అమరావతి ప్రాంత ప్రజలు నష్టపోకుండా ప్రత్యామ్నాయం చూపించాలి

అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ ప్రాంత రాజకీయ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా ఛిన్నాభిన్నం చేస్తే అమరావతిని శాసన రాజధానిగా చేయాలని ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ ప్రాంత ప్రజలను మరో ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. గత ప్రభుత్వ నిర్ణయం మూడు పంటలు పండించే రైతులను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో పావులుగా మార్చి వారి జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేయగా, ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మూలంగా పనుల కొరత ఏర్పడి ప్రజలు జీవనోపాధి కోల్పోయే ప్రమాదం దాపురించింది. మానవహక్కుల వేదికకు (హెచ్‌. ఆర్‌.ఎఫ్‌) చెందిన ముగ్గురు సభ్యుల బృందం 22 ఫిబ్రవరి 2020న తుళ్ళూరు, రాయపూడి, వెలగపూడి, ఉండవల్లి, నిడమర్రు గ్రామాలకు వెళ్లి స్థానికులను కలిసి వాస్తవ సేకరణ చేసింది.

అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు పరిపాలనా వికేంద్రీకరణ కూడా జరిగినప్పుడే ప్రాంతీయ అసమానతలు తగ్గుముఖం పడతాయని హెచ్‌.ఆర్‌.ఎఫ్‌ భావిస్తుంది. గత ప్రభుత్వం తలపెట్టిన రాజధాని ప్రాజెక్టు సుస్థిరమైనది కాదని మేము ఆనాడే చెప్పాము. సాధ్యాసాధ్యాలతో నిమిత్తం లేకుండా ప్రజలను కలల్లో విహరింపజేసి అమరావతిని రాజధానిగా ప్రకటించడాన్ని ఆనాడే మేము ఖండించాము.

ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసినప్పుడు అమరావతి ప్రాంత ప్రజలకు కలగబోయే నష్టాన్ని ముందుగా అంచనా వేసి వారికి తగిన ప్రత్యామ్నాయం చూపించి ఉండాల్సింది. ప్రభుత్వం ఆ పని చేయలేదు. ఆ ప్రాంత ప్రజలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని నోటి మాటగా అన్నదే కాని ఆ దిశగా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఉదాహరణకు, రాజధాని ప్రాంతంలో భూమిలేని నిరుపేద కుటుంబాలకు ఇస్తున్న రూ 2500/- పింఛనును రూ 5000/-కు పెంచుతామని చెప్పిన ప్రభుత్వం గత మూడు మాసాలుగా ఆ రూ 2500/- కూడా ఇవ్వడం లేదు. ఇది అమలు జరిగితే పనుల కోసం పొరుగూళ్లకు వెళ్ళలేని వారికి, ముఖ్యంగా వృద్ధులకు ఊరట కలుగుతుంది.

దళితులు, కొద్ది పాటి భూములున్న నిరుపేద బలహీనవర్గాల నుండి ఆనాడు రాజధాని స్థాపన పేరిట భూములు గుంజుకున్నారు. అప్పటిదాకా స్వంత భూముల్లో పని చేసే వారికి రాజధాని నిర్మాణ పనుల్లో కాస్త ఉపాధి దొరికింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాత కాంట్రాక్టులు రద్దు చేయడంతో రాజధాని నిర్మాణ పనులు చాలావరకు నిలిచిపోయాయి. స్వంత భూముల్లో, స్వంత ఊళ్ళో పనులు కోల్పోయి వారు నేడు సుదూర ప్రాంతాల్లో పనులకు వలస  వెళ్ళాల్సి వస్తోంది. రాజధాని పనుల నిమిత్తం ఇతర ప్రాంతాల నుండి వచ్చిన నిపుణులు, కార్మికులు తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లిపోవడంతో చేతివృత్తుల వారు, పండ్ల వర్తకులు, చిరువ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వ నిర్ణయంతో ఆ ప్రాంత ఆర్ధిక వ్యవస్థ కుంటుపడింది. ప్రజలకు ఇటు వ్యవసాయ పనులు, అటు రాజధాని నిర్మాణ పనులు రెండూ లేకుండా పోయాయి.

