హక్కుల కార్యకర్తల మీద ఉపా కేసులు అన్యాయం

మానవ హక్కుల వేదిక (హెచ్‌. ఆర్‌.ఎఫ్‌) ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు వి.ఎస్‌. కృష్ణమీద; ఇతర హక్కుల, దళిత, సాహిత్య సంఘాల బాధ్యుల మీదా విశాఖపట్నం జిల్లా ముంచింగిపుట్టు పోలీసుస్టేషన్లో, గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ పోలీసు స్టేషన్లో నమోదు చేసిన రెండు ఎఫ్‌.ఐ.ఆర్‌లలో పోలీసులు చేసిన ఆరోపణలు ప్రజల నిరసించే హక్కుపై జరిగిన దాడి తప్ప మరొకటి కాదు. ధిక్కార స్వరాల గొంతు నులిమి భయోత్పాతం సృష్టించడమే వారి ఉద్దేశ్యం. ఆ ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని, అభూతకల్పనలని అనడానికి మాకు ఎటువంటి సందేహం లేదు.

మానవ హక్కుల వేదికకు చెందిన వి.ఎస్‌. కృష్ణ వాకపల్లి మహిళలచే పోలీసులకు వ్యతిరేకంగా అబద్ధపు సాక్ష్యం చెప్పించారని ముంచింగిపుట్టు ఎఫ్‌.ఐ.ఆర్‌లో ఆరోపించారు. ఇంతకంటే విచిత్రమైన ఆరోపణ మరొకటి ఉండదు. గ్రే హౌండ్స్ పోలీసులచే లైంగిక అత్యాచారానికి గురైన 11 మంది వాకపల్లి మహిళలు న్యాయం కోసం 2007 నుండి చేస్తున్న పోరాటానికి ఇతర ఆదివాసీ, మహిళా, ప్రజా సంఘాలతో పాటు హెచ్‌. ఆర్‌.ఎఫ్‌. కూడా మద్దతు తెలుపుతూ వచ్చింది. వాకపల్లి మహిళల దృఢ సంకల్పంతో పాటు 2012లో హైకోర్టు, 2017లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం వల్లే విశాఖపట్నంలోని ఎస్‌.సి., ఎస్‌.టి. ప్రత్యేక కోర్టులో ఆ కేసు విచారణ ఇప్పుడు జరుగుతున్నది. ఈ కేసులో మొతం13 మంది పోలీసు సిబ్బందిపై విచారణ జరుగుతోంది. అత్యాచారానికి గురైన 11 మంది మహిళలలో ఇద్దరు చనిపోగా మిగిలిన 9 మంది కోర్టుకి హాజరై సాక్ష్యం చెప్పారు.

కోర్టు విచారణలో పాల్గొని సాక్ష్యం చెప్పేందుకు వచ్చిన వాకపల్లి మహిళలకు భోజన వసతులు కల్పించడంలో ఇతర సంఘాలతో పాటు హెచ్‌.ఆర్‌.ఎఫ్‌. కూడా సహకరించింది.చట్టబద్ధంగా జరుగుతున్న కేసు విచారణలో సుదూర ప్రాంతాల నుండి వచ్చిన బాధిత ఆదివాసీ మహిళలకు భోజన వసతులు కల్పించడం ఏ రకంగా నేరమౌతుందో మాకు అర్థం కాని విషయం.

ఇన్నేళ్ళుగా వాకపల్లి మహిళల పోరాటానికి సంఘీభావం తెలుపుతూ వచ్చినందుకు, హక్కుల పోరాటాన్ని కొనసాగిస్తున్నందుకు వి.ఎస్‌.కృష్ణను భయపెట్టాలని పోలీసులు భావించినట్టున్నారు. ఇది కక్షసాధింపు చర్య తప్ప మరొకటి కాదు. వారు ఏ స్థాయికి దిగజారారంటే ఆయన మీద మౌలిక స్వేచ్ఛలను కాలరాసే అప్రజాస్వామిక ‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టాన్ని (ఉపా)’ ప్రయోగించారు. ఇటీవల కాలంలో హక్కుల ఉల్లంఘన గురించి ప్రశ్నించే వారిపై, పీడిత వర్గాల ఆవేదనను ఎత్తిచూపే వారిపై, ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను, అక్రమ చర్యలను వ్యతిరేకించే వారిపై అనేక రాష్ట్రాల్లో ఇదే చట్టాన్ని ప్రయోగిస్తున్న విషయం మనందరం గమనిస్తూనే ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లా లోని తాడ్వాయి పోలీస్‌ స్టేషన్లో నవంబర్‌ 2, 2020 నమోదయిన ఎఫ్‌.ఐ.ఆర్‌ లో తెలంగాణ రాష్ట్ర హెచ్‌.ఆర్‌.ఎఫ్‌ ఉపాధ్యక్షుడు ఆత్రం భుజంగరావు, ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, కొమరం భీమ్ ఆసిఫాబాద్‌ జిల్లా హెచ్‌.ఆర్‌.ఎఫ్‌ అధ్యక్షుడు కనక వెంకటేశ్‌ల మీద కూడా ఇదే ఉపా చట్టాన్ని ప్రయోగించారు. పోలీసులు తమకు లభించిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ పచ్చి అబద్ధాలతో కూడిన ఎఫ్‌.ఐ.ఆర్‌లను నమోదు చేయగల్గుతున్నారంటే మనం ఎటువంటి నియంతృత్వ, అనైతిక కాలంలో బ్రతుకుతున్నామో అర్థమవుతోంది.

హెచ్‌.ఆర్‌.ఎఫ్‌ ఏ రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థ కాదు. విశాల ప్రాతిపదిక గల ఒక స్వతంత్రమైన మానవ హక్కుల ఉద్యమం అవసరమని భావించి మేము 1998 లో ఈ సంస్థను ఏర్చర్చుకున్నాం. ప్రతి మనిషికీ ఒకే విలువ, గౌరవం సాధించడమే మానవ హక్కుల సారాంశం అని మేము నమ్ముతాం. రాజ్యాంగపరంగానూ, అంతర్జాతీయంగానూ గుర్తింపు పొందిన హక్కులను కాపాడటానికే గాక, జాతీయంగా, అంతర్జాతీయంగా ఇప్పటివరకు గుర్తింపుకు నోచుకోని కొత్త హక్కులను సాధించుకొనే ప్రజల తరపున కూడా సమాజంలో మానవ హక్కుల సంస్కృతిని పెంపొందించడానికి హెచ్‌.ఆర్‌.ఎఫ్‌ కృషి చేస్తోంది. ఈ కృషిని మేము కొనసాగిస్తూనే ఉంటాం. అసత్యాలతో కూడిన ఈ ఎఫ్‌.ఐ.ఆర్‌లను వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్‌ చేస్తున్నాం.

మానవహక్కుల వేదిక
ఆంధ్ర -తెలంగాణ రాష్ట్రాల సమన్వయ కమిటీ
27 నవంబర్‌ 2020

Related Posts

Scroll to Top