Pamphlets
మీ ఏడో హామీ ఏమైంది? పోలీసు హింసను అదుపు చేయరా?
బి.ఆర్.ఎన్ నిరంకుశ పాలనను తిరస్కరించి రాష్ట్రంలోని ప్రజలు, ప్రజాస్వామికవాదులు, పౌర సంస్థలు కలిసి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి అధికారం ఇచ్చారు. మీ పరిపాలన కూడా 9 నెలలు పూర్తి చేసుకుంటున్నది. ఎన్నికలకు ముందే మీరు ప్రజలకు ‘ఆరు గ్యారంటీలు’ ఇచ్చారు. ఎన్నికలు దగ్గర పడ్డాక రాష్టంలో గత పదేళ్లుగా ప్రజాస్వామిక వాతావరణాన్ని కోల్పోవటం పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారనే విషయం గ్రహించి ‘ఏడవ హామీ’గా ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉంటుందని చెప్పారు. అదే విషయాన్ని మొదటి అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి స్థాయిలో పునరుద్ఘాటించారు. ఈ ఆగస్టు పదిహేనున కూడా మీరు ‘ఏడవ గ్యారెంటీ అయిన ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తున్నాం’ అని మరోసారి భరోసా ఇచ్చారు. మొదట ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఆచరణాత్మకం చేయటం కోసం ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నారు. అందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాం. అయితే ఏడవ హామీకి సంబంధించి విధానపరంగా ఒక్క అడుగు కూడా ముందుకు పడ్డట్టు కనిపించడం లేదు.
శిరోముండనం తీర్పు….. నేరానికి తగిన శిక్షేనా?
ఒకవైపు బలవంతులైన ముద్దాయిలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా నానాటికీ మరింత శక్తివంతులు అవుతున్నారు. మొదట నుంచి ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే తోట త్రిమూర్తులు ఆ పార్టీలో ఉంటాడు. ప్రధాన స్రవంతి రాజకీయాల్లో అధికార పార్టీకి, ప్రధాన ముద్దాయికి ఎవరి ప్రయోజనాలు వారికి ఉంటాయి. కాబట్టి కేసు విచారణలో పురోగతిని అడ్డుకుంటున్నారు. మరోపక్క బాధితులు మాత్రం ప్రభుత్వ పథకాలు సైతం సక్రమంగా పొందలేని స్థితిలో కాలం వెళ్ళదీస్తున్నారు. అంతెందుకు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టప్రకారం రావలసిన నష్టపరిహారం ఈనాటికీ వారికి అందనే లేదు. శిరోముండనంతో వారు తలవంపుల పాలయ్యింది ఒక ఎత్తయితే; ప్రభుత్వాలు, న్యాయస్థానాల వివక్షపూరితమైన తీరుతెన్నులతో జరిగిన అవమానం మరో ఎత్తు. అయినప్పటికీ చట్టాలంటే నమ్మకం సడలకుండా, న్యాయస్థానాల వైఖరి ఎడల విముఖత లేకుండా పట్టుదలతో నిలబడ్డారు. ఈ క్రమంలో ఆది నుంచి నేటికీ ఎన్నో పరీక్షలు, సమస్యలు, వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఆఖరికి బాధితులు ఎస్సీలు కాదనే కొత్త వాదనని ముద్దాయిలు లేవనెత్తితే, తమను తాము దళితులుగా నిరూపించుకున్నారు.







