వాకపల్లి: నేరము – శిక్ష
వాకపల్లి కేసులో నిందిత పోలీసులతో పాటు, వారి కంటే ఎక్కువగా కాకపోయినా వారితో సమానంగా అయినా, దర్యాప్తు సంస్థ కూడా విచారణకు గురైంది. సరైన సాక్ష్యాలు లేని కారణంగా జడ్జి పోలీసులను నిర్దోషులుగా విడుదల చేశారు కానీ దర్యాప్తు జరిగిన పద్ధతి, దర్యాప్తు అధికారులు మాత్రం దోషులుగా నిలిచారు. సాధారణంగా కేసు దర్యాప్తులో జరిగిన లోపాల మీద స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరగదు. కాని లోపభూయిష్ట దర్యాప్తుపై తీర్పులు ఇచ్చే విధంగా న్యాయశాస్త్ర పరిధి ఇటీవలే విస్తరిస్తోంది. దర్యాప్తు లోపాల వల్ల పూర్తి న్యాయం పొందలేకపోయినా, పట్టు వదలకుండా 2007 నుండి ఈ కేసులో పోరాడినందుకు మహిళలకు పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. స్పష్టంగా బయటకు అనకపోయినప్పటికీ, సెషన్స్ జడ్జి ఆ మహిళల సాక్ష్యాన్ని నమ్మినట్లు అర్థమవుతూనే ఉంది.