
మానవహక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె. జయశ్రీ మీద పోలీసులు క్రిమినల్ కేసు బనాయించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ళలో ఉపా, రాజద్రోహం తదితర నేరాల కింద నమోదు చేసిన ఒక కేసులో పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన ఒక ముద్దాయి పేరిట సమర్పించిన ‘నేర అంగీకార’ వాంగ్మూలంలో జయశ్రీని నిషేధిత మావోయిస్టు పార్టీతో అనుబంధం ఉన్న వ్యక్తిగా, ఆ పార్టీ ఆదేశానుసారం పని చేసే వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేసారు. ఈ ‘నేర అంగీకార’ వాంగ్మూలంలో ఆమెపై చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలు అనడానికి హెచ్.ఆర్.ఎఫ్‌కు ఎటువంటి సందేహం లేదు. మానవహక్కుల కార్యకర్తలపై పోలీసులు ఈవిధంగా కేసులు బనాయించడాన్ని మేము నిర్ద్వందంగా ఖండిస్తున్నాం. నిరసన తెలిపే హక్కుపై చేస్తున్న ఈ దాడులలో కాని, అందుకు అవలంబిస్తున్న పద్ధతులలో కాని ఎటువంటి కొత్తదనం లేదు. ఇవి తిరస్కరించతగ్గ చర్యలు. ప్రజలందరూ ఆకాంక్షించే ఒక నాగరిక, ప్రజాస్వామిక సమాజంలో అటువంటి చర్యలకు తావు లేదు.
మానవహక్కుల వేదిక వ్యవస్థాపక సభ్యురాలు, కడప జిల్లా ప్రొద్దుటూరు నివాసి అయిన జయశ్రీ అన్ని రకాల హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసే వ్యక్తిగా గుర్తింపు పొందారు. తన కార్యాచరణలో భాగంగా జయశ్రీ అనేక సందర్భాలలో గత తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎండగడుతూ వచ్చారు. కడప జిల్లా వేముల మండలంలోని తుమ్మలపల్లిలో భారత యురేనియం కార్పొరేషన్ సంస్థ (యు.సి.ఐ.ఎల్) చేపట్టిన యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా, ఆ తవ్వకాల సామర్థ్యాన్ని పెంచడానికి జరుగుతున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఆమె ప్రచార కార్యక్రమాన్ని చేపడుతూ వచ్చారు. యురేనియం తవ్వకాల వల్ల భూమి కలుషితం అవుతుందని, రేడియో ధార్మిక పదార్థాలు భూగర్భ జలాలలోకి ఇంకిపోయి అది ఆ ప్రాంతానికి సరిదిద్దుకోలేనంత హాని కలుగచేస్తుందని యురేనియం తవ్వకాలు పర్యావరణానికి హానికరమని, అందువల్ల స్థానిక ప్రజల జీవనోపాధి కోల్పోతారని జయశ్రీ ఎప్పటినుండో చెపుతూ వస్తున్నారు.
అదే విధంగా ఆమె కడప జిల్లాలో గండికోట రిజర్వాయర్ వల్ల ఇటీవల కాలంలో ముంపుకి గురైన గ్రామాల ప్రజల నమస్యలను ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల విస్థాపనకు గురైన గ్రామస్తుల పక్షాన నిలబడి, ఆయా ప్రభుత్వాలు వందలాది కుటుంబాలకు నిలవనీడ లేకుండా చేయడాన్ని ఎండగడుతూ వచ్చారు. ఆయా ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను, చేసిన వాగ్దానాలను నెరవేర్చాలని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ వచ్చారు. ప్రాజెక్ట్ నిర్వాసితులు గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు వీలుగా ప్రభుత్వం వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్ట పరిహారం, సమగ్రమైన పునరావాసం కల్పించాలని ఆమె కోరుతూ వచ్చారు. జయశ్రీ చేపడుతున్న ఈ న్యాయమైన కార్యక్రమాలను దెబ్బ తీయాలనే పోలీసులు ఆమెపై ఈ క్రిమినల్ కేసు బనాయించాలని చూస్తున్నారు. ఒక కేసులో ముద్దాయి పేరిట ‘నేర అంగీకార’ వాంగ్మూలం సృష్టించి, తద్వారా ఆమెకు మావోయిస్టులతో సంబంధం ఉందని ఒక కట్టుకథ అల్లి అందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆమెకు, హెచ్.ఆర్.ఎఫ్‌కు మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నాయని అబద్దాలు చెప్పడానికే పోలీసులు ఈ చర్యలకు పాల్పడుతున్నారనేది స్పష్టంగా అర్థమౌతూనే ఉంది. హెచ్. ఆర్. ఎఫ్ మావోయిస్టు పార్టీకి కాని, ఏ ఇతర రాజకీయ పార్టీకి కాని అనుబంధ సంస్థ కాదని గత కొన్ని ఏళ్లుగా మేము చెబుతూ వచ్చిన విషయాన్నే మరోసారి నొక్కి చెబుతున్నాం. మా సంస్థ సమాజంలో మానవహక్కుల సంస్కృతిని పెంపొందించడానికి నిరంతరం కృషి చేస్తుంది. మానవ హక్కుల ఉద్యమం స్వతంత్రంగా ఉండాలనీ, విలువలకు కట్టుబడి పని చేయాలనీ అనుకునే సంస్థ మానవహక్కుల వేదిక.
ఇంటా బైటా హింసకు గురవుతున్న స్త్రీల పక్షాన నిలబడి అవిరామ కృషి చేస్తున్న వ్యక్తి జయశ్రీ.. పోలీసులే అనేక సందర్భాలలో ఆమెను ఆహ్వానించి మానవహక్కుల మీద క్లాసులు చెప్పించుకున్నారు! ఆమెను ఇంత హేయమైన పద్ధతిలో కేసుల్లో ఇరికించడానికి చేస్తున్న ప్రయత్నాలను వారు మానుకోవాలని హెచ్. ఆర్. ఎఫ్ డిమాండ్ చేస్తోంది.
మానవహక్కుల వేదిక
ఆంధ్రప్రదేశ్
13 డిసెంబర్ 2020