రాజధాని ఏర్పాటుకు పరిపాలనా వికేంద్రీకరణే ప్రాతిపదిక కావాలి

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని అమరావతి నుండి ఇతర ప్రాంతాలకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఇటీవల వస్తున్న వార్తలు నిజమే అయితే అది ఆమోదయోగ్యమైన నిర్ణయమే. గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపాదించినట్టుగా అమరావతిలో రాజధాని నిర్మాణం గనుక జరిగితే దానివల్ల సామాజికంగా, పర్యావరణ పరంగా జరిగే నష్టం అంతా ఇంతా కాదు. 2014లో శివరామకృష్ణన్‌ నివేదిక సమర్పించిన సమయంలోనూ మానవహక్కుల వేదిక (హెచ్‌.ఆర్‌.ఎఫ్‌) ఇదేమాట అన్నది. నేటికీ మేము అదే అభిప్రాయంతో ఉన్నాము. రాజధాని నగరాన్ని నిర్మించ తలపెట్టిన ప్రాంతం చిత్తడి నేలలు, సారవంతమైన వ్యవసాయ భూములు ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతం భూకంపాలకు అవకాశం ఉండే ప్రాంతం. కృష్ణా నది వరద ప్రమాదం సంభవించే ప్రాంతం కూడా. ఇక్కడ రాజధానిని నిర్మించాలనుకోవడం పీడకలను తలపిస్తుంది. వీటంతటికీ తోడు తెలుగుదేశం ప్రభుత్వం తలపెట్టిన ఈ మహానగర నిర్మాణం అనేక అక్రమాలు, అకృత్యాలు, చట్టవిరుద్ధ లావాదేవీలలో కూరుకు పోయిందనేది అందరికీ తెలిసిందే. అమరావతిలో రాజధాని నిర్మాణం జరగాలని ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా తీసుకున్న ఏకపక్ష నిర్ణయం.

రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల పట్ల ప్రస్తుత ప్రభుత్వం స్పందిస్తున్న తీరు గత ప్రభుత్వ తీరుకు భిన్నంగా ఏమీలేదు. నిరసన తలెత్తగానే సిఆర్‌.పి.సి. సెక్షన్‌ 144, పోలీసుచట్టం సెక్షన్‌ 30 కింద నిషేధాజ్ఞలు విధిస్తున్నారు. ఇది చాలా అభ్యంతరకరమైన విషయం. అమరావతి ప్రాంతంలో ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు చేస్తున్న అనవసరమైన, అవసరానికి మించిన బలప్రయోగాన్ని మేము ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనకారుల పట్ల ప్రదర్శిస్తున్న శత్రుపూరిత వైఖరిని విడనాడి ప్రజాస్వామిక పద్ధతిని అవలంభించి వారితో చర్చలు జరపాలని హెచ్‌.ఆర్‌. ఎఫ్‌ కోరుతున్నది. గత ప్రభుత్వ చర్యల వల్ల నష్టపోయిన వారికి న్యాయం చేకూర్చాలి. అది కూడా సమగ్రంగా జరగాలి. ఈ విషయంలో చిన్నకారు, సన్నకారు రైతుల, దళితుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.

అయితే, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలనే ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తోంది. నూతన రాజధాని (లేదా రాజధానుల) ఏర్పాటు అత్యంత గోప్యంగా జరుగుతోంది. గతంలో జరిగిన అనేక ఘోర తప్పిదాలను సరిదిద్దుకోవడానికి ఇదొక సువర్ణమైన, చారిత్రాత్మకమైన అవకాశం. ఇంతటి కీలక నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రభుత్వం విస్తృత స్థాయిలో ప్రజల అభిప్రాయాలను సేకరించాలి. అది ప్రజలచే ఎన్నికయిన ప్రభుత్వాల కనీస బాధ్యత. ఆ పని నేటి ప్రభుత్వం కూడా చేయలేదు.

