సహేతుకమైన 20 ప్రశ్నలను తన ఫేస్బుక్ లో షేర్ చేసుకోవడo. మే 7న ఎల్.జి.పొలిమెర్స్ పరిశ్రమలో స్టైరీన్ ఆవిరి లీకయ్యి 12 మంది చనిపోవడం, వందల మంది ఆస్పత్రిపాలు కావడం, ఆర్.ఆర్. వెంకటాపురం గ్రామ పరిసరాలలో నివసించే వేలాది మంది శారీరిక, మానసిక వేదనకు గురికావడం, ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఇతర సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీయడం మనందరికీ తెలిసిన విషయమే. రంగనాయకి తమ ఫేస్బుక్ పోస్ట్ లో చాలా విలువైనఅంశాలను లేవనెత్తారు.
పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు శాఖ (ఎం.ఓ.ఇ.ఎఫ్.&సి.సి.) నుండి ఆదేశిక పర్యావరణ అనుమతులు పొందకుండా ఎల్.జి.పొలిమెర్స్ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నివారణ మండలి (ఏపీపీసీబీ) నుండి పరిశ్రమ నిర్వహణకు అనుమతి (సి.ఓ.టి.) పొందిందనేది కంపెనీ, ఏపీపీసీబీ ఇరువురూ అంగీకరించిన విషయమే. పర్యావరణ అనుమతి లేకుండా పరిశ్రమను నడపడం క్రిమినల్ నెగ్లిజెన్స్ అవుతుంది. కంపెనీ యాజమాన్యం ఆ నేరానికి పాల్పడటం ద్వారా ప్రాణ నష్టానికి, అనేక మంది శారీరిక, మానసిక అనారోగ్యానికి కారకురాలైంది. ఈ దుర్ఘటన జరిగిన రోజు నుండి ప్రభుత్వ ప్రతినిధులు నష్ట పరిహారం గురించి మాట్లాడుతున్నారే కానీ కంపెనీ, దాని యాజమాన్యం, సిబ్బందిలపై జరగాల్సిన నేర పరిశోధన, దర్యాప్తు, క్రిమినల్ లయబిలిటీ గురించి మాట్లాడటం లేదు. దుర్ఘటన జరిగి 13 రోజులైంది. ఇప్పటి వరకు ఒక్క వ్యక్తిని కూడా అరెస్ట్ చెయ్యలేదు. ఎల్.జి. పొలిమెర్స్ స్టైరీన్ ఆవిరి లీక్ కేసు ఒక యాదృచ్చిక దుర్ఘటన కాదు. అది ఒక కార్పొరేట్ క్రైమ్. నిందితులపై విచారణ జరిపి నేరస్థులకు శిక్షలు పడాలనే విషయం మనం ఎందుకు మరిచిపోతున్నాము? విలువైన సాక్ష్యాధారమైన స్టైరీన్ ఎల్.జి.పొలిమెర్స్ ఆవరణ నుండి నౌకల ద్వారా సౌత్ కొరియాకి తరలించడం అనేక ప్రశ్నలను రేపుతోంది. దర్యాప్తు బృందం సాక్ష్యాధారాలు సేకరిస్తోందా? నిందితులు సాక్ష్యాధారాలను నాశనం చేయకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటోంది? ఇవి సహజంగా తలెత్తే ప్రశ్నలు. ఇటువంటి ప్రశ్నలు తలెత్తకుండా ఉండాలంటే ఈ కేసులో నేర పరిశోధన పేరిట ఏమి జరుగుతుందో ప్రభుత్వం బాధితులతో, ప్రజలతో సమాచారం పంచుకోవాలి.
ఇంత మంది ప్రాణ నష్టానికి, అనారోగ్యానికి, వేదనకు కారకులైన నేరస్థులు బాహాటంగా తిరుగుతూ సాక్ష్యాధారాలను రూపుమాపుతూ యథేచ్ఛగా నేరాలు చేసుకుంటూ పోతుంటే వారిపై చర్యలు తీసుకోకుండా ఆ నేరానికి సంబంధిoచిన కొన్ని మౌలిక ప్రశ్నలను రేపిన ఒక పౌరురాలిపై కేసు పెట్టడం నిజంగా విచారకరం. ఎల్.జి.పొలిమెర్స్ మీద ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేస్తే సరిపోదు. జరిగినది కిరాతకమైన నేరం. అధికారులు నేర విచారణ జరిగి నేరస్థులకు శిక్షలు పడేవిధంగా చర్యలు తీసుకోవాలి. 12మంది తమ విలువైన ప్రాణాలు, అనేక మంది తమ జీవనోపాధి కోల్పోయారు. ప్రజా ఆరోగ్యం దెబ్బతిన్నది. ఇంతటి నేరాన్ని చూసీ చూడనట్లు పోవడం కూడానేరమనిపించుకుంటుంది.
మానవ హక్కుల వేదిక
ఆంధ్రప్రదేశ్
20 మే 2020