ఒరిస్సాలోని కోరాపుట్ జిల్లాలోని బడేల్ పంచాయతీకి చెందిన కిటుబా గ్రామంలో ఐదుగురు మావోయిస్టులను ఈ ఏడాది మే 8న స్పెషల్ ఆపరేషన్స్ గ్రూపు (SOG), జిల్లా వాలంటరీ ఫోర్సు (డి.వి.ఎఫ్) సిబ్బంది కాల్పులు జరిపి చంపేశారు. వారిపై ఐ.పి.సి సెక్షన్ 302, ఇతర సంబంధిత సెక్షన్ల కింద హత్యానేరం నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయాలని మానవహక్కుల వేదిక (హెచ్. ఆర్. ఎఫ్) డిమాండ్ చేస్తోంది.
ముగ్గురు సభ్యులతో కూడిన హెచ్.ఆర్.ఎఫ్ నిజ నిర్ధారణ బృందం జూన్ 6వ తేదిన కిటుబా గ్రామానికి వెళ్లి స్థానికులతో మాట్లాడి వాస్తవాలు సేకరించింది. బడేల్ అడవులలో ఎస్.ఓ.జి, డి.వి.ఎఫ్ల సంయుక్త బృందానికి మావోయిస్టులు ఎదురుపడి వారిపై కాల్పులు జరిపారనీ, బదులుగా భద్రతా దళాలు ఆత్మరక్షణార్థం జరిపిన కాల్పులలో ఆ ఐదుగురు మావోయిస్టులు మరణించారనీ అధికార్లు చెబుతున్నారు. ఇది ఒట్టి కట్టుకథని మాకు అర్థమైంది.
నిజానికి మే 8న జరిగింది ఇదీ. మావోయిస్టు దళం కిటుబా గ్రామాన్ని ఆనుకుని ఉన్న అడవిలో ఉండి స్థానికులను