రక్షణ పేరుతో హక్కుల భక్షణ: ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తుల (హక్కుల రక్షణ) బిల్లు – 2018

లోక్‌సభ ఇటీవల ఆమోదించిన ‘ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తుల (హక్కుల రక్షణ) బిల్లు -2018’లో అనేక అభ్యంతరకరమైన అంశాలు ఉన్నాయి. తమ హక్కులను పరిరక్షించే అంశాల కంటే భక్షించే అంశాలే ఈ బిల్లులో ఎక్కువ ఉన్నాయని ట్రాన్స్‌జెండర్‌ సమాజం భావిస్తోంది. ఈ బిల్లును నిరసిస్తూ కొంతకాలంగా ఆందోళనలు చేపడుతోంది.

తాను ట్రాన్స్‌జెండర్‌నే అని స్వయంగా ధృవీకరించుకునే హక్కును ఈ బిల్లు అడ్డుకుంటోంది. ఆ పనిని జిల్లాస్థాయి పరిశీలన కమిటీలకు అప్పచెప్పింది. ఇలా అప్పచెప్పడం తమ హక్కుల ఉల్లంఘనే అని ట్రాన్స్‌జెండర్‌ సమాజం భావిస్తోంది. గతంలో నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (NALSA) వారికీ, భారత ప్రభుత్వానికీ మధ్య తలెత్తిన ఒక న్యాయ వివాదంలో (నల్సా కేసు అంటారు) సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చూద్దాం: ‘తాను ట్రాన్స్‌జెండర్‌నని స్వయంగా ప్రకటించుకునే పద్ధతి కాకుండా వైద్య, జీవ, మానసిక శాస్త్ర అంశాల ఆధారంగా ఆ జెండర్‌ను ధృవీకరించే ప్రక్రియ ఏదయినా కూడా ఆర్టికల్స్‌ 19, 21ల ప్రకారం వారి హక్కుల ఉల్లంఘనే అవుతుంది’. పుట్టుకతో ప్రాప్తించిన జెండర్‌కూ, తమ మానసికానుభవంలో ఉండిన జెండర్‌కూ వ్యత్యాసం ఉండిన వారి విషయంలో జెండర్‌కు సంబంధించి వారి స్వయం ప్రకటన (Self-declaration) చాలునని దీని అర్థం.

ట్రాన్స్‌జెండర్స్‌కు దక్కాల్సిన రిజర్వేషన్ల విషయంలోనూ బిల్లు అన్యాయంగా వ్యవహరించింది. రాజ్యాంగపరంగా వీరిని సామాజికంగా వెనుకబడిన వర్గంగా భావించాలని సుప్రీంకోర్టు నల్సా కేసు తీర్పులో చెప్పింది. తద్వారా విద్యలో, ప్రభుత్వ ఉద్యోగాల్లో లభించే రిజర్వేషన్లకు వీరు అర్హలవుతారని అనింది. అయితే బిల్లులో వాటి ప్రస్తావనే లేదు.

ట్రాన్స్‌జెండర్లను దూషించినా, వారిపై లైంగిక హింసకు పాల్పడినా జరిమానాతో పాటు ఆరు నుంచి రెండేళ్ళ వరకు శిక్ష విధించాలని బిల్లు చెబుతోంది. అయితే అత్యాచార నేరస్తులకు (రేప్‌) ఏడేళ్లు జైలు శిక్ష విధించాలని ఐ.పి.సి 376 నిర్దేశిస్తోంది. తమ మీద జరిగే అత్యాచారాల విషయంలో బిల్లు వివక్షతను ప్రదర్శించిందని ట్రాన్స్‌జెండర్లు భావించడాన్ని తప్పు పట్టలేము. ట్రాన్స్‌జెండర్లు భిక్షాటనకు దిగటాన్ని బిల్లు నిషేధిస్తోంది, శిక్షార్హం చేస్తోంది. ఏ ఆధారం లేని పరిస్థితుల్లోనే వారు భిక్షాటనకు దిగుతున్నారన్న వాస్తవం బిల్లు రూపకర్తలకు తెలియకపోవడం విచారకరం.

బిల్లు ట్రాన్స్‌జెండర్‌ సమాజాన్ని అమానవీయ పరచి, నేరస్తులుగా చూడటమే కాక వారు ఎక్కడ జీవించాలో కూడా నిర్దేశిస్తోంది. దేశంలో ఏ ప్రాంతంలోనయినా/ ఎక్కడయినా నివసించవచ్చుననే రాజ్యాంగ హక్కును నిరాకరించడమే ఇది.

‘తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు తమ కుటుంబంలోని ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తిని సంరక్షించలేని సందర్భాలలో మాత్రమే, ఆ వ్యక్తి సంరక్షణను పునరావాస కేంద్రానికి అప్పచెబుతూ సంబంధిత న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వాలి’ అని బిల్లులోని ఒక క్లాజు పేర్కొంటోంది. ట్రాన్స్‌జెండర్లు తమ కుటుంబాల సంరక్షణలోనే ఉండటాన్ని తప్పనిసరి చేసిన ఇదే బిల్లు – చాలాసార్లు స్వంత కుటుంబాలే వారిపై జరిగే హింసకు కేంద్రాలవుతున్నాయన్న విషయాన్ని విస్మరించింది.

ఈ నేపథ్యంలో మానవహక్కుల వేదిక ఈ బిల్లును ప్రగతి నిరోధకమయినదిగా పరిగణిస్తోంది. ఇన్ని లోపాలతో కూడిన ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టకూడదని డిమాండ్‌ చేస్తోంది. ట్రాన్స్‌జెండర్‌ల హక్కులను కాపాడే విధంగా బిల్లును తిరగరాయాలని కోరుతోంది.

మానవహక్కుల  వేదిక
ఆంధ్ర – తెలంగాణ రాష్ట్రాల సమన్వయ కమిటీ
10 జనవరి 2019

Related Posts

Scroll to Top