ఫిబవరి 22, 2017 నాడు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టి-జె.ఎ.సి.) హైదరాబాద్‌లో తలపెట్టిన నిరుద్యోగుల నిరసనర్యాలీ, బహిరంగసభ విషయంలో ప్రభుత్వం, ప్రభుత్వ అంగమయిన పోలీసు శాఖ వ్యవహరించిన తీరును పరిశీలించడానికి మానవ హక్కుల వేదికకు చెందిన నలుగురు సభ్యులతో నిజనిర్ధారణ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీలో ఎస్.జీవన్‌కుమార్ (ఉభయ రాష్ట్రాల అధ్యక్షులు), వి. బాలరాజు (నగర కమిటీ కార్యదర్శి), సయ్యద్ బిలాల్ (నగర కమిటీ ఉపాధ్యక్షులు), సంజీవ్‌కుమార్ (నగర కమిటీ సభ్యుడు) సభ్యులుగా వున్నారు. ఈ కమిటీ 22, 23 తేదీలలో టి-జె.ఎ.సి.నాయకులను, న్యూడెమోక్రసీ (రాయల వర్గం), న్యూడెమోక్రసీ (చంద్రన్నవర్గం), సిపిఎం, సిపిఐ, POW, ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్, టఫ్, పిడియస్‌యు, పివైఎల్ సంస్థ బాధ్యులను పోలీసు ఉన్నతాధికారులను, పోలీసు స్టేషన్లలో అధికారులను కలిసి మాట్లాడి విషయ సేకరణ చేసి ఈ నివేదిక తయారు చేయడం జరిగింది.
నిరుద్యోగ నిరసన ర్యాలీ నిర్వహిస్తామని ర్యాలీకి అనుమతి కోరుతూ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టి-జె.ఎ.సి) బాధ్యులు ఫిబ్రవరి మొదటి వారంలోనే నగర పోలీసు కమీషనర్‌ను కలిసి అనుమతి కోసం ధరఖాస్తు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం వెంటనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ టి-జె.ఎ.సి. అన్ని జిల్లాలు పర్యటించి ప్రచారం చేస్తుంటే, ప్రభుత్వం మాత్రం ఉద్యోగాల భర్తీ విషయంలో ఎటువంటి ప్రకటన చేయకుండా మమ్మల్ని విమర్శించడమే పనిగా పెట్టుకుని కొందరు మంత్రులు, ప్రజా ప్రతినిధులతో బాధ్యత లేకుండా అవాస్తవమైన ప్రకటనలను చేయించిందని టి-జె.ఎ.సి. సంస్థబాధ్యులు అభిప్రాయపడ్డారు. అయినా నిర్దిష్టమైన ప్రకటన ఏదైనా చేస్తుందేమోనని చివరి వరకు వేచి చూశామని కూడా చెప్పారు. ఫిబ్రవరి 22న తలపెట్టిన ర్యాలీకి పోలీసుల నుండి నుండి ఏ సమాచారం రాకపోవడంతో అనుమతి పొందడానికి కోర్టుకు వెళ్ళాల్సి వచ్చిందని, ట్రాఫిక్ ఇబ్బందుల దృష్టా ర్యాలీ మానుకుని బహిరంగ సభ నిర్వహించుకొమ్మని కోర్టు సూచించిందని తెలిపారు. ఈ మేరకు తాము ఒప్పుకున్నప్పటికీ పోలీసులు చివరి రోజు వరకు తాము ప్రతిపాదించిన ప్రదేశాలలో బహిరంగ సభకు అనుమతించలేదని, తమకు అనువుగా లేని ప్రదేశాలను కోర్టు సూచించే పరిస్థితి కల్పించడంతో విధిలేని పరిస్థితిలో కోర్టు నుండి అనుమతి కోసం వేసిన పిటీషన్ ఉపసంహరించుకుని ప్రశాంతంగా సుందరయ్య భవన్ నుండి ఇందిరా పార్కు వరకు ఊరేగింపు తీయడానికి సిద్ధపడ్డామని నిర్వాహకులు తెలిపారు. కోర్టు సూచన ప్రకారం నాగోల్‌లో సభ జరపడం సాధ్యపడని విషయమని, అక్కడ సభ జరుపుకునే పరిస్థితులు లేవని, అందువల్లనే కోర్టు సూచన పాటించలేకపోయామని వారు తెలిపారు.
