బానోతు దీపిక తల్లిదండ్రులను చంపిన ఉన్మాదికి గరిష్ట శిక్షి విధించాలి

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఎల్లాయి గూడెం గ్రామ హామ్లెట్ ‘పదహారు చింతల తండా’ లో 11వ తేదీ గురువారం తెల్లవారుజామున జరిగిన జంట హత్యల విషయంలో ఈరోజు మానవహక్కుల వేదిక బృందం బాధితులను కలిసి వివరాలను సేకరించింది. మా నిజనిర్ధారణ బృందంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.తిరుపతయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు బాదవత్ రాజు, రాష్ట్ర కార్యదర్శి టి. హరికృష్ణ , వరంగల్ ఉమ్మడి జిల్లా శాఖ అధ్యక్షులు అద్దునూరి యాదగిరి మరియు పద్మజలు పాల్గొన్నారు.

పదహారు చింతల తండాలో నివాసం ఉండే బానోతు శ్రీనివాస్ సుగుణ దంపతుల కుమార్తె దీపికను గుండెంగ అనే పొరుగు గ్రామానికి చెందిన మేకల నాగరాజు అనే ఆటో డ్రైవర్ గత మూడు సంవత్సరాలుగా (ఆమె పదవ తరగతికి స్కూల్ కి ఆటోలో వెళ్తున్న దగ్గరనుండి) ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతూ వేధించే వాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పితే మీ తల్లిదండ్రులను, నిన్ను చంపివేస్తానని పదేపదే దీపికను బెదిరించడం వల్ల కావచ్చు, పరిపక్వత లేని పదవతరగతి వయస్సు ఊగిసలాట వల్ల కావచ్చు, తల్లిదండ్రులకు చెప్తే స్కూలుకు (తర్వాత ఇంటర్ కాలేజీకి) పంపటం మానిపించేస్తారన్న భయం వల్ల కావచ్చు ఆ అమ్మాయి తల్లిదండ్రుల వరకు ఆ విషయం రానీయలేదు.

నవంబర్ 29, 2023న నాగరాజు దీపికను తనతో ఒక్కరోజు హైదరాబాదు రావాలని, జీడిమెట్లలోని తన తల్లిదండ్రుల ఇంటికి బలవంతంగా తీసుకెళ్ళాడు. అప్పటినుండి సుమారు రెండు నెలల పాటు ఆమెపై భౌతికంగా దాడి చేస్తూ, తనపై తీవ్రమైన హింసను ప్రయోగిస్తూ, పారిపోతే చంపేస్తానని హింసించేవాడని దీపిక తెలిపింది. పెళ్లి చేసుకుంటానని బ్రమలు, భయం కల్పించి హైదరాబాదు తీసుకెళ్లిన నాగరాజు అమ్మాయిని ఏ చట్టబద్ద వేదిక మీదా పెళ్లి చేసుకోలేదు. ఇంట్లో ఒక దారానికి పసుపుకొమ్ము కట్టి, ఇక నువ్వు నా భార్యవే పో అన్నాడు. నాగరాజును అతని తల్లిదండ్రులు వారించకపోగా, వాళ్లు కూడా తనను హింసించారని దీపిక తెలిపింది.

దీపిక కనిపించకుండా పోయాక ఆమె తల్లిదండ్రులు చెన్నారావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్ధానిక పోలీసులు ఆ కేసు నమోదు చేయకుండా తిప్పుకుంటుంటే, ఫిర్యాదుదారులు జిల్లా సీపీని ఆశ్రయించి, ఎఫ్ఐఆర్ చేయించుకోవాల్సివచ్చింది. తరువాత వారి అమ్మాయి హైదరాబాదులో ఉన్నట్లుగా గుర్తించిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇస్తే, స్ధానిక ఎస్సై ఇరు కుటుంబాల వారినీ స్టేషన్కు పిలిచి కౌన్సెలింగ్ మాత్రం ఇచ్చి పంపాడట. ఈ కౌన్సిలింగ్ నిర్వహణ కూడా పూర్తిగా పక్షపాతంతో జరిగినట్టు అర్థమవుతున్నది. రెండు నెలల పాటు ఒక అమ్మాయిని తన ఇష్టానికి వ్యతిరేకంగా హైదరాబాదులో దాచి ఉంచిన నాగరాజుపై దీపిక తల్లిదండ్రులు కిడ్నాప్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు ఇచ్చినా ఎస్సై ఆ పని చేయకపోగా, కేసు అవసరం లేదని అన్నాడని దీపిక చెప్పింది.

