వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న అన్యాయమైన విధానాల వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు కోలుకోలేని పరిస్థితికి నెట్టబడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మానవహక్కుల వేదిక (హెచ్. ఆర్. ఎఫ్), రైతు స్వరాజ్య వేదిక (ఆర్.ఎస్.వి) సంయుక్త బృందం మే 14, 15 తేదీలలో గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో 19 గ్రామాలను సందర్శించింది. గుంటూరు, సత్తెనపల్లి, ఒంగోలు, కనిగిరి, మార్కాపురం, చీరాల డివిజన్లలో ఉన్న ఈ గ్రామాలలో 22 మంది రైతు కుటుంబాలను, గ్రామస్తులను కలిసింది. ఆత్మహత్యకు గల కారణాలు, ప్రభుత్వ స్పందన గురించి విషయ సేకరణ జరిపింది.
ఈ నాలుగు జిల్లాల్లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రత్యేక ప్యాకేజీతో కూడిన ఆర్థిక సహాయం (రూ.7 లక్షలు), పునరావాస ఏర్పాటు కొరకు వున్న జీఓ 43 అమలు చాలా అసంతృప్తికరంగా వుంది. చనిపోయిన వారిలో దాదాపుగా అందరూ కౌలు రైతులే. ఎక్కువ మంది పత్తి, మిర్చి పంటలు సాగు చేస్తున్న వారే. ఎవరికీ కూడా కౌలు రైతు గుర్తింపు కార్డులు (CCRC) లేవు. ప్రభుత్వ సంస్థల నుండి వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడి రుణాలు వీరెవరికీ దక్కలేదు. ఫలితంగా ప్రైవేటు రుణమే వీరికి దిక్కయింది. చేసిన అప్పులు తీర్చలేక, కొత్త అప్పులు పుట్టక, పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్య చేసుకున్నారు.
విషాదం ఏమిటంటే ఎవరికీ కూడా జీఓ 43 ప్రకారం వారి కుటుంబాలకు అందాల్సిన ఆర్థిక సహాయం, పునరావాస ప్యాకేజీ అందలేదు. పెదఆరవీడు మండలం, బి. చెర్లోపల్లి గ్రామంలోనైతే రైతు భరోసా కేంద్రానికి ఆనుకున్న ఇంట్లోనే మాదిరెడ్డి వెంకటనారాయణ రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబానికీ ఇంతవరకు దిక్కు లేదు. రైతు ఆత్మహత్య సంఘటనలకు సంబంధించిన నిర్ధారణ ప్రక్రియను ప్రభుత్వ యంత్రాంగం గాలికి వదిలేసింది. మేము పరిశీలించిన సంఘటనలలో జీఓ 43 నిర్దేశించినట్లు డివిజనల్ స్థాయి త్రిసభ్య ధృవీకరణ కమిటీ (ఆర్టీవో, ఏడీఏ, డిఎస్పీ) గ్రామాన్ని సందర్శించలేదు. ఇది చాలా అన్యాయమైన పరిస్థితి. చాలా కేసులలో ప్రాథమిక విచారణ కొరకు మండల స్థాయి అధికారులు (తాసిల్దార్, ఎఒ, ఎస్సై) కూడా గ్రామాలను సందర్శించి వివరాలను సేకరించలేదు. సంక్షోభంలో వున్న కుటుంబ సభ్యులు సహాయం కొరకు యేళ్ళ తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నా స్పందన శూన్యం. ఇది క్షమించరాని నిర్లక్ష్యం.
వాస్తవానికి రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి వున్నట్లు కనబడుతుంది. జూన్ 2019 నుండి 2021 చివరి వరకు ఆంధ్రప్రదేశ్ లో 2112 మంది రైతులు (అత్యధికులు కౌలు రైతులే) ఆత్మహత్య చేసుకోగా 718 కుటుంబాలకు మాత్రమే జీఓ 43 కింద ఆర్థిక సహాయం అందింది.
ప్రభుత్వం ఇప్పటికైనా నిద్రలేచి చితికిపోయిన రైతు కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. బాధిత కుటుంబాలను డివిజనల్ స్థాయి త్రిసభ్య ధృవీకరణ కమిటీ ఆలస్యం చేయకుండా సందర్శించి, విచారణ పూర్తి చేసి సత్వరమే పూర్తి స్థాయిలో ఆర్థిక సహాయం, పునరావాసం కల్పించాలి.
ప్రతి కౌలు రైతుకు గుర్తింపు కార్డు అందజేసి బ్యాంకు రుణాలు ఇవ్వాలి. జీఓ 43కి సవరణ చేసి బాధిత కుటుంబాల అప్పుల వన్ టైం సెటిల్మెంట్ కోసం కొంత సొమ్మును కేటాయించాలి.
మానవహక్కుల వేదిక, ఆంధ్రప్రదేశ్
రైతు స్వరాజ్య వేదిక
16 మే 2022