శిరోముండనం తీర్పు….. నేరానికి తగిన శిక్షేనా?

శిరోముండనం కేసులో ఆద్యంతం విచారణను వాయిదాలు వేయించడానికి, శిక్ష నుంచి పూర్తిగా తప్పించుకోవడానికి నిందితులు ఇంతకాలంగా ఎన్నెన్ని అడ్డదారులు తొక్కారో! ఎవరి ప్రలోభాలకి లొంగని, ఎటువంటి బెదిరింపులకి జంకని బాధితులకు అడుగడుగునా మరెన్ని అడ్డంకులు సృష్టించారో!! అని పరిశీలించిన వారికి ఆశ్చర్యం, ఆగ్రహం కలగక మానవు.

28 సంవత్సరాల పాటు ఈ కేసు విచారణా క్రమంలో అనేక వాయిదాలు వేసిన పిమ్మట, మితిమీరిన జాప్యం చేసిన తర్వాత ఎట్టకేలకు ఈ ఏడాది ఏప్రిల్ లో తీర్పు వెలువడింది. ప్రధాన ముద్దాయి తోట త్రిమూర్తులుకి విశాఖపట్నం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం 18 నెలలు జైలు శిక్ష విధించింది. నిజానికిది నామమాత్రపు శిక్ష. దీని నుంచి సైతం నిందితులు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో విధంగా శిక్షని అమలు కానీయకుండా పథకాలు వేస్తున్నారు. బహుశా ఈ స్వల్పమైన శిక్ష నుంచి మరింత మినహాయింపు కోసం దారులు వెతుకుతున్నారు.

లేకపోతే శిరోముండనం సంఘటన ఏనాటిది! దాదాపుగా ముప్పయేళ్ళు కావొస్తుంది. రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం గ్రామంలోని దళిత యువకులు కోటి చినరాజు, దడాల వెంకటరత్నంలకు అప్పటి శాసనసభ్యుడు తోట త్రిమూర్తులు, అతడి అనుచరులు 29 డిసెంబర్ 1996న శిరోముండనం చేయించారు. మరో ముగ్గురు దళిత యువకులు చల్లపూడి పట్టాభిరామయ్య, కనికెళ్ళ గణపతి, పువ్వుల వెంకటరమణలను చిత్రహింసలకు గురిచేశారు. అందుకు కారణం 1994 ఎన్నికల్లో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన తోట త్రిమూర్తులుకి ఈ దళిత యువకులు విధేయంగా లేకుండా బిఎస్పీకి అనుకూలంగా పనిచేయడమే.

నిజానికి ఈ సంగతులు నేటి తరం విని ఉండదు. ఎరిగిన వారిలో చాలామందికి పూర్తి వివరాలు తెలియవు. బాధితులు రాజీ పడ్డారనుకున్నారు కొందరు. అమ్ముడుపోయారేమో అనుకున్నారు మరికొందరు. ఒక దశలో అటువంటి దుష్ప్రచారమూ జరిగింది. అందుకే 2018 సెప్టెంబరులో “శిరోముండనం నిందితులను ఈ ప్రభుత్వం, న్యాయస్థానాలు శిక్షిస్తాయా?” అంటూ కేసు పూర్వాపరాలతో, నిజానిజాలతో కూడిన కరపత్రంతో మానవ హక్కుల వేదిక, దళిత ఐక్య పోరాట వేదిక బాధితులతో కలిసి జిల్లా వ్యాప్తంగా ప్రచార యాత్ర నిర్వహించాయి. సభలు, సమావేశాలు ఏర్పాటు చేశాయి. ఈ క్రమంలో దళిత ఐక్య పోరాట వేదిక నాయకుల మీద ప్రస్తుతానికి నాలుగు కేసులు నమోదయ్యాయి.

రమారమి మూడు దశాబ్దాలుగా ‘శిరోముండనం’ అనే అవమానాన్ని బాధితులు తమ మెడలో గుదిబండగా మోసుకు తిరుగుతున్నారు. అందుకే వారిది ఒకే ఒక డిమాండ్. కేవలం న్యాయం కావాలి! కచ్చితమైన న్యాయం కావాలి!! ఇదే ఏకైక నినాదం. అంతే తప్ప మరొక చర్చనీయాంశం లేదు. అందుకోసమే తమ జీవితాల్లో ఎంతో విలువైన కాలాన్ని వెచ్చించారు. నిష్పక్షపాతమైన తీర్పు కోసమే ఏ రోజుకారోజు ఎదురుచూస్తున్నారు. నిజానికిది ప్రశంసనీయమైన నిబద్ధత, అరుదైన ఆత్మగౌరవ పోరాటం.

