ఇథనాల్ ఫ్యాక్టరీనీ తాత్కాలికంగా నిలిపివేసి, నిపుణుల కమిటీ వేసి అన్నీ అంశాలు పరిశీలించాలి

పత్రిక ప్రకటన

నారాయణ పేట్ జిల్లా, మర్రికల్ మండలం, చిత్తనూరు గ్రామంలో జూరాల ఆర్గానిక్ ఫార్మ్స్ అండ్ ఆగ్రో ఇండస్ట్రీస్ ఇథనాల్ తయారు చేసే కర్మాగారం నెలకొల్పింది. గత 8 నెలలుగా ఈ ఫ్యాక్టరీ మూసీ వేయాలని 10 గ్రామాల రైతులు, ప్రజలు నిరవదిక ఆందోళన చేస్తున్నారు.

ఈ ఫ్యాక్టరీ రోజుకి 6 లక్షల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కర్మాగారం ఏర్పాటుకు సంబందించిన అనుమతులు అన్నీ మొదటినుండి వివాదాస్పదంగా ఉన్నాయి.

కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సవరించిన విధానాల కారణంగా ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా కంపెనీకి పర్యావరణ అనుమతులివ్వడం, స్థానిక ప్రజలకు కనీస  సమాచారం లేకపోవడం, రోడ్డు కోసమని అధికారుల అండదండలతో దళితుల భూములు బలవంతంగా లాగేసుకోవడం, దశాబ్దాల పోరాటాల ఫలితంగా సాధించుకున్న సాగు నీటిలో కొంత కంపెనీకి ఇవ్వడం ప్రజలలో అందోళన కలిగించాయి.

ప్రజలు సమస్యలకు సరైన పరిష్కారాలు చూపే బదులు, అబద్ధాలతో ప్రశ్నిస్తున్న ప్రజలపై దాడికి దిగారు. ఒక రాజకీయ పార్టీ ఐటి సెల్ ని ప్రశ్నిస్తున్న వారిపై ప్రయోగించారు. తిండి గింజల నుండి ఇథనాల్ ఉత్పత్తి పరిశ్రమ తెలంగాణ ప్రజలకు కొత్త కాదు. దాని దుష్ఫలితాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో అనుభవమైనవే. కరీంనగర్ దగ్గర పర్లపల్లిలోని ప్లాంటుతో భరించలేని దుర్వాసన బాధితులైన ప్రజలు నిరసన తెలిపితే వారిపై స్పెషల్ పోలీసులతో దాడి చేసి విచక్షణా రహితంగా ఆడ, మగా, వృద్ధులూ అందరినీ బాది, ఊరి పూజారితో సహా ఎందరినో కటకటాల పాలు చేసిన సంఘటన ప్రజలు ఇంకా మరవలేదు. ఆ ప్లాంటు యజమాని మాదే అధికారం అంటున్న రాజకీయ పార్టీలో ప్రముఖ నాయకుడు. జూరాల ఆర్గానిక్ ఫార్మ్స్ లో అధికారానికి పోటీలో వున్న ప్రధాన పక్షాల నాయకులు కూడా భాగస్వాములుగా ఉన్నారు.

రాజకీయ పార్టీలు ఎన్నికల కోలాహలం లో ఉండి సమస్య ను పట్టించుకోవడం లేదు.

గత వంద రోజులకు పైగా నిరసన తెలుపుతున్న గ్రామాల ప్రజలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాని ప్రజలు ధైర్యం సడలిపోక నిరసన కొనసాగిస్తూ, కంపెనీపై నిఘా వుంచారు. ప్లాంటు ఉత్పత్తి ప్రయత్నాలు ప్రారంభించింది. నియమాల ప్రకారం ఉత్పత్తి మొదలెట్టే ముందుగా కాలుష్య నియంత్రణ మండలి నుండి ప్లాంటు నడిపేందుకు CFO తీసుకోవాలి. అదిచ్చేముందు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ప్లాంటు పర్యావరణ అనుమతి పత్రంలో విధించిన షరతుల అమలు పరచారో లేదో పరిశీలించాలి. యీ ప్లాంటు విషయంలో అనుమతి పత్రం లో ఒక చుక్క వ్యర్ధ జలం కూడా బయటకు వదలకూడదని, ఉత్పత్తి క్రమంలో విడుదలైన మొత్తం కాలుష్య జలాలను పూర్తిగా శుద్ధి చేసి పునరుపయోగించాలని రెండు షరతులున్నాయి .

2. “The proponent shall obtain Consent for Operation (CFO) from TSPCB, as required Under Sec.25/26 of the Water (Prevention and Control of Pollution) Act, 1974 and under Sec. 21/22 of the Air (Prevention and Control of Pollution) Act, 1981, before commencement of the activity.”

7. “The industry shall treat and reuse the treated water within the factory and no waste or treated water shall be discharged outside the premises.”

కంపెనీ పై రెండు షరతులూ అమలు చేయలేదన్నది స్పష్టం. CFO తీసుకుని వుంటే వ్యర్ధ జలాలు మన్నెవాగులోకి విడువ వలసిన అవసరం రాకూడదు. క్రింది రెండిట్లో ఏదైనా జరిగి వుండాలి.

కాలుష్య నియంత్రణ మండలి నిర్మాణం పూర్తి కాకుండానే CFO యిచ్చి వుండాలి లేదా, ప్లాంటు యాజమాన్యం CFO లేకుండానే ఉత్పత్తి ప్రయత్నాలు ప్రారంభించి వుండాలి. కాలుష్య నియంత్రణ మండలి కుమ్మకు తోనే ఇదంతా జరుగుతూ వుండాలి.

మన్నెవాగులో వదలడం బయట పడింది గనుక దిక్కులేని స్థితిలో టాంకర్ లతో బయట పారబోయించే యత్నంలో రెండు సార్లు దొరికారు. ప్రజలకు తప్పు జరుగుతోందని తెలుసుగాని ఇది కాలుష్య నియంత్రణ మండలి పరిధిలోని విషయమని తెలియక పోలీసులను ఆశ్రయించారు. ఆ టాంకర్ బయటకు పంపేటపుడు కంపెనీ వ్యర్ధ జలాలు ఎక్కడి నుండి ఎక్కడికి తరలిస్తున్నారు, అందుకు అనుమతి వివరాలున్న మానిఫెస్ట్ కాపీలు డ్రైవర్ కి యివ్వాలి. ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేసినపుడు వారు వ్యర్ధాలు తరలించేందుకు అనుమతి ఉన్నదో లేదో చూడాలి. అనుమతి లేకుండా తరలిస్తుంటే కేసు పెట్టాలి. నిరంతర నిఘాతో జరుగుతున్న నేరాన్ని నిరూపణ చేసిన ప్రజలపై లాఠీ ప్రయోగించడం గర్హనీయం. ప్రభుత్వాధికారులు ప్రజల కోసం కాదు, సంపన్నుల సేవకులని మరో సారి నిరూపించారు.

పర్యావరణ నేరాలకి పాల్పడుతున్న జూరాల ఆర్గానిక్ ఫార్మ్స్ ని వదిలి వారి నేరాలను చూపిన ప్రజలపై పోలీసు దాడులను ఖండిస్తున్నాము.

ప్రభుత్వం వెంటనే ప్రజలు లేవనెత్తుతున్న అంశాల గురించి పట్టించుకోవాలని  మా సంస్థ డిమాండ్ చేస్తుంది.

Dr. తిరుపతయ్య, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.

Dr. K. బాబురావు,రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు.

S. జీవన్ కుమార్, ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు.

Dt.24.10.2023

Related Posts

Scroll to Top