ఆంటోనీని ఆత్మహత్యకు పురిగొల్పిన ఒంగోలు పోలీసులపై కేసు పెట్టాలి

తాడేపల్లిలోని మహానాడు నగర్‌ ప్రాంతానికి చెందిన పేరం ఆంటోనీని ఆత్మహత్యకి పురిగొల్పిన కేసులో నమోదు కాబడిన కేసుకి (ఐ.పి.సి సెక్షన్‌. 309), అపహరణ (ఐ.పి.సి సెక్షన్‌. 363), చట్టవిరుద్ధంగా నిర్భందించడం (ఐ.పి.సి సెక్షన్‌. 342), పెడ్యూల్డ్‌ ట్రైబ్‌ కి చెందిన వ్యక్తి మీద, షెడ్యూల్డ్‌ కులానికి చెందిన వ్యక్తి మీద అక్రమంగా చట్టపరమైన చర్యలు తీసుకోవటం (ఎస్‌.సి./ఎస్‌.టి అత్యాచారాల నిరోధక చట్టంలో సెక్షన్‌. 3(1) (0)), షెడ్యూల్డ్‌ ట్రైబ్‌ కి చెందిన వ్యక్తిని దూషించటం (ఎస్‌.సి./ఎస్‌.టి అత్యాచారాల నిరోధక చట్టంలో సెక్షన్‌. 3(1) (s)), షెడ్యూల్డ్‌ ట్రైబ్ కి చెందిన వ్యక్తిపై ఐ.పి.సి ప్రకారం జీవితఖైదు శిక్షార్హమైన నేరానికి పాల్పడటం (ఎస్‌.సి./ఎస్‌.టి అత్యాచారాల నిరోధక చట్టంలో సెక్షన్‌. 3(2) (v)) నేరాలు కూడా జతచేయ్యాలి. ఒంగోలు క్రైమ్‌ సెంట్రల్‌ స్టేషన్‌ ఎస్‌.ఐ. కమలాకర రావు, ఆ స్టేషన్‌ లో ఇంకొక ముగ్గురు కానిస్టేబుళ్ళని ఈ కేసులో ముద్దాయిలగా చేర్చాలి. ఆ స్టేషన్‌ డి.ఎస్‌.పి. ఏ.ప్రసాద్‌ కుమార్‌ ని విధుల నుండి తొలగించి స్టేషన్‌ లో అంటోనీ, శేఖర్‌ లని హింసించటానికి మద్దతు అందచేసిన అభియోగం మీద విచారణ జరపాలి. తనకి జరిగిన అవమానానికి, తన వైద్యానికి అయిన ఖర్చుకి అంటోనీకి నష్టపరిహారం చెల్లించాలి అని మానవ హక్కుల డిమాండ్‌ చేస్తుంది.

మే 30, 2019 నాడు తాడేపల్లి మహానాడు నగర్‌ కి చెందిన పేరం ఆంటోనీ ఎలుకల మందు తాగి ఆత్మహత్యాప్రయత్నం చేశాడు. ఆత్మహత్యాప్రయత్నం చేసే ముందు తన అక్కకి తాను ఇలా చేసుకుంటున్నాను అని వాట్స్‌ ఆప్‌ ద్వారా మెసేజ్‌ పంపించాడు. ఒంగోలు సి.సి.ఎస్‌ పోలిసులు పెట్టిన శారీరిక, మానసిక హింస తట్టుకోలేక ఈ చర్యకి పాల్పడుతున్నాను అని చెప్పాడు.

ఈ విషయం మీద నిజనిర్ధారణకు అరువురు సభ్యుల మానవ హక్కుల వేదిక బృందం పర్యటించి పేరం అంటోనీ, గిరి శశేఖర్‌ అతని కుటుంబసభ్యులు, తాడేపల్లి ఎస్‌.ఐ నారాయణ, ఒంగోలు సి.సి.ఎస్‌ డి.ఎస్‌.పి ఏ. ప్రసాద్‌ కుమార్‌, సి.ఐ. పరంధామయ్య లతో మాట్లాడటం జరిగింది.

