శిరోముండనం కేసులో నేరస్తుడే అభ్యర్థా?
శిక్షాకాలం కనీసం రెండు సంవత్సరాలు అయితే ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసే అర్హత కోల్పోతారు. కానీ ఈ కేసులో గరిష్ట శిక్ష కాలం 18 నెలలు మాత్రమే కావడంతో చట్టపరంగా అతని అభ్యర్థిత్వానికి ఎటువంటి అడ్డంకి లేదు కానీ మన రాజకీయాలలో నైతికత, సిగ్గులేనితనం ఎంతవరకు దిగజారిపోయాయో ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ఏదో ఆవేశంలో జరిగిన సాధారణ నేరం లాంటిది కాదు. సమాజంలో వేళ్ళూనుకుని ఉన్న కుల అధిపత్యం, అణిచివేత వికృత రూపంలో బయటపడ్డ ఒక సందర్భం. నేర తీవ్రతకు సరిపడగా శిక్షాకాలం లేదని బాధితులు, వారికి బాసటగా నిలబడ్డ సంఘాలు వాపోతుండగా మళ్లీ నేరస్తున్నే అభ్యర్థిగా నిలబెట్టడం రాజ్యాంగాన్ని, చట్టబద్ధ పాలనను అపహాస్యం చేయడమే. రాజకీయాల్లో నైతిక విలువలకు చోటు లేదని అందరికీ తెలుసు. అయితే ఈ దిగజారుడుతనాన్ని ఎక్కడో ఒకచోట అడ్డుకోకపోతే రాజ్యాంగ వ్యవస్థలే విచ్ఛిన్నమైపోతాయి. దానివల్ల ఎక్కువగా నష్టపోయేది సామాన్య ప్రజలే!