ఇంద్రావతిలో పారిన రక్తం: భద్రతా బలగాల క్రౌర్యం

ఛత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్ర సరిహద్దులో ఇంద్రావతి నది ఒడ్డున, అహేరి తాలూకా నైనేర్‌ ప్రాంతాన ఉన్న అడవులలో భద్రతా, పోలీసు బలగాలు ఏప్రిల్‌ 22, 28 తేదీల్లో 40 మందిని కాల్చి చంపాయి. ఇందులో 22 మంది సాయుధ మావోయిస్టులు కాగా మిగిలిన 18 మంది సాధారణ పౌరులు. ఇందులో 17 మంది ఆదివాసీలు. ఈ హత్యకు పాల్పడిన సి-60 కమెండోలనూ, సి.ఆర్‌.పి.ఎఫ్‌ వారినీ, సాధారణ పోలీసులనూ హత్యానేరం కిందా, ఎస్‌.సి, ఎస్‌.టి (అత్యాచారాల నిరోధక) చట్టం కిందా కేసులు పెట్టి విచారణ జరిపించాలని మానవహక్కుల వేదిక డిమాండ్‌ చేస్తోంది. ఈ హత్యాకాండలో (Staged Encounter) మరణించిన పౌరులను గుర్తించడానికి తగిన ప్రయత్నాలను ప్రారంభించాలని ప్రభుత్వానికి మానవహక్కుల వేదిక విజ్ఞప్తి చేస్తోంది.

నలుగురు సభ్యులతో కూడిన మానవహక్కుల వేదిక బృందం జూన్‌ 2, 3 తేదీల్లో హత్య జరిగిన ప్రదేశాన్నీ, దక్షిణ గడ్చిరోలి ప్రాంతాన్నీ సందర్శించింది. మా పరిశీలనలో ఈ విషయాలు తెలిసాయి. అహేరీ, పెరిమిలి దళాలకు చెందిన 36 మంది సాయుధ మావోయిస్టులు ఇంద్రావతి నదికి ఆనుకుని ఉన్న దట్టమైన అడవిలో ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గడ్చిరోలి (మహారాష్ట), బీజాపూర్‌ (ఛత్తీస్‌ఘడ్‌) జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన ఆదివాసీలతో వారు అక్కడ సమావేశమయ్యారు. మీడియాలో ఈ సమావేశ స్ధలం తప్పుగా రిపోర్ట్‌ అయింది. బీజాపూర్‌ జిల్లా భూపాలపట్నం బ్లాక్‌లోని కేర్పే పంచాయతీకి ఆనుకొని ఉన్న అడవులలో ఈ స్ధలం ఉంది. కర్కవాడ్  రిజర్వు ఫారెస్టుకి దక్షిణ దిశలో ఉంది. మొత్తం మీద శిబిరం వద్ద సమావేశంలో ఉన్నది 57 మంది. అందులో 21 మంది సాధారణ పారులు.      

ఏప్రిల్‌ 22 ఉదయం 6:30-7:00 గం.ల  ప్రాంతంలో భద్రతా బలగాలు శిబిరాన్ని మూడు వైపులనుంచి చుట్టుముట్టాయి. ఎటువంటి హెచ్చరిక చేయకుండానే సమావేశంలో కూర్చొన్న గుంపు మీదకు భారీగా కాల్పులు చేశారు. ఈ హఠాత్పరిణామాన్ని ఊహించని సాయుధ మావోయిస్టులు తమని చుట్టముట్టిన బలగాలపై ప్రతిగా కాల్పులు జరపలేకపోయారు. శిబిరం నుంచి ఇంద్రావతి నదిలోకి స్నానం కోసం వెళ్ళిన వారిని కూడా బలగాలు కాల్చి చంపాయి. ఘటన జరిగిన సమయంలో నదికి కొంచెం దిగువన మలుపులోఉన్న 14 మంది, సమీపంలోని గ్రామానికి వెళ్ళిన మరో పిడికెడు మందీ అదృష్టవశాత్తూ చావు నుంచి తప్పించుకోగలిగారు.

మొత్తం మీద 18 మంది నిరాయుధ పౌరులు సహా 34 మంది భద్రతా బలగాల హత్యాకాండలో బలైపోయారు. మావోయిస్ట్‌ జిల్లా స్థాయి నాయకుడు వాసుదేవ్‌ ఆత్రం సహా మరో ఆరుగురిని సజీవంగా బలగాలు పట్టుకున్నాయి. ఈ ఆరుగురిని ఇంద్రావతి నదికి ఆవల ఉన్న నైనేర్‌ అడవుల్లోకి (మహారాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లా అహేరీ తహశీల్‌ దామ్రాంచ పోలీసు స్టేషన్‌ పరిధి) తీసుకుపోయి అక్కడ మావోయిస్టులు డబ్బులు దాచిన చోటు (మనీ డంప్) ఎక్కడుందో వారినుంచి కూపీ లాగి తెలుసుకున్నారు. ఆ తరువాత కిరాతకంగా చంపేశారు. ఈ స్థలం మోడుమోద్గూ గ్రామానికి దగ్గరలో ఉంది.

