కార్సొరేట్‌ నేరానికి పాల్పడిన ఎల్‌.జి.పాలిమర్స్ యాజమాన్యాన్ని ప్రాసిక్యూట్‌ చేయాలి

విశాఖపట్నంలోని ఎల్.జి పాలిమర్స్‌ కర్మాగారంలో 7 మే 2020 ఉదయాన్నే జరిగిన ప్రమాదానికి యాజమాన్యం, నియంత్రణ అధికారుల నేరపూరిత నిర్లక్ష్యమే కారణం. వారిని చట్టప్రకారం ప్రాసిక్యూట్‌ చేయాలని మానవహక్కుల వేదిక (హెచ్‌. ఆర్‌. ఎఫ్‌.) కోరుతోంది. గతంలో ఇలాంటి ఘటనలలో చేసినట్టుగా ఎల్‌.జి. పాలిమర్‌ మీద నమోదు చేసిన కేసును నీరుగార్చకూడదనీ, త్రికరణశుద్ధితో దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాము.

ఎల్‌.జి. పాలిమర్స్‌ నిబంధనలకు కట్టుబడి ఉండే ‘మంచి కంపెనీ’గా, పేరొందిన బహుళజాతి సంస్థగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్ణించడాన్ని హెచ్‌.ఆర్‌. ఎఫ్‌. తీవ్రంగా ఖండిస్తోంది. లాక్డౌన్ విధించిన ఈ గడ్డు రోజుల్లో 11 మంది మరణానికీ, వందలాది మంది అనారోగ్యానికీ కారణమైన విషవాయువు లీక్‌ ఘటన నగరంలో భీతావహ వాతావరణం సృష్టించింది. ఈ కంపెనీ కాలుష్య నియంత్రణ నియమాలను ఉల్లంఘించి కాన్సర్‌ వ్యాధికి దారి తీయగల వినైల్‌ క్లోరైడ్‌ రసాయనాన్ని ప్రమాణాల కంటే 15 రెట్లు మించి గాలిలో వదిలిందని, ఆ విషయం కప్పిపెట్టడానికి వాయు కాలుష్యానికి సంబంధించిన వివరాలను తారుమారు చేసిందని దక్షిణ కొరియా ప్రభుత్వం 2019 ఏప్రిల్‌లో బయటపెట్టింది.

ఈ విషవాయువు ఎటువంటి దీర్ఘకాల అనారోగ్యాలకు దారితీస్తుందో మనకు ఇంకాపూర్తిగా తెలీదు. అంతేకాదు ఈ కంపెనీ తాను కొన్నేళ్ళ పాటు ప్రాధమిక స్థాయిలో సైతం పర్యావరణ నియమాలను పాటించలేదని రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా సంస్ధ (ఎస్‌.ఇ.ఐ.ఏ.ఏ.) ముందు గతేడాది మేలో స్వయంగా ఒక అఫిడవిట్‌ దాఖలు చేసింది.

ఈ ప్రమాదం ఒక కార్పొరేట్‌ నేరం. దాన్ని సాధారణీకరించడం, తీవ్రతను పలచన చేయడం, ఇదేమంత పెద్ద విషయం కాదులెమ్మన్నట్లు మాట్లాడడం అత్యంత హేయమైన పనులు. భోపాల్‌ బాధితులకు గత 35 ఏళ్ళుగా జరుగుతున్న అన్యాయాన్ని ఇంతలోనే మరిచారా? 

విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమలు పర్యావరణ, భద్రతా నియమాలను యథేచ్చగా ఉల్లంఘించడాన్ని కొన్ని దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాము. ఎటువంటి ప్రమాదం పొంచి ఉన్నదో తెలిసి కూడా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్ల వ్యవస్థ వంటి నియంత్రణ సంస్థలు ఈ నేరాలను చూసీచూడనట్లు పోతున్నాయి. జనాభా అధికంగా నివసించే ప్రాంతంలో ఒక రెడ్‌ క్యాటగిరీ ప్రమాదకర పరిశ్రమని పని చేయనిచ్చి, దాని సామర్ధ్యాన్ని పెరగనిచ్చిన టౌన్‌ ప్లానింగ్‌ సంస్థ కూడా ఈ ప్రమాదానికి బాధ్యత వహించాలి.