ఒకవైపు బలవంతులైన ముద్దాయిలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా నానాటికీ మరింత శక్తివంతులు అవుతున్నారు. మొదట నుంచి ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే తోట త్రిమూర్తులు ఆ పార్టీలో ఉంటాడు. ప్రధాన స్రవంతి రాజకీయాల్లో అధికార పార్టీకి, ప్రధాన ముద్దాయికి ఎవరి ప్రయోజనాలు వారికి ఉంటాయి. కాబట్టి కేసు విచారణలో పురోగతిని అడ్డుకుంటున్నారు. మరోపక్క బాధితులు మాత్రం ప్రభుత్వ పథకాలు సైతం సక్రమంగా పొందలేని స్థితిలో కాలం వెళ్ళదీస్తున్నారు. అంతెందుకు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టప్రకారం రావలసిన నష్టపరిహారం ఈనాటికీ వారికి అందనే లేదు.

శిరోముండనంతో వారు తలవంపుల పాలయ్యింది ఒక ఎత్తయితే; ప్రభుత్వాలు, న్యాయస్థానాల వివక్షపూరితమైన తీరుతెన్నులతో జరిగిన అవమానం మరో ఎత్తు. అయినప్పటికీ చట్టాలంటే నమ్మకం సడలకుండా, న్యాయస్థానాల వైఖరి ఎడల విముఖత లేకుండా పట్టుదలతో నిలబడ్డారు. ఈ క్రమంలో ఆది నుంచి నేటికీ ఎన్నో పరీక్షలు, సమస్యలు, వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఆఖరికి బాధితులు ఎస్సీలు కాదనే కొత్త వాదనని ముద్దాయిలు లేవనెత్తితే, తమను తాము దళితులుగా నిరూపించుకున్నారు. కానీ ఇవాళ తమ పిల్లల చదువుసంధ్యలకి అవసరమైన కులధ్రువీకరణ పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

ఇటువంటి నేపథ్యంలో కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఇది నేరానికి సరితూగే శిక్ష కాదు. కేవలం గుడ్డిలో మెల్ల వంటిది. నిందితులు నేరస్తులని చట్టపరంగా నిర్థారించడంలో న్యాయస్థానం నిష్పక్షపాతంగా వ్యవహరించి ఉండవచ్చు. కానీ శిక్షాకాలాన్ని ఖరారు చేయడంలో ఉదారవైఖరిని అవలంబించింది. ఎస్సీ, ఎస్టీ చట్టం మేరకు ఈ కేసులోని రెండు సెక్షన్లలో గరిష్టంగా అయిదేళ్ళ వరకు ప్రొవిజన్ ఉంది. అయినా కేవలం 18 నెలలు మాత్రమే శిక్షాకాలాన్ని ఖరారు చేసింది. అంటే నేరం యొక్క కులాధిపత్య స్వభావాన్ని పరిగణనలోకి తీసుకోలేదని మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రస్తుతం హైకోర్టులో అప్పీలులో ఉన్న ఈ కేసు విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని, నేరానికి తగినట్టు నిందితులకు శిక్షాకాలాన్ని పెంచాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది.

బాధితుల దీర్ఘకాలిక పోరాటానికి నూరు శాతం న్యాయమైన ఫలితం లభించని ప్రస్తుత సందర్భంలో ఎటువంటి కార్యాచరణ రూపొందించుకోవాలి? అనే అంశంపై నేడు చర్చించవలసి ఉంది. శిరోముండనం బాధితులతో కలిసి నిర్వహిస్తున్న ఈ సదస్సులో పలు ప్రజాసంఘాల నాయకులు, హక్కుల సంఘాల కార్యకర్తలు, పలువురు న్యాయవాదులు, ఆలోచనాపరులు పాల్గొంటారు. మిమ్మల్ని సాదరంగా ఆహ్వనిస్తున్నాం.

సదస్సు : 16 జూన్ 2024 ఆదివారం
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు
కిరాణా మర్చంట్ హాల్, అమలాపురం

వక్తలు:
బాధితులు: చల్లపూడి పట్టాభిరామయ్య & కోటి చినరాజు
దళిత ఐక్య పోరాట వేదిక నాయకులు: చీకట్ల వెంకటేశ్వరరావు, గుబ్బల శ్రీనివాసరావు, వెంటపల్లి భీమశంకరం
మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యులు: కె సుధ
వివిధ సంఘాల ప్రతినిధుల సందేశాలు

దళిత ఐక్య పోరాట వేదిక
వెంకటాయపాలెం

మానవ హక్కుల వేదిక
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా

Latest Pamphlets

Scroll to Top