Pamphlets

మీ ఏడో హామీ ఏమైంది? పోలీసు హింసను అదుపు చేయరా?

బి.ఆర్‌.ఎన్‌ నిరంకుశ పాలనను తిరస్కరించి రాష్ట్రంలోని ప్రజలు, ప్రజాస్వామికవాదులు, పౌర సంస్థలు కలిసి కాంగ్రెస్‌ పార్టీకి అండగా నిలబడి అధికారం ఇచ్చారు. మీ పరిపాలన కూడా 9 నెలలు పూర్తి చేసుకుంటున్నది. ఎన్నికలకు ముందే మీరు ప్రజలకు ‘ఆరు గ్యారంటీలు’ ఇచ్చారు. ఎన్నికలు దగ్గర పడ్డాక రాష్టంలో గత పదేళ్లుగా ప్రజాస్వామిక వాతావరణాన్ని కోల్పోవటం పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారనే విషయం గ్రహించి ‘ఏడవ హామీ’గా ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉంటుందని చెప్పారు. అదే విషయాన్ని మొదటి అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి స్థాయిలో పునరుద్ఘాటించారు. ఈ ఆగస్టు పదిహేనున కూడా మీరు ‘ఏడవ గ్యారెంటీ అయిన ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తున్నాం’ అని మరోసారి భరోసా ఇచ్చారు. మొదట ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఆచరణాత్మకం చేయటం కోసం ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నారు. అందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాం. అయితే ఏడవ హామీకి సంబంధించి విధానపరంగా ఒక్క అడుగు కూడా ముందుకు పడ్డట్టు కనిపించడం లేదు.