ఇటువంటి నిర్లక్ష్య వైఖరి వల్ల ఎంత మంది ప్రాణాలు కోల్పోయినా ఇప్పటివరకు ఈ సంఘటనకు జవాబుదారులు ఎవరో తేల్చడం కానీ, వారిని ప్రాసిక్యూట్‌ చేయడం కానీ జరగలేదు. ఇటువంటి సందర్భాల్లో నేరాలను కప్పిపుచ్చడం, అబద్ధాలు చెప్పడం, ఎవరో ఒకరిని బలి పశువులను చేయడం, నష్టపరిహారం ఇచ్చి కేసులు మూసేయడం సర్వసాధారణం అయిపోయింది. ఇందువల్ల శిక్షలు పడతాయనే భయం ఎవరికీ లేకుండా పోయింది. ఫలితమేమంటే విశాఖపట్నం ఒక పారిశ్రామిక మందుపాతరగా మారింది.

ఎల్‌.జి. పాలిమర్స్‌ యాజమాన్యం పర్యావరణ పరిరక్షక చట్టం-1986, ప్రమాదకర రసాయనాల తయారి, నిలువ, దిగుమతి నియమాలు-1989 లను ఉల్లంఘించిందన్నది స్పష్టంగానే అర్థమవుతూ ఉంది. 1989 నియమాల ప్రకారం ‘styrene’ ఒక ప్రమాదకర, విషపూరిత రసాయనం. ఇటువంటి విష పదార్ధాలను పరిశ్రమలలో నిల్వ ఉంచినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లాక్డౌన్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా పాటించవలసి ఉంది. కాని ఎల్‌.జి. యాజమాన్యం ఈ జాగ్రత్తలు పాటించలేదనేది సుస్పష్టంగా అర్థమౌతూనే ఉన్నది. లాక్డౌన్ నిబంధనలను సడలించిన తర్వాత ఈ పరిశ్రమలో పనులు మొదలుబెట్టడానికి అవసరమైన అనుమతులు ఎవరిచ్చారనే ప్రశ్న మిగిలే వుంది.

పారిశ్రామిక ప్రదేశాల లోపల, వెలుపల అత్యవసర పరిస్థితులు సంభవించినపుడు తీసుకోవలసిన చర్యలను వివరిస్తూ ఆన్‌ సైట్, ఆఫ్‌ సైట్‌ ప్రణాళికలను పరిశ్రమలు, జిల్లా అధికార యంత్రాంగం తయారు చేసుకుని ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రమాదం జరిగితే ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టగలరు. ఇవి లేక ఎటువంటి గందరగోళ స్థితి  ఏర్పడిందో చూసాము. ఏడో తేదీ మధ్యాహ్నం దాకా కూడా ఫ్యాక్టరీకి 15 కిమీ దూరం వరకూ దుర్గంధం వస్తూనే ఉంది. దాంతో స్థానికులు తలనొప్పితో బాధ పడ్డారు. మరోసారి స్టెరీన్‌ లీకయిందనే పుకార్లు రావడంతో అదే రోజు రాత్రి గోపాలపట్నం, మురళీనగర్‌, మాధవధార పరిసర ప్రాంతాల నుండి వందలాది మంది ప్రజలు మద్దిలపాలెం, బీచ్ రోడ్ల  వరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. వారికి పాలనా యంత్రాంగం నుండి ఎటువంటి సహాయం అందలేదు. తక్షణ పరిస్థితి గురించి గానీ, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గానీ ఒక అధికార ప్రకటన వెల్లడి కాకపోవడంతో స్థానికులు దిక్కుతోచని పరిస్థితులలో అల్లాడారు.