సి.ఆర్‌.డి.ఏ ప్రాంతంలోని 29 గ్రామాల్లో రాజధాని కోసం భూములు స్వచ్చందంగా ఇచ్చిన వారు ఉన్నారు, ఇవ్వని వారు ఉన్నారు. ప్రభుత్వం భయపెట్టి లాక్కోవడం వల్ల భూములు కోల్పోయిన వారూ ఉన్నారు. 2015-2019 మధ్య కాలంలో రాజధాని ఏర్పాటు పేరిట జరిగిన పరిణామాలు కొందరు కోరుకున్నవి, కొందరు కోరుకోనివి. ఆ పరిణామాల పర్యవసానం, రాజధాని మార్పు నిర్ణయ పర్యవసానం రెండింటినీ నేడు అందరూ అనుభవిస్తున్నారు. ఆ నిర్ణయాల ప్రభావం ఆ గ్రామాలలోని అన్ని కులాల వారిపై పడింది. వారిని ఈ సంక్షోభం నుండి బైట పడేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఏర్పడ్డ భూ వివాదాలను పరిష్కరించాల్సింది   ప్రభుత్వమే.

నిడమర్రు గ్రామస్తులు రాజధాని కోసం ఇచ్చిన భూముల్లో ఇప్పటికే సేద్యం మొదలుపెట్టారు. ఆ భూములు సాగు చేసుకోవడానికి యోగ్యంగా ఉన్నాయి కాబట్టి అది సాధ్యపడింది. సాగుకి సాధ్యమయ్యే భూములు ఏవో, శాసన రాజధానికి కావలసిన భూములు ఏవో నిర్ధారించి మొదటి రకం భూములను వారికి అప్పగించే ప్రక్రియను ప్రభుత్వం మొదలుపెట్టాలి.

ఆ ప్రాంతంలో ఒక శాంతియుత వాతావరణం తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. సంప్రదింపులు, పారదర్శకత సుపరిపాలనకు ఆయువుపట్టు. రాజధాని విషయంలో రెండు ప్రభుత్వాలూ ఆ బాధ్యతను విస్మరించాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజలను సంప్రదించకుండా గత ప్రభుత్వం ఏ తప్పు చేసిందో ఈ ప్రభుత్వం కూడా అదే చేసింది. ఆందోళన చేస్తున్న ఆ ప్రాంత ప్రజలపై కేసులు నమోదు చేసే బదులు వారితో చర్చలు జరిపి తగిన పరిష్కారం వెతకవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.

ఆ ప్రాంత ప్రజలు తీవ్ర మానసిక వత్తిడికి గురవుతున్నారు. దీనికి ప్రభుత్వం అకస్మాత్తుగా మూడు రాజధానుల నిర్ణయం ప్రకటించడం ఒక కారణమైతే దాన్ని ఇతర రాజకీయ పక్షాలు, కొన్ని మీడియా సంస్థలు పెంచి పోషించడం మరొక కారణం. మీడియా బాధ్యతా రహిత రిపోర్టింగ్‌ మానుకుని అక్కడ శాంతియుత వాతావరణం ఏర్పడటానికి సహకరించాలని మేము కోరుతున్నాము.

రాజధాని పనులు నిలిచిపోవడం వల్ల ఉపాధి కోల్పోయిన భూమి లేని నిరుపేదలకు తక్షణం ఉపాధి కల్పించాలని, ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరగడానికి చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, సేద్యం సాధ్యమయ్యే భూములను గుర్తించి రైతులకు తిరిగి అప్పగించాలని, సాగుకు యోగ్యం కాని భూములను సాగు యోగ్యం చేసి వాటిని వారికి అప్పగించాలని, ఆ ప్రాంతంలో రహదారుల నిర్మాణం, కృష్ణా నదిపై వంతెన నిర్మాణం చేపట్టాలని, ఈ పనులన్నిటిలో స్థానిక దళితులు, భూమి లేని నిరుపేదలకు ఉపాధి కల్పించాలని కోరుతున్నాము. తక్షణ, దీర్ఘకాలిక చర్యలేవో నిజాయితీగా గుర్తించి వాటి అమలును చేపడుతూ ప్రభుత్వం ఆ ప్రాంత ప్రజలకు ఊరట కల్పించాలని కోరుతున్నాం.

మానవహక్కుల వేదిక
ఆంధ్రప్రదేశ్‌
24 ఫిబ్రవరి 2020

Related Posts

Scroll to Top