ర్యాలీకి 15 రోజుల ముందు నుండే అన్ని జిల్లాలలో టి-జె.ఎ.సి. బాధ్యులను విచారణ పేరుతో వేధించడం మొదలు పెట్టారు. నిఘా వర్గాలు టి-జె.ఎ.సి. సభ్యుల వ్యక్తిగత విషయాలైన ఆస్తుల వివరాలు, పిల్లల చదువుల వివరాలు, పిల్లలు విదేశాలలోవున్నారా? ఎన్ని కార్లున్నాయి? ఎన్ని ఇండ్లు వున్నాయి? లాంటి విషయాలపై వివరాలు అడిగారని తెలిసింది. సంస్థ చేపట్టిన కార్యక్రమానికి పోలీసులు ఆరా తీసిన వివరాలకు ఏమీ సంబంధం లేదు. జిల్లాలోని కార్యకర్తలను మానసికంగా వేధించి, భయపెట్టడానికి పోలీసు వర్గాలు చేసిన ప్రయత్నంగా మా సంస్థ భావించాల్సి వస్తోంది.
కోర్టులో అనుమతి విషయంలో వాదనలు జరుగుతుండగానే రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు మొదలైనాయి. అంటే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సభకు అనుమతించకుండా కఠినంగా వ్యవహరించాలన్న తలంపుతో వున్నట్టు స్పష్టంగా అర్ధమవుతుంది. 21వ తేదీ రాత్రి పెద్ద ఎత్తున జిల్లాలలో అరెస్టులు మొదలు పెట్టారు. 22 ఉదయం జిల్లాలలోని బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో యువకులను ఎవరినీ నిలబడనీయలేదు. హైదరాబాద్‌కు రావడానికి ప్రయత్నించిన యువకుల్ని అక్కడే ర్యాలీ తీయడానికి ప్రయత్నించిన ప్రజాసంఘాల నాయకులను అరెస్టు చేశారు.
నగరంలో పరిస్థితి: ఆ రోజు నగరాన్ని పోలీసులు పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీఆర్ గ్రౌండ్ లో దాదాపు వెయ్యిమంది పోలీసులు ఒక రోజు ముందు నుండే బస చేశారు. ఇందిరాపార్కు దగ్గర కొబ్బరి బోండాల దుకాణాలను, టిఫిన్, ఛాయ్ సెంటర్లను మూసివేయించారు. ఆటోలను ఆ ప్రాంతంలో నిలబడనీయలేదు. ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర, శివంరోడ్ ఎన్సిసి దగ్గర, సుందరయ్య భవనం దగ్గర కూడా టిఫిన్ సెంటర్లను, ఛాయ్ దుకాణాలను, చిన్న చిన్న హోటళ్లను మూసివేయించారు. సుందరయ్య భవన్, ఉస్మానియా యూనివర్శిటీ, ఇందిరా పార్కు వద్ద బారీకేడ్లు, ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాలలో మనుష్య సంచారం లేకుండా చేసారు. 21 రాత్రి మగ్దూం భవన్, న్యూడెమోక్రసీకి చెందిన రెండు ఆఫీసులను, సుందరయ్య భవన్‌పై దాడి చేసి ఆఫీసులలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆఫీసులలో వుండే కార్యాలయ బాధ్యులు తలుపులు బిగించుకుని లోపలే వుండిపోయారు. యూనివర్శిటీలోని డి-హాస్టల్, ఈ-హాస్టల్, రీసెర్చ్ స్కాలర్ హాస్టల్స్‌పై దాడి చేసి వందకు పైగా విద్యార్థుల్ని అదుపులోకి తీసుకున్నారు. మాణికేశ్వర్‌నగర్‌లో సాయంత్రం నుండే పోలీసులు పెద్ద మొత్తంలో మోహరించారు. గతంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక తలపెట్టిన కార్యక్రమాల