ఈ మొత్తం వ్యవహారంలో పారదర్శకత లోపించింది. ఉదాహరణకు, ప్రభుత్వం బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ నివేదిక సహా ఇతర నివేదికలను ప్రజల ముందు పెట్టాలని అనుకోలేదు. ఈ నిర్ణయంపై మన రాష్ట్రం, మన భావి తరాల భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇంతటి ముఖ్యమైన అంశాన్ని ఇంత గోప్యంగా ఎందుకు ఉంచాలి? ఇందులో ఇంత గందరగోళం, అనిశ్చితి ఎందుకు ఉండాలి? ఎంతో ప్రాధాన్యత ఉండిన ఈ విషయంలో పారదర్శకత ప్రదర్శించాల్సింది పోయి అధికార పార్టీ ప్రతినిధులు, మంత్రులు నిత్యం తమ ఇష్టానుసారం నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. ఇంత వరకూ ఇదీ మా విధానం అంటూ రాజధాని విషయంలో ప్రభుత్వం ఒక అధికార ప్రకటనను విడుదల చేయలేదు. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు, వారికి వత్తాసు పలికే ప్రసార మాధ్యమాలు, న్యూస్‌ చానల్స్‌ పరస్పర ఆరోపణలు చేసుకోవడం, బురద జల్లుకోవడం మాత్రమే కనిపిస్తోంది.

గతంలో జరిగిన తప్పులనే మళ్లీ పునరావృతం చేయవద్దని మానవహక్కుల వేదిక ప్రభుత్వాన్ని కోరుతోంది. విశాఖపట్నంలో ఒక కేంద్రీకృత సచివాలయం, ఆ మాటకొస్తే ఎక్కడైనా కేంద్రీకృత సచివాలయం ఏర్పాటు చేయడం శ్రేయస్కరం కాదు. అలా కాకుండా రాష్ట్రవ్యాపితంగా చిన్న చిన్న సచివాలయాలు ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని సక్రమంగా, సరైన రీతిలో వాడుకుంటే ఈ విషయంలో పాలనాపరంగా ఎటువంటి ఇబ్బందులూ ఉండవు.

ప్రభుత్వం ఈ విషయంలో తీసుకోబోయే చర్యలు అసమాన అభివృద్ధికీ, విధ్వంసక అభివృద్ధికీ దారి తీయకూడదు. ఆ మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పట్టణాలు, దాని పరిసర ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి ప్రయోజనాలను పొందేలా ప్రభుత్వ విధానాలు ఉండటం సరైనది కాదు. వెనుకబడిన ప్రాంతాల మీదా, అభివృద్ధి చెందని ప్రాంతాల పైనా ప్రత్యేక శ్రద్ధ  పెట్టాలి. వికేంద్రీకరణ, పారదర్శకత, జవాబుదారీతనం అన్నవి ఇందుకు పాటించవలసిన మౌలికమైన సూత్రాలు. పాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ నిజమైన అర్థంలో జరగాలి. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నట్లుగా ఈ చర్చను ఆరోపణలు, ప్రత్యారోపణల స్థాయికి దిగజార్చకూడదు.

మహానగరాలు, వాటి పరిసరాలలోనే అభివృద్ధికి అవకాశం ఉంటుందన్న భావన లోపభూయిష్టమైనది. ఇటువంటి అభివృద్ధి నమూనావల్ల సంపద కొన్ని ప్రాంతాలకే పరిమతమవుతోంది. వెనుకబడిన ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధికి దూర మౌతున్నాయి. కేవలం కొన్ని ప్రాంతాల్లోని ఆధిపత్య వర్గాల ప్రయోజనాలను కాపాడటం కోసం చేపట్టిన అభివృద్ధి నిజమైన అర్థంలో అభివృద్ధి అనిపించుకోదు. సరైన అభివృద్ధి అంటే అందరికీ అందుబాటులో ఉండే అభివృద్ధి. దాని ప్రయోజనం ప్రజలందరికీ సమానంగా అందాలి. వనరుల పంపకంలో సమ న్యాయం పాటించాలి. భూమి, నీరు వంటి అత్యంత విలువైన సహజ వనరులనూ, పర్యావరణాన్నీ పణంగా పెట్టి అణగారిన ప్రజల జీవితాల్లో నిప్పులు పోసే అభివృద్ధి నిజమైన అభివృద్ధి ఎలా అవుతుంది?