ఈ హననంలో 40 మంది హత్యకు గురయ్యారు. ఏ బూటకపు కాల్పుల్లోనూ ఇంత భారీస్థాయిలో మరణాలు లేవు. ఇదే అత్యధికం. చనిపోయిన వారిలో 19 మంది మహిళలు. ‘ఆత్మరక్షణార్థం’ కాల్పులు జరపాల్సివచ్చిందని ఇంతకుముందు భద్రతా బలగాలు అనేవి. ఈసారి మాటమాత్రానికైనా భద్రతా బలగాలు ఆ మాట అనడం లేదు. ఈ సామూహిక హత్యాకాండ వారికి వికృత వేడుక అయ్యింది. ఇంత భారీసంఖ్యలో సాధారణ పౌరులు ఉన్నప్పుడు సాధారణంగా భద్రతాబలగాలు సంయమనం పాటించాలి. ఈ ప్రమాణాన్ని పక్కకుపెట్టి, భద్రతాబలగాలు ప్రజల్ని చంపడానికే కాల్పులకు తెగబడ్డాయి. కాల్పులు చేయడమే కాదు, అండర్‌ బేరల్ గ్రనేడ్ లాంచర్స్‌ (Under Barrel Grenade Launchers) వినియోగించి ప్రాణాంతకమైన గ్రనేడ్‌లను వారిపై ప్రయోగించాయి.

హతుల్లో గడ్చిరోలి జిల్లా ఈతపల్లి బ్లాక్‌ కండోలి పంచాయితీ గట్టేపల్లి గ్రామానికి చెందిన ఎనిమిదిమంది పౌరులు ఉన్నారు. వీరిలో ఐదుగురు మహిళలు. పదిహేనేళ్ల బుజ్జి కర్మే ఉసేంది వీరందరిలోకల్లా పిన్న వయస్మురాలు. భమ్రగడ్‌లోని భగవంత్‌రావ్‌ ఆశ్రమ పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న పదిహేడేళ్ల చుండు మాధవి కూడా చనిపోయిన వారిలో ఉంది. ఆరు వారాలు దాటినా, చనిపోయిన మిగిలిన 10 మంది పౌరులెవరయ్యిందీ ఇంకా తెలియలేదు. వారు బీజాపూర్‌ జిల్లా (ఛత్తీస్‌ఘడ్‌) భూపాలపట్నం బ్లాక్‌లోని కెర్పే పంచాయతీకి సుదూరంలో ఉన్న అడవులలోని గ్రామాలకు చెందిన వారని మేము భావిస్తున్నాము. ఛత్తీస్‌ఘడ్‌ బీజాపూర్‌ జిల్లా బెద్రే పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ నరమేధం జరిగిన ప్రదేశం ఉంది.

మావోయిస్ట్‌ రాజకీయాల పట్ల, వారి సాయుధ పోరాట పద్ధతుల విషయంలో ఒకరికి ఉండే సానుకూల, ప్రతికూల అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా ప్రజాస్వామ్యం పట్ల గౌరవం కలిగిన వారిగా ఈ చట్ట బాహ్య హత్యాకాండనూ, మానవహక్కుల హననాన్నీ వ్యతిరేకిస్తూ నిరసన గళం వినిపించాలని మానవహక్కుల వేదిక అందరికీ విజ్ఞప్తి చేస్తోంది. మావోయిస్ట్‌ ఉద్యమం అనుసరిస్తున్న హింసాయుత పద్ధతుల విషయం అటుంచితే ఆ ఉద్యమాన్ని ప్రాథమికంగా ఒక రాజకీయ ఉద్యమంగా మానవహక్కుల వేదిక గుర్తిస్తోంది. నిత్యం దోపిడీకి గురవుతూ లేమితో గడిపే ప్రజానీకపు ఆశలలోంచి పుట్టుకు వచ్చిన ఒక ఉద్యమం అది. మావోయిస్ట్‌ ఉద్యమంతో రాజ్యం తలపడవచ్చు కానీ అది రాజ్యాంగానుసారం, చట్ట ప్రకారం జరగాలి. అంతే కానీ, దాని పేరుతో రాజ్యం ప్రజల హక్కులను ఉక్కుపాదంతో అణచివేయకూడదు, చట్టబద్ధ పాలనను అపహాస్యం చేయకూడదు. భిన్నాభిప్రాయాలు ఉన్నవారిని జంతువులను వేటాడినట్లు వేటాడి చంపకూడదు. మావోయిస్ట్‌ ఉద్యమాన్ని రాజ్యం రాజకీయంగానే ఎదుర్కోవాలి.

మానవహక్కుల  వేదిక
ఆంధ్ర – తెలంగాణ రాష్ట్రాల సమన్వయ కమిటీ
7 జూన్‌ 2018

Related Posts

Scroll to Top