‘ప్రిన్సిపల్స్‌ ఆఫ్‌ ఆబ్స్బల్యూట్‌ లయబిలిటీ’ ప్రకారం జరిగిన నష్టాన్ని, నష్ట పరిహారాన్ని భరించాల్సింది కంపెనీనే. ప్రభుత్వం చెల్లించిన సహాయం కాలుష్యం వెదజల్లిన ఎల్‌. జి. పాలిమర్స్‌ నుండి తిరిగి వసూలు చేయాలి తప్ప పన్ను కట్టే వారి మీద భారం వేయకూడదు. కంపెనీలో ఏర్పాటు చేసిన ఎయిర్‌ క్వాలిటీ మోనిటర్స్‌ రికార్డు చేసిన సమాచారాన్ని గాలి, నీరు, మట్టి నమూనాల, బాధితుల మూత్రం/రక్తం నమూనాల ఫలితాలను, ఇతర అన్ని రకాల సాక్ష్యాలను కాలుష్య నియంత్రణ మండలి ప్రజల ముందు ఉంచాలి.

ఇంత పెద్ద స్థాయిలో ‘styrene’   లీకేజీ జరగడం, దానిని పీల్చి ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం ప్రపంచంలోనే తొలిసారి అంటున్నారు. ‘styrene’  వల్ల కాన్సర్‌ వ్యాధి సోకే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ కాన్సర్‌ పరిశోధన సంస్ధ అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో భారత వైద్య పరిశోధన మండలి ఈ రసాయనాన్ని పీల్చడం వల్ల కలిగే హాని గురించి ఒక దీర్ఘకాలిక పరిశోధన చేపడితే ఉపయోగకరంగా ఉంటుంది.

‘styrene’  ఆవిరి లీకయ్యే సమయానికి ఆ ఫ్యాక్టరీలో 15 మంది కార్మికులు ఉన్నారని, ఆ 15 మంది కాజువల్‌ వర్కర్స్‌ అని తెలిసింది. కార్మిక హక్కుల, ఉద్యోగ భద్రతలకు సంబంధించిన చట్టాలను అటకెక్కించి కార్మిక లోకాన్ని కాజువల్‌ కార్మికులతో నింపుతున్నారు. పారిశ్రామిక భద్రతా నియమాల ఉల్లంఘన జరిగింది కనుక ఫ్యాక్టరీస్‌ ఇన్స్‌ప్పెక్టర్‌ ఆ ఆరోపణతో విడిగా ఒక ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదు చేయాలని, కార్మిక చట్టాల ఉల్లంఘన జరిగినందున కార్మిక విభాగం కంపెనీపై చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము. శిక్షణ పొందిన నైపుణ్యం గల శాశ్వత సిబ్బందితోనే రెడ్‌, ఆరంజ్‌ కేటగిరీ పరిశ్రమలలో పనులు చేయించేటట్లు ప్రభుత్వం చూడాలి.

రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ విశ్వసనీయత పట్ల హెచ్‌.ఆర్‌.ఎఫ్‌ కు సందేహాలు ఉన్నాయి. ఈ నేరం మూలాలలోకి పోయి విచారణ జరపడానికి వీలుగా ఒక స్వతంత్ర నిపుణుల బృందాన్ని నియమించాలని, పౌరసమాజ ప్రతినిధులను కూడా ఆ బృందంలో భాగం చేయాలని కోరుతున్నాము. యాజమాన్యం సాక్ష్యాధారాలను తారుమారు చేయకుండా ఉండేందుకు ఫ్యాక్టరీని వెంటనే సీల్‌ చేసి, అన్ని రికార్డులను స్వాధీనపర్చుకోవాలని కోరుతున్నాము.

మానవహక్కుల వేదిక
ఆంధ్రప్రదేశ్‌
8 మే 2020

Related Posts

Scroll to Top