రాజ్యాంగానికి 75 ఏళ్లు నిండినా దళితులపై వివక్ష యథాతథం

సిద్దిపేట రూరల్ మండలం సీతారాంపూర్ గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన అయిదుగురు దళిత యువకులను గుడిలోకి రాకుండా అడ్డుకున్నారని తెలిసి మానవ హక్కుల వేదికకు చెందిన ఆరుగురు సభ్యుల బృందం 02-06-24 నాడు బాధితులను, నిందితులను కలిసి వివరాలు సేకరించింది.

సీతారాంపూర్ గ్రామం ఒకప్పుడు చింతమడక హామ్లెట్ గా ఉండేది, అనంతర కాలంలో స్వతంత్ర గ్రామ పంచాయతి అయింది. దాదాపు వెయ్యి మంది జనాభా ఉన్న ఆ ఊరిలో సుమారు 80 దళిత కుటుంబాలు, 100 ఇతర కులస్తుల కుటుంబాలు ఉంటాయి. పోయిన నెల 28వ తారీకు, మంగళవారం రోజు సాయంత్రం హనుమాన్ మాల వేసుకున్న ఐదుగురు దళిత యువకులు ఊరిలో ఉన్న  హనుమాన్ గుడికి వెళ్ళారు. గుడిలోకి ప్రవేశించడం విషయంలో వారికీ  మాల ధరించిన ఇతర కులస్తులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ విషయంలో అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి కల్పించుకొని మాల ధరించిన దళిత యువకునికి ఫోన్ చేసి దళితులు గ్రామస్తులకు చెందిన గుడిలోకి రావడం ఎప్పుడూ జరగలేదనీ, అలా రాకూడదని హెచ్చరించినట్టు మాట్లాడినాడు. అంతే కాదు కులం పేరుతో దూషించినట్టు కూడా బాధితులు చెప్పారు. అప్పుడు మిట్టపల్లి కిషన్ అనే దళిత యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, గ్రామానికి చెందిన ఇద్దరు రెడ్డి కులస్తులపై  ఒక గౌడ కులస్తుడిపై పోలీసులు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, వారిని  రిమాండ్ కు పంపారు.

దేశానికి స్వాతంత్రం వచ్చి , మనుషులందరూ సమానమే అనుకొని, అందుకు తగిన రాజ్యాంగం రాసుకుని 75 సంవత్సరాలు గడిచినా సమాజంలో కుల వ్యవస్థ కారణంగా మనుషులందరూ అనేక సామాజిక వర్గాలుగా విభజింపబడి, ఇంకా ఒకరి పట్ల మరొకరు వివక్ష పాటిస్తూనే ఉన్నారు. దళితుల పట్ల అంటరానితనం ఇంకా సమసిపోకుండా కొనసాగుతూనే ఉన్నది. అందుకు తాజా సాక్ష్యమే ఈ సంఘటన.

రాజ్యాంగం ఏమి చెప్పినప్పటికీ ప్రభుత్వాలు సెంటిమెంట్ల పేరుతో ప్రజల మధ్య ఉన్న సాంస్కృతిక, సామాజిక వైరుధ్యాలను పెంచి పోషించుకుంటూ వస్తున్నాయి. ప్రజలకు తమ కులం పట్ల ఉండే వేర్పాటువాద భావాన్ని పెంచుకునే కుల సంఘాలను పోటీపడి ప్రోత్సహిస్తున్నాయి. ఫలితంగా,  ప్రజల మధ్య ఉన్న సామాజిక అంతరాలు తగ్గటం కాకుండా రోజురోజుకూ మరింతగా పెరుగుతున్నాయి.

సీతారాంపూర్ గ్రామంలో మాత్రమే కాకుండా అన్ని గ్రామాల్లో దళితుల పట్ల వివక్ష కొనసాగుతున్నది. దళితులు తాము అందరితో సమానమని ముందుకు వచ్చినప్పుడు మాత్రమే అది ఒక వివాదంగా మారి మిగతా సమాజంలో చర్చకు వస్తున్నది.

  1. సీతారాంపూర్లో వివక్ష పాటించిన వ్యక్తులపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధ్యులను శిక్షించాలి.
  2. సమాజంలో అంటరానితనము, కులవివక్ష అంతరించేటట్టు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు తీసుకోవాలి.
  3. ప్రజలు కూడా తమ మధ్య సోదరభావం పెంపొందించుకుంటూ మతతత్వం, కులతత్వాలకు తావు ఇవ్వకుండా మానవత్వమే మౌలిక ప్రమాణంగా ఐక్యంగా ఉండాలి.

ఈ నిజనిర్ధారణలో పాల్గొన్న మానవ హక్కుల వేదిక సభ్యులు డాక్టర్ ఎస్ తిరుపతయ్య, వనపాకల దిలీప్, ఎస్ అచ్యుత్ కుమార్, మారముల్ల కిరణ్, కొత్తూరు కుమార్, ఇంజం చైతన్యలు ఉన్నారు.

డాక్టర్ ఎస్ తిరుపతయ్య
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
మానవ హక్కుల వేదిక, తెలంగాణ

Related Posts

Scroll to Top