సందర్భంలో ప్రవర్తించిన దానికంటే చాలా కఠినంగా పోలీసులు ఈ సందర్భంలో వ్యవహరించారు. నిరసన ర్యాలీలో పాల్గొనదలిచిన విద్యార్థుల్ని, వివిధ సంఘాల కార్యకర్తలను అరెస్టు చేసిన క్రమంలో పోలీసులు చాలా ఆగ్రహంతో కసిగా ప్రవర్తించారు. మహిళలను, విద్యార్థినిలను ఈడ్చుకుపోవడం, వీపుల మీద గుద్దడం, అమ్మాయిల తొడలు గిల్లడం లాంటి హేయమైన చర్యలకు పాల్పడ్డారు. POW సంధ్యను, ఆమె సహచరులతోపాటు ఆర్టీసి క్రాన్‌రోడ్స్ వద్ద అరెస్టు చేసి పోలీసు బస్సుల్లోకి ఎక్కిస్తున్న సందర్భంలో ఆమె కుడికాలును మెలిపెట్టడంతో ఆమె బస్సు మెట్లపై కుప్పకూలింది. అమె తొడ, కండలు నలిగి (మజిల్ టేర్), ఎడమ తొంటి ఎముక తీవ్ర వత్తిడికి గురయ్యింది. ఆమె బాధతో అరుస్తు గోల చేయడంతో ఆమెను ప్రైవేటు హాస్పటల్లో చేర్చించి సాయంత్రం ఇంటికి పంపారు. టిపిఎఫ్ బాధ్యులు రవిచంద్రను రోడ్డుపై ఈడ్చుకెళ్ళి వ్యానులో పడేశారు. ఆయనకు రెండు మోచేతులూ కొట్టుకు పోయి రక్తం కారింది. టి-జె.ఎ.సి చైర్మన్ కోదండరాంను అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నపుడు పోలీసులు ఎప్పుడూ లేని విధంగా తీవ్ర ఆగ్రహాన్ని అర్ధంలేని ప్రతీకార భావాన్ని ప్రదర్శించారు. దాదాపు 200 మంది పోలీసులతో డి.సి.పి రవీందర్ నాయకత్వంలో అర్ధరాత్రి కోదండరాం ఇంటికి వెళ్ళి ఆయన తెల్లవారిన తర్వాత అరెస్టు అవుతానని చెప్పినా వినకుండా గడ్డపారతో ఇంటి తలుపులను బలవంతంగా పగలగొట్టి ఆయనతోపాటు ఇంట్లో వున్న 20 మంది సభ్యులను అరెస్టు చేశారు. ఇంట్లోని ముందు రూములో వున్న సిసి కెమెరా వైర్లను తెంపేశారు. ఇంట్లో టీవీ, ఇంటర్నెట్ కేబుల్ వైర్లను తెంపేశారు. మా కమిటీ సభ్యులు తొమ్మిది గంటలకు ఆయన ఇంటికి వెళ్లి ఆయన భార్యను కలిసి పరిస్థితిని పరిశీలించడానికి వెళ్ళినప్పుడు పోలీసులు పంపిన వడ్రంగులు తలుపులను మరమ్మత్తు చేయడం, వాటికి రంగులు వేయడం మా కమిటీ గమనించింది. వారసిగూడలో నివాసముండే తెలంగాణ రైల్వే ఎంప్లాయీస్ జాయింట్ కన్వీనర్ జె. ముత్తయ్య ఇంటిపై కూడా దాడి చేసి, తలుపులు బద్దలు కొట్టి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. సుందరయ్య భవన్‌లోకి వెళుతున్న జస్టిస్ చంద్రకుమార్‌ను కూడా చిక్కడపల్లి పోలీసులు ఆయన ప్రతిఘటిస్తున్నా వినకుండా బలవంతంగా లాక్కెళ్ళి జీపులో కూర్చోబెట్టాడు. అక్కడే విమలక్కతోపాటు, అరుణోదయ కళాకారులను, ఎస్.ఎఫ్.ఐ, డి.వై.ఎఫ్, సి.పి.ఎం. కార్యకర్తలను బలవంతంగా వ్యానుల్లోకి ఎక్కించారు. అన్ని జిల్లాలలో అరెస్టులు జరిపినప్పుడు పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించారని మాకు సమాచారం లభించింది. ఐ.పి.ఎస్. క్యాడర్‌కు చెందిన డిసిపి స్థాయి అధికారి గడ్డపారను తెప్పించి కోదండరాం ఇంటితలుపులను తెరిపించడం అత్యంత గర్హనీయం. ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులు, తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా సమాధానం చెప్పాల్సిన బాధ్యత వుంది. అరెస్టు చేసినవారిని ఎక్కడ వుంచిందో కూడా పోలీసులు తెలుపలేదు. అరెస్టు చేస్తున్నప్పుడు సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గాదర్శకాలేవీ పోలీసులు పాటించలేదు. అరెస్టు విషయంలో బంధువులకు, స్నేహితులకు లేదా అరెస్టు కాబడ్డ వ్యక్తి కోరిన వారికి సమాచారం ఇవ్వలేదు. అదట్లా వుంచి, పత్రికా విలేకరుల ద్వారా విషయం తెలుసుకుని పోలీసు స్టేషన్లకు వెళ్ళిన బంధువులను స్నేహితులను అడ్డుకున్నారు. కామాటిపురా పోలీసు స్టేషన్లో కోదండరాం, రఘులను కలవడానికి వెళ్ళిన మాజీ పార్లమెంటు సభ్యులు అంజన్‌కుమార్ యాదవ్‌ను అడ్డుకుని, ఆయనతోపాటు, ఆయన అనుచరులను అరెస్టు చేసి, వేరే స్టేషన్‌కు తరలించారు. పోలీసు స్టేషన్లలో మంచినీళ్లు, ఆహారం మాత్రం సరిగ్గానే సరఫరా చేశారని అరెస్టు అయినవారు మా కమిటీకి తెలిపారు.
నగరంలో, నగరం చుట్టుపక్కన 350 చెక్‌పోస్టులు, పికెట్లను ఏర్పాటు చేశారు. దాదాపు 12 వేల మంది పోలీసులను నగరంలో, రాచకొండ, సైబరాబాద్ కమీషనరేట్ల పరిధిలో విధుల్లో నియమించామని అధికార వర్గాలు తెలిపాయి. సుందరయ్య భవన్ దగ్గర 200 మంది సాయుధ పోలీసులను, 20 మంది సి.ఐ.లను, 20 మంది సబ్ఇన్ స్పెక్టర్లను, రెండు డజన్ల మంది మఫ్టీ పోలీసులను నియమించారు. ఇందిరాపార్కు, ఆర్టీసి కాస్రోడ్ దగ్గర 600 మంది సాయుధ పోలీసులను వుంచారు. నగరంలో మొత్తం 747 మంది (నగరం – 447 మంది, రాచకొండ కమీషనరేట్ – 227, సైబరాబాద్ – 74 మంది)ని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు ప్రకటించారు. కానీ ఈ సంఖ్య 2 వేలకు పైగానే వుంటుందని జేఏసీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. అన్ని జిల్లాలలో 20, 21, 22 వ తేదీలలో 18 వేల దాకా అరెస్టులు జరిగాయని జేఏసీ బాధ్యులు చెప్పారు. కానీ ప్రభుత్వ వర్గాలు మాత్రం 3,200 మందిని మాత్రమే అరెస్టు చేశామని ప్రకటించారు. ముందస్తు అరెస్టులు ఏ చట్టం కింద చేసింది పోలీసులు స్పష్టంగా చెప్పడం లేదు. 151 సిఆర్పిసి ప్రకారంగా, ఒక నేరం చేసే తలంపు వుందని పోలీసులు భావిస్తే ఏ ఆదేశాలు లేకుండా అరెస్టు చేసే అధికారం వుంది. కానీ వరంగల్ నుండో, కరీంనగర్ నుండో ఒక వ్యక్తిని బస్సు ఎక్కే క్రమంలో అరెస్టు చేసి ఈయన ఒక నేరం చేయడానికి వెళుతున్నాడు కాబట్టి అదుపులోకి తీసుకుంటున్నామనడం సరైంది కాదు. అనుమతి విషయం తేలకముందుకూడా అరెస్టులు జరిగాయి. ఈ చర్య చట్టవిరుద్ధం అవుతుందిగానీ, ముందస్తు నేర నివారణ చర్య ఎంతమాత్రం కాదు.