తాడేపల్లి మహానాడు నగర్‌ లో నివసించే ఎరుకుల తెగకి చెందిన పేరం అంటోనీ (23) మొన్ననే చెన్నైలో ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. వృత్తిరీత్యా ఆటో డ్రైవర్‌ అయిన గిరి శేఖర్‌ మాల కులస్టుడు. తను తన కుటుంబంతో కలిసి అంటోనీ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు. అంటోనీ అక్క హైదరాబాదులో న్యాయవాది. మే 26, 2019 నాడు ఉదయం గంటలకి ఒక పోలిసు బృందం అంటోనీ ఇంటికి మఫ్టీలో, ముఖానికి గుడ్డలు చుట్టుకుని సెవెన్‌-సీటర్‌ ఆటోలో వచ్చారు. రావటం, రావటం అప్పటికి కూరగాయలు తరుగుతున్న శేఖర్‌ భార్య చేతిలో ఉన్న కూరగాయలు తరిగే కత్తిని ఒక మహిళా కానిస్టేబుల్‌ లాక్కుని శేఖర్‌ భార్య మెడ మీద పెట్టింది. దాని తరువాత అంటోనీని, శేఖర్‌ ని ఇంట్లో నుండి బలవంతంగా లాక్కెళ్ళి, చేతులకి బేడీలు వేసి పోలీసులు వచ్చిన ఆటోలో పడేసారు. దీనిని ఆ వీధిలో ఉన్నవారందరూ చూశారు. ఆ తరువాత తాడేపల్లి నులకపేట ప్రాంతంలో పార్క్‌ చేసిన తమ కారులోకి పోలీసులు అంటోనీ, శేఖర్‌ లని మార్చారు. అక్కడనుండి ఒంగోలు సి.సి.ఎస్‌ స్టేషన్‌ కి తీసుకువెళ్ళే వరకు వీరిద్దరినీ కొడుతూనే ఉన్నారు. స్టేషన్‌ క్రి తీసుకువెళ్ళిన తరువాత లారీ దెబ్బలు, కులం పేరు మీద దూషణలు, బెదిరింపులు మొదలయ్యాయి. నాలుగు రోజుల పాటు నిర్విరామంగా కొనసాగింది ఈ తంతు. స్టేషన్‌ మొదటి అంతస్టులోని ఒక గదిలో ఒక మూలాన ఉన్న కిటికీకి వీరిద్దరినీ కట్టేశారు. కాళ్ళకి సంకెళ్ళు, చేతులకి బేడీలు వేశారు. శేఖర్‌ కి రక్తపోటు, మధుమీహం, క్షయ ఉన్నాయి. తనకి కూడా కాళ్ళకి సంకెళ్ళు వెయ్యటంతో కాళ్ళ కింద భాగాన పుళ్ళు లేచాయి. తను స్టేషన్‌ లో సొమ్మసిల్లిపడిపోతే డాక్టర్‌ ని పిలిపించారు. డాక్టర్‌ శేఖర్‌ కి మధుమేహం 460mg/dL ఉందని చెప్పారు. అయినా కూడా రోజు ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌ వేసుకోవాల్సిన శేఖర్‌ కి ఒక్క రోజు కూడా ఇన్సులిన్‌ ఇంజెక్షన్ ఇవ్వలేదు.

ఎస్‌.ఐ. కమలాకర రావు, ముగ్గురు కానిస్టేబుళ్ళు ఇక తమ ప్రతాపం చూపించటం మొదలుపెట్టారు. అంటోని దొంగతనం చేశాడని, దొంగతనం చేసిన సొమ్ము ఆరు లక్షలు లేదా ఇరవై కాసుల బంగారం తిరిగి ఇవ్వాలని, ఇవ్వకపోతే లాక్‌ అప్‌ నుండి ప్రాణాలతో తిరిగి వెళ్ళడని బెదిరించారు. తమ కస్టడిలో ఉన్నవారి మీద కేవలం పోలీసులు మాత్రమే చూపించగలిగే హింసాత్మకమైన ప్రవర్తనని అంటోనికి నాలుగు రోజుల పాటు చూపించారు. బలవంతంగా సాగదీసిన కాళ్ళ మీద ఇద్దరు కానిస్టేబుళ్ళు నుంచోగా ఎస్‌.ఐ. కమలాకర రావు, ఇంకొక కానిస్టేబుల్‌ అంటోనీ కాళ్ళ మీద, చేతుల మీద, పిర్రల మీద తమ లాఠీలతో బాదారు. ఈ కొట్టడంతో పాటు ‘మీ ఎరుకులోళ్ళకి దొంగతనాలు చెయ్యటం మాత్రమే వచ్చు’, ‘మీ అమ్మ ఏమి చేస్తుందో మాకు తెలుసులే’ అంటూ బూతులు లంకించుకున్నారు. అంటోనీని కొడుతున్నప్పుడే ప్రమీలకి ఫోన్‌ చేసి ‘లంజా నీ కొడుకు తిరిగి రావాలంటే ఆరు లక్షల రూపాయలు కానీ ఇరవై కాసుల బంగారం కానీ ఇవ్వు’ అని ప్రమీలని దూషించారు. కొడుతున్నప్పుడు అంటోనీ అరుపులని కావాలని ఫోన్‌ ద్వారా వాళ్ళ అమ్మకి వినిపించారు. మే 29 వరకు ఇదే దినచర్య కొనసాగింది.

