ఆలోచనను అడ్డుకోవడం ఫాసిస్టు చర్య

తమ గుర్తింపును వెల్లడించని కొంతమంది వ్యక్తులు ‘సామాజిక స్మగ్గర్లు కోమటోళ్లు’ పేరుతో ఒక పుస్తకాన్ని రాసిన ప్రొఫెసర్‌ కంచ ఐలయ్యను చంపుతామని బెదిరించడం అనాగరికం. భావప్రకటనా స్వేచ్చ మనిషి ప్రాథమిక హక్కు. దీన్ని రాజ్యాంగం కూడా గుర్తించింది. ఆ పుస్తకం శీర్షిక తమ మనసులను గాయపరిచిందని వైశ్య కులస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకొని, ప్రత్యామ్నాయ ఆలోచనను వ్యక్తీకరించిన ఐలయ్యను చంపుతామని సంఘ్‌ పరివార్‌ కు చెందినవారు బెదిరిస్తున్నారు, రెచ్చగొడుతున్నారు. ఇటువంటి కుట్రలో వైశ్యులు భాగం కావద్దని మేము భావిస్తున్నాము. ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలను ఖండిస్తూ ఇంకొక పుస్తకం రాసే హక్కు వైశ్యులకుంది. అట్లా చేస్తే వాళ్ళు ప్రజాస్వామిక సంప్రదాయానికి గౌరవం ఇచ్చిన వారవుతారు.  

శాస్త్ర పరిశోధనా ఫలితాలను సమాజం ముందు పెట్టి, కొత్త ఆలోచనలకు తావు కల్పించిన గోవింద్‌ పన్సారే, ఎం.ఎం. కల్బుర్గి లాంటి మేధావులనూ, అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడిన నరేంద్ర దబోల్కర్‌ నూ హిందూత్వ ఫాసిస్టులు పొట్టన పెట్టుకున్నారు. తాజాగా కన్నడ పత్రికా సంపాదకురాలు అయిన గౌరీ లంకేశ్‌ నూ హత్య చేశారు.

ఆలోచనల మధ్య సంఘర్షణ జరిగితేనే సత్యం నిగ్గుతేలుతుంది. అదే ప్రజాస్వామిక సంస్కృతి. ఐలయ్య ప్రతిపాదించిన అంశాలతో ఏకీభావం లేకపోతే వాటిని హేతుబద్ధంగా విమర్శించడం నాగరిక పద్ధతి. రాయడాన్నే నేరంగా చిత్రించి తక్షణ తీర్పును ప్రకటించేసి, మరణ శిక్షనూ విధించేసి ఇక దాన్ని అమలు చేయడమే తరువాయి అనడం ఆటవికం. తాను సత్యమని నమ్మిన దాన్ని చెప్పే హక్కు ఐలయ్య కు ఉంది. ఆ హక్కును మానవ హక్కుల వేదిక గౌరవిస్తుంది. ఆ హక్కును కాపాడుతుంది. ఐలయ్యకు రక్షణగా నిలబడుతుంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే వారే, చర్చ అంటే  భయపడే వారే ఐలయ్యను చంపుతామని బెదిరిస్తున్నారు. ఈ దుష్ట పన్నాగాలను ప్రజాస్వామిక వాదులు ఖండించాలి. దేశంలో ఫాసిస్టు శక్తులు కావాలని పెంచుతున్న అసహనాన్ని మానవ హక్కుల వేదిక నిరసిస్తోంది.

మానవ హక్కుల వేదిక
ఆంధ్ర – తెలంగాణ రాష్ట్రాల సమన్వయ కమిటీ
18 సెప్టెంబర్ 2017

Related Posts

Scroll to Top