కౌలు రైతులకు భరోసా ఇవ్వడం ప్రభుత్వ కనీస బాధ్యత

ప్రభుత్వాలు మారినా, కాలం గడిచిపోతున్నా రైతు ఆత్మహత్యలు మాత్రం యధాతధంగా జరిగిపోతూనే ఉన్నాయి. వరంగల్ జిల్లా, ఐనవోలు మండల కేంద్రంలో మార్చ్ నెలలో వారం రోజుల తేడాతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అన్ని సందర్భాలలో కారణాలు ఒకటే అయినా ప్రతి కుటుంబానికి ఒక కధ ఉంటుంది. ఆ కుటుంబాలను కలిసి వివరాలు తెలుసుకునేందుకు మానవ హక్కుల వేదిక బృందం ఈ రోజు (01-05-24) ఆ గ్రామాన్ని సందర్శించింది.

మార్చ్ 20 న చనిపోయిన బరిగెల ప్రశాంత్ వయసు 28 మాత్రమె. జీవితం మీద ఎన్నో ఆశలు పెంచుకునే వయసది. ఇంటర్మీడియట్ లో చదువు ఆపేసి చిన్నా చితకా పనులు చేసుకునే ప్రశాంత్ కు వివాహం అయినాక జీవితం మీద కొత్త ఆశలు కలిగాయి. స్వంత భూమి లేకపోయినా కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తే జీవితం మెరుగౌతుందని నమ్మాడు. ఏడాదికి పది వేల చొప్పున 2019 లో నాలుగెకరాలు కౌలుకు తీసుకున్నాడు. లక్ష ఏనభయ్యి వేలతో ఎడ్లను కొంటే అందులో ఒకటి చచ్చిపోయింది. చేసేది లేక ఉన్నదాన్ని నష్టానికి అమ్ముకున్నాడు. పొలంలో పత్తి, మొక్కజొన్న, వరి సాగు చేసినాసాగు ఖర్చుకు తోడూ వాతావరణం అనుకూలించక  ప్రతి సంవత్సరం నష్టాలే వచ్చాయి. కొండంత అప్పుతో నష్టాల ఊబిలో చిక్కుకున్న ప్రశాంత్ కు ఉరిపోసుకోవడమే మార్గం గా కనపడింది. ప్రశాంత్ ఏడాదిన్నర కొడుకు, భార్య ఉన్నారు. అప్పుల బాధను ఎలా మొయ్యాలో? తలిదండ్రులకు దిక్కెవరో?

అదే గ్రామంలో మళ్ళీ వారానికి చింతా సారయ్య అనే 50 సంవత్సరాల నిరుపేద, దళిత రైతు అదే దారి పట్టాడు. ఆ కుటుంబ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కనీసం ఇల్లు కూడా లేక ఒక పాత గదిలో నివాసం ఉంటున్న వీరి వంట సామాను ఒక పరదా కింద సరిపోయింది.  ఇద్దరమ్మాయిలకు పెళ్లిళ్లు చేసి అప్పులపాలైన సారయ్యకు అప్పుతో పాటు  ఇంకా ఒక అమ్మాయి, అబ్బాయిల బాధ్యత కూడా తోడయ్యింది. అందుకే కేవలం ఆటో నడుపుకుంటే కుటుంబ పోషణ, పిల్ల పెళ్ళీ కష్టమవుతుందని తోచి తనకున్న ఎకరన్నర భూమికి తోడుగా తన అన్న చింతా కట్టయ్య భూమిని కూడా కౌలుకు తీసుకుని 2020 లో వ్యవసాయం మొదలు బెట్టాడు. కాని యే సంవత్సరమూ పంట కలిసిరాక పెట్టుబడులు పెరిగిపోయి అప్పు తడిసి మోపెడయ్యింది. నిరాశకు లోనయ్యి మద్యానికి అలవాటుపడ్డాడు. చివరికి మద్యం కూడా తీర్చలేని తన కష్టాన్ని ఎండ్రిన్ గుళికలు తీరుస్తాయని నమ్మాడు. మార్చ్ 27న ఎండ్రిన్ గుళికలు మింగితే 29 నాడు హాస్పిటల్ లో చనిపోయాడు. ఇద్దరు పిల్లలతో కుటుంబాన్ని ఈదే బాధ్యత సారయ్య భార్యకు మిగిలింది.

రెండు కుటుంబాల వారు వ్యవసాయం కలిసిరాకపోవడానికి వాతావరణం అనుకూలించకపోవడంతోపాటు పెరిగిన పెట్టుబడులు, కల్తీ మందులని చెప్పారు. వారి కళ్ళకు అవే కనపడుతున్నాయి. వ్యవసాయం నడ్డి విరుస్తున్న ప్రభుత్వ విధానాలే ఈ స్థితికి ప్రధాన కారణం కాగా వాటికి తోడుగా  వాతావరణ మార్పులు కూడా చేరి అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. రెండు సంఘటనలలోనూ మనకు స్పష్టంగా కనపడుతుంది. కొత్త ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు నష్టపరిహారం ప్యాకేజిని ప్రకటిస్తే వారు కొంతైనా అప్పుల బాధ నుండి బయటపడతారు. అలాగే కౌలు రైతులకు కూడా వ్యవసాయంలో భరోసా ఇచ్చి అన్ని పధకాలకు అర్హత కలిపించాలి. వాతావరణ వైపరీత్యాలు జరిగినప్పుడు సమయానికి నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి. యే ప్రభుత్వానికైనా ఇది కనీస బాధ్యతగా ఉండాలి.

మానవ హక్కుల వేదిక
వరంగల్ జిల్లా శాఖ
01.05.2024

Related Posts

Scroll to Top