దీపిక తన స్వంతం కాకుండా పోతున్నదన్న కక్ష్యతో ఉన్న నాగరాజు ఆ ప్రాంతంలోనే ఆటో నడుపుకుంటూ, హత్యకు ఉపయోగపడే వేట కొడవలి లాంటి ఒక కత్తిని నెల కిందటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని సిద్ధం చేసుకున్నాడు. కొద్ది రోజులు రెక్కి నిర్వహించి, జూలై 11వ తేదీ తెల్లవారుజాము ఒకటిన్నర ప్రాంతంలో వచ్చి, ఇతర ఇద్దరు ముగ్గురు అతని సహాయకులను దీపిక ఇంటి పరిసరాల్లో ఉంచి, ఆరు బయట నిద్రిస్తున్న దీపిక, ఆమె తల్లిదండ్రులను చేరుకున్నాడు. ముగ్గురినీ హత్య చేయడానికి ప్రయత్నించినా, దీపిక తీవ్ర గాయాలతో బయట పడింది. దీపిక తండ్రి బానోతు శ్రీనివాస్ మరియు తల్లి బానోతు సుగుణలను నాగరాజు దారుణంగా అనేకసార్లు నరికి , పొడిచి హత్య చేశాడు. ఇంట్లో పడుకున్న దీపిక తమ్ముడు మదన్ బయటికి రాగా నాగరాజు అతనిపై కూడా కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాల పాలైన మదన్ మేము వెళ్లే సమయానికి ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. హత్యాయత్నం నుండి బయట పడ్డ దీపికా, మదన్ లు ఇంకా ప్రాణ భయంతో వణుకుతున్నారు.

ఈ విషయంలో నాగరాజుకు సహకరించిన ఏ ఒక్కరి పైనా కేసు నమోదు కాలేదు. వారెవరూ అరెస్ట్ కాలేదు. కేవలం ఒక నాగరాజును మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారు.

మా సంస్థ ఈ ఘాతుకాన్ని తీవ్రంగా ఖండిస్తున్నది. వ్యక్తిగత సంబంధాల కారణంగా ఈ హత్యలు జరిగినట్టు బయటికి కనిపించినా దీని వెనుక చాలా సామాజిక అంశాలున్నాయి. ఆడవాళ్ళు తమకు ఇష్టం లేని సంబంధం నుండి బయటపడే స్వేచ్ఛలేని పితృస్వామిక సమాజపు సంకెళ్ళున్నాయి. ఇటువంటి పోకిరీగాళ్ళ బారిన పడకుండా చదువుకోలేని పేదరికపు పాత్రా ఉంది. అన్యాయం జరిగినా న్యాయం కోసం అడుక్కోవటం తప్ప, పోలీసు శాఖనూ, సమాజాన్నీ కదిలించలేని వివక్షకు గురైన జాతి పాత్ర ఉంది. ఎంతటి నేరం చేసైనా తప్పించుకునే శిక్షా రాహిత్య సంస్కృతీ ఉంది. శ్రామిక కులాల యువకులకు చదువూ సంస్కారం నేర్పి ప్రయోజకులను చేయకుండా అయితే తమకు సేవకులుగా లేదంటే పోకిరీలూ, తాగుబోతులూ, గంజాయి వ్యసనపరులూ, దొంగలూ, హంతకులుగా తయారుచేసే పాలకుల పరిపాలనా విధానం ఉంది. ఇవన్నింటి ఉత్పత్తిగా మాత్రమే తయారైన మేకల నాగరాజు పేద దళిత కులంలో పుట్టి, పెరిగి కూడా తోటి మరో అట్టడుగు వర్గపు కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్నాడు.

మా డిమాండ్లు:

1) అమానుషంగా ఇద్దరిని చంపి, మరో ఇద్దరిపై హత్యా యత్నం చేసిన ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో త్వరితగతిన విచారణ జరిపి, నేరస్తుడికి జీవిత ఖైదు విధించాలి. నిందితుడు గిరిజనేతరుడైనందున అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి.

2) కుటుంబంపై ఆధారపడ్డ వృద్ధుల, పిల్లల భవిష్యత్తు కోసం తక్షణం 50 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం అందించాలి.

3) తల్లిదండ్రులు కోల్పోయి అనాధలుగా మారిన దీపిక, మదన్ ల విద్యకు, వారి భవిష్యత్తుకు ప్రభుత్వమే పూచీ పడాలి.

4) విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అప్పటి ఎస్సై శ్రీనివాస్ పై చర్య తీసుకోవాలి.

చెన్నారావుపేట,
14.07.2024.

Related Posts

Scroll to Top