Pamphlets

ప్రతి మనిషికి ఒకే విలువ కోసం – 25 సంవత్సరాల హక్కుల కార్యాచరణ

తెలుగు రాష్ట్రాలలో యాభై సంవత్సరాలుగా సాగుతున్న హక్కుల ఉద్యమ ప్రస్థానంలో చిగురించిన విలువలను, అమరుల జ్ఞాపకాలను, విలువైన అనుభవాలను మూట కట్టుకొని అనేక కొత్త ఆశలతో, ఆలోచనలతో, సందిగ్ధ ప్రశ్నలతో 25 సంవత్సరాల క్రితం ఈ ప్రయాణం మొదలుపెట్టాం. హక్కుల దృక్పథం మీద జరిగిన సుదీర్ఘమైన, విలువైన చర్చల పర్యావసానంగా 1998లో HRF ఏర్పడింది. HRF ఒక విశాల దృక్పథంతో, స్వతంత్రంగా పనిచేసే హక్కుల సంస్థగా నిలబడి ఎదగడానికి వ్యవస్థాపక సభ్యులు వేసిన తాత్విక పునాదే కారణం. విలువల ఆధారంగా దగ్గరైన మనుషులు వాళ్ళు చేసే పని ద్వారా సమాజంలో హక్కుల సంస్కృతిని అభివృద్ధి చేస్తూ, వేళ్ళూనుకుని ఉన్న అనేక రకాల అసమానతలను, ఆధిపత్యాన్ని అణచివేతలను ఏదో ఓమేరకు తగ్గించే దిశగా కృషి చేయగలరని HRF ప్రయాణం గమనిస్తే అర్ధమౌతుంది. రాజ్యం, కులం, మతం, వర్గం, హిందుత్వ జెండర్‌, లైంగికత తదితర ఆధిపత్య వ్యవస్థల వలన అణచివేతకు గురౌతున్న అనేక ప్రజా సమూహాలకు HRF మద్దతుగా నిలబడింది.