చిన్న చిన్న సచివాలయాల ఏర్పాటు విషయంలోనైనా, మరో విషయంలోనైనా ప్రభుత్వం తీసుకునే చర్యలు వ్యవసాయాన్ని దెబ్బతీసే విధంగా ఉండకూడదనీ, అవి ప్రజల విస్థాపనకు  దారి తీయకూడదనీ, ఆ చర్యల వల్ల ప్రజలు తమ జీవనోపాధి కోల్పోకూడదనీ మానవ హక్కుల వేదిక భావిస్తోంది. ప్రభుత్వం దానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. అటువంటి విధంస్వక అభివృద్ధి ప్రజాస్వామ్యానికే చేటు. ప్రభుత్వం ఆడంబరాలకు పోకుండా అవసరం ప్రాతిపదికన పాలన సాగించాలి.

రాయలసీమ మధ్య భాగంలో హైకోర్టు ఏర్పాటు చేయాలని మేము భావిస్తున్నాం. రెండు హైకోర్టు బెంచ్‌లు – అందులో ఒకటి విశాఖపట్నంలోనూ, మరొకటి విజయవాడ, గుంటూరు ప్రాంతంలోనూ స్థాపించాలని కోరుతున్నాం. ఈ పనికి వెంటనే పూనుకోవాలని, రెండు బెంచ్ లు ఒకేసారి ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం.

ఇవన్నీ ప్రజలను సంప్రదించిన తరువాత, వారి అభిప్రాయాలు తెలుసుకున్న తరువాత చేపట్టాలి. ఇంత కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రభుత్వం ప్రజలను భాగస్వాములను చేయాలి. ఇప్పటివరకు ప్రభుత్వం ఆ పని చేయలేదు. ఇవి ఆగమేఘాలపై తీసుకోవాల్సిన నిర్ణయాలు కావు. ఇంత హడావిడిగా కంగారు పడిపోతూ నిర్ణయం తీసుకునే బదులు ఈ విషయంలో ప్రజాభిప్రాయాన్ని సేకరించి చర్యలు తీసుకోవాల్సిందిగా హెచ్.ఆర్.ఎఫ్ కోరుతోంది.

ఇంకొక ముఖ్యమైన విషయం గురించి కూడా మాట్లాడుకోవాలి. పాలనా యంత్రాంగం ప్రజలకు మరింత అందుబాటులో ఉండే విధంగా జిల్లాల విస్తీర్ణాన్ని తగ్గించడం చాలా అవసరమని హెచ్‌. ఆర్‌. ఎఫ్‌ భావిస్తోంది. ఉన్న జిల్లాల వైశాల్యం చాలా ఎక్కువ. జిల్లాలను పునర్విభజించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పుడున్న ప్రతి జిల్లాను మూడు జిల్లాలుగా విభజించడం వల్ల పాలనా యంత్రాంగం ప్రజలకు మరింత చేరువవుతుంది. ఆ విధంగా చేస్తే సంక్షేమ పథకాలు అమలు చేయడం సులువవుతుంది. ప్రజలకు ఫలితం సక్రమంగా అందుతున్నదీ లేనిదీ తెలుసుకోవడం, అందేటట్లు చూడటం తేలిక అవుతుంది.

మానవహక్కుల  వేదిక
ఆంధ్ర – తెలంగాణ రాష్ట్రాల సమన్వయ కమిటీ
13 జనవరి 2020

Related Posts

Scroll to Top