రిజర్వేషన్ల వర్గీకరణ – ప్రజాస్వామిక దృక్పథం
తమ న్యాయమైన వాటా అడిగే వర్గానికి, ముఖ్యంగా నాయకత్వానికి, తమ ఈ భౌతిక పరిస్థితికి కారణం ఎవరు, మనం ఎవర్ని లక్ష్యంగా చేసుకుంటున్నాం, దాని పర్యవసానాలు ఏమిటి అనేది అవగాహన ఉండాలి. తమ డిమాండు ఎంత న్యాయమైనదైనా తమ వేదికల నుండి వెళ్లే సందేశం దీర్ఘకాలికంగా నష్టం చేయకుండా ఉండాలి . ముఖ్యంగా సామాజిక అంతరాల పరిష్కారంలో అవతలి పక్షం మనసులు గెల్చుకోవటం అనేది సమస్య పరిష్కారాన్ని ఎంతో సులభతరం చేస్తుంది. అలాగే ఏ కారణాల వలన తాము ఒక న్యాయమైన సదుపాయాన్ని సాధించుకున్నామో దాన్ని తమలోని వారికే నిరాకరించడం, అందుకు ఆధిపత్య కులాల వారి వాదనలనే ఆలంబన చేసుకోవడం వర్గీకరణ వ్యతిరేకవాదులకు కూడా తగని పని. తమ వెనుకబాటుకు ఏ రకంగా కూడా కారణం కాని, తమతో పాటు సామాజిక వెలిని అనుభవించిన కులంలోని తటస్తుల, ఉదారవాదుల మద్దతునైనా మాదిగ ఉద్యమం కూడగట్టుకోలేకపోవడం ఒక సమస్య అయితే, మాల వర్గంలోని మేధావులు ఈ విషయంలో తీసుకోవాల్సినంత చొరవ తీసుకోకపోవడం మరో సమస్య. ఏది ఏమైనా అది గతచరిత్ర. ఇప్పుడు ఒక ప్రత్యేక దశకు చేరుకున్నాం. వర్గీకరణను ఇంకా వ్యతిరేకిస్తూ వస్తున్న వాదనల్లో చాలావరకు కాలం చెల్లినవి లేదా పూర్తిగా అసంబద్ధమైనవి. వర్గీకరణను ఎలా చేయాలన్న విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. వాటిని హేతుబద్ధంగా పరిష్కరించుకోవచ్చు.