Bulletins

Bulletins, Latest Posts

మానవ హక్కులు-2024 ( బులెటిన్-18)

మానవహక్కుల వేదిక ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడుతూనే ఉంది. మా 10 వ మహాసభల సందర్భంగా ఇప్పుడీ సంచికను మీ ముందుకు తెస్తున్నాము. ఈ బులెటిన్‌ లో వివిధ విషయాల మీద సంస్థ ఆలోచనలనూ, అవగాహననూ వివరించే వ్యాసాలు ఉన్నాయి. ఉదాహరణకు ప్రగతిశీల న్యాయమూర్తిగా పేరున్న చంద్రచూడ్‌ చీఫ్‌ జస్టిస్‌ హోదాలో న్యాయవ్యస్థను దిగజార్చిన తీరును, ఆయన ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పులను ఒక వ్యాసంలో వివరించాము. గాజాలో జరుగుతున్న మారణహోమాన్ని ఎత్తిపట్టే వ్యాసమూ, కోనసీమ జిల్లాకి అంబేడ్కర్‌ పేరు పెట్టడంపై అగ్రవర్ణాలు చేసిన అల్లరిని వివరించే వ్యాసమూ కూడా ఉన్నాయి. మదర్సాలలో విద్యకు దూరం అవుతున్న ముస్లిం సమాజం వెతల గురించి, హిందుత్వ భావాలతో వాట్సప్‌ పుకార్లను నమ్మే ఐ.టి ఉద్యోగుల దుస్థితి గురించి కూడా రాసాము.

Bulletins, Latest Posts

మానవ హక్కులు-2022 ( బులెటిన్-17)

ఆచరణలో భారతీయ సమాజం ఎంతవరకు లౌకిక మార్గంలో అడుగులు వేసిందో గమనిస్తే మన సమాజంలోని అధిక సంఖ్యాకుల్లో మతాధిక్య భావన అనే చీకటి ఒక ప్రాంతం తర్వాత మరో ప్రాంతాన్ని క్రమంగా అలుముకుంటున్నదని అర్థమవుతూనే ఉంది. మూడు వరుసల ముద్రాక్షరాల్లోనో, ముప్పై నిమిషాల కథనాల్లోనో సమాజపు ఈ వర్తమాన గమనాన్ని ఎత్తి చూపడానికి, విశ్లేషించడానికి, ఖండించడానికి ఇప్పుడు ఏ మీడియా సంసిద్ధత లేదు. అయినా కటిక చీకటికి అలవాటు పడ్డాక కళ్ళు అందులోనే ఒక కాంతిని చూడగలవు. సమాజాన్ని కొన్ని విలువల ప్రాతిపదికగా నిర్మించుకోవాలని తపన పడేవాళ్ళకు ఆ కాంతి ఏదో ఒక రోజు కనబడి తీరుతుంది. అప్పటిదాకా ఒక మెరుగైన సమాజం కోసం మనకు మనమే ఏర్పరచుకున్న ఆదర్శాలను ఆచరణ సాధ్యమా కాదా అనే మీమాంసలో పడకుండా వల్లిస్తూనే ఉండాలి.

Bulletins, Latest Posts

మానవ హక్కులు-2019 ( బులెటిన్-16)

ప్రజాస్వామ్య, లౌకిక విలువలకూ వ్యవస్థలకూ సమాధి కట్టి వాటి స్థానే హిందూత్వ ఆధిపత్య రాజకీయ సౌధాల నిర్మాణం దిగ్విజయంగా సాగుతున్న దుర్దినాలు ఒక వైపు కొనసాగుతుండగానే కొవిడ్‌-19 విరుచుకు పడి సమాజాన్ని అతలాకుతలం చేయడం మొదలు పెట్టింది. కరోనాకు ఎటువంటి వివక్ష లేదని అనుకున్నా, అది మిగిలిన వారికంటే అణగారిన సమూహాలకు తలపెట్టిన హాని అంతాఇంతా కాదు. పేదల ఆరోగ్యాలనే కాక వారిని ఆర్థికంగా కూడా చావుదెబ్బ తీసింది. ప్రభుత్వాలకు పేదల పట్ల కించిత్తు బాధ్యత, బాధ కూడా లేదన్న విషయానికి వలస కార్మికుల హైవే యాత్రలే సాక్ష్యం చెప్పాయి. కరువు, సాంక్రమిక వ్యాధుల వంటి వైపరీత్యాలు మానవాళిని ఒక అత్యవసర పరిస్థితిలోకి (ఎమర్జెన్సీ) నెట్టేసే సందర్భాల్లో సైతం పెట్టుబడి ఎంత అనైతికంగా ప్రవర్తించగలదో కొవిడ్‌-19 తేటతెల్లం చేసింది.

Scroll to Top