కానీ ప్రమీల పోలీసుల డిమాండ్‌ కి తలొగ్గలేదు.మీరేమైనా చేసుకోండి, నేను మాత్రం రూపాయి కూడా ఇవ్వను, న్యాయపోరాటం చేస్తాను అని తేల్చిచెప్పారు. దానితో నాలుగు తరువాత తమ బెదిరింపులు పని చెయ్యటం లేదు అని తెలుసుకున్న పోలిసులు అంటోనీ, శేఖర్‌ లని వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ కి తీసుకువెళ్ళి, పద్నాలుగు రకాల వేలిముద్రలు తీసుకుని, సి.ఆర్‌.పి.సి సెక్షన్‌ 109 కింద బైండోవర్‌ చేసి పంపించారు. ఈ బైండోవర్‌ కూడా చట్ట వ్యతిరేకమే. కేవలం ఎక్టిక్యూటివ్‌ మేజిస్టేట్‌ కి మాత్రమే బైండోవర్‌ చేసే అధికారం ఉంది. తరువాత ఇద్దరినీ పంపించివేశారు.

మే 30 నాడు ఇంటికి చేరుకున్న అంటోనీ తనకి జరిగిన అవమానాన్ని భరించలేక ఆ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయానికి నీళ్ళలో ఎలుకల మందు కలుపుకుని తాగాడు. ఆత్మహత్యాప్రయత్నం చేసే ముందు తన అక్కకి తాను ఇలా చేసుకుంటున్నాను అని వాట్స్‌ ఆప్‌ ద్వారా మెసేజ్‌ పంపించాడు. అంటోనీ అక్క తక్షణమే ప్రమీలకి చెప్పడంతో హుటాహుటిన దగ్గరలోని మణిపాల్‌ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. ఐదు రోజుల పాటు ఉండవలసి వస్తుంది అని చెప్పిన ఆసుపత్రి వర్గాలు రెండు రోజుల్లోనే ఏ కారణం చెప్పకుండా తొందర పెట్టి పంపించివేశారు. అక్కడ వైద్యానికి ముప్పై ఆరు వేల రూపాయలు ఖర్చు అయ్యింది. అంటోనీ మెసేజ్‌ చేసినప్పుడు తన అక్క మేల్కొని ఉండటంతో ఈ రోజు అంటోనీ మిగిలాడు.

ఇక్కడ చెప్పుకోవలసిన విషయం ఉంది. పోలీసులు ఎప్పుడైనా చోరీకి గురయ్యిన సొత్తు రికవరీ చెయ్యాలి అంటే ఎరుకుల, యానాది వాళ్లనే తీసుకువెళ్ళి పోలీసు స్టేషన్‌ లో చిత్రహింసలకి గురిచేస్తుంటారు. ఇది వారికి మానుకోలతేని అలవాటుగా తయారయ్యింది. ఒక సమాజం సమాజం మొత్తాన్ని దొంగలుగా, నేరస్టులుగా ముద్ర వేసి ఆ ముద్రని తమకి అనుకూలంగా, తమ స్వలాభానికి వాడుకోవటంలో ఆంధ్రా పోలీసులు ఆరితేరారు. అంతేకాక పోలిసుల దాప్టికం ఆగకుండా కొ నసాగుతున్నది. గత పద్దెనిమిది నెలలలో ఇది కనీసం పదమూడవ ఘటన.

ఎఫ్‌.ఐ.ఆర్‌ లో నమోదు చేసిన ఆత్మహత్యకి పురిగొ ల్పిన సెక్షన్‌ ఏ మాత్రం సరిపోదు అని, పైన పేర్కొన్న సెక్షన్‌ లు అన్నీ దానికి జత చెయ్యాలి అని మానవ హక్కుల వేదిక డిమాండ్‌ చేస్తుంది. ఎస్‌.ఐ.కమలాకర రావు, ముగ్గురు కానిస్టిబుళ్ళని ముద్దాయిలుగా చేర్చాలి. ఎస్‌.ఐ. కమలాకర రావుని, డి.ఎస్‌.పి. ఏ. ప్రసాద్‌ కుమార్‌ ని విధుల నుండి తొలగించి వారిద్దరి మీద విచారణ చేపట్టాలి. ఎరుకుల, యానాది వాళ్ళని నేరస్టులుగా, దొంగలుగా పోలిసులు చిత్రించటం ఆపటానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని మానవ హక్కుల వేదిక డిమాండ్‌ చేస్తుంది. పోలీస్‌ కస్టడిలో హింసకి తావులేకుండా చూడాలని మానవ హక్కుల వేదిక ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తుంది.

మానవ హక్కుల వేదిక
ఆంధ్రప్రదేశ్
12 జూన్ 2019

Related Posts

Scroll to Top