ముగింపు / నిర్ధారణ: పైన వివరించిన పరిణామాలన్ని గమనించిన తర్వాత రాజ్వాంగంలో పొందుపరిచిన మౌలిక అంశాలైన స్వేచ్ఛ, భావ ప్రకటన హక్కులను ప్రభుత్వం పూర్తిగా కాలరాసిందని మానవ హక్కుల వేదిక భావిస్తోంది. బహిరంగ సభ లేదా ర్వాలీ నిర్వహించడానికి అనుమతి ఇవ్వలేని పరిస్థితి వుంటే టి-జె.ఎ.సి నాయకత్వాన్ని చర్చలకు పిలిచి విషయాలు వివరించాల్సి ఉండే. కనీసం ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం చేవట్టిన కార్యక్రమాలు, భవిష్యత్తులో చేయబోతున్న కార్వక్రమాల్ని ప్రభుత్వమే పత్రికల ద్వారా ప్రకటన చేయాల్సి వుండె. సంప్రదింపులు, చర్చలు ప్రజాస్వామిక ప్రభుత్వ పాలనలో ముఖ్వమైన అంశాలు అనే విషయాన్ని మా వేదిక ప్రభుత్వానికి ఈ సందర్భంలో ప్రభుత్వానికి గుర్తుచేస్తున్నది. పోలీసుల ప్రవర్తన పట్ల మా సంస్థ తీవ్ర అభ్యంతరం వ్వక్తపరుస్తోంది.
గత 50 నంవత్సరాలుగా ప్రజా ఉద్యమాలను అణచడానికి, నక్సలైట్ కార్యకర్తలను భౌతికంగా నిర్మూలించడానికి ప్రభుత్వాలు పోలీసులకు చట్టవ్వతిరేకమైన అధికారాలిచ్చి, పోలీసులు ఎన్ని నేరాలు చేసినా శిక్ష ఉండదు అనే సంస్కృతిని పెంచి పోషించాయి. ప్రజల పోరాటంతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న ప్రభుత్వం కూడా “అణచివేతను” పాలనా పద్ధతిగా గత ప్రభుత్వాల లాగానే కొనసాగించదల్చుకుందని మా సంస్థ బావిస్తుంది. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ పట్ల చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించిన సంఘటనలపై ఒక సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మా వేదిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఇప్పటికైనా ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తోంది. కార్యకర్తలపై బనాయించిన అన్ని అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరుతోంది.
ఎస్. జీవన్‌కుమార్ (ఉభయ రాష్ట్రాల అధ్యక్షులు)
సయ్యద్ బిలాల్ (నగర కమిటీ ఉపాధ్యక్షులు)
వి. బాలరాజు (నగర కమిటీ కార్యదర్శి)
సంజీవ్ కుమార్ (నగర కమిటీ సభ్యుడు)
తేదీ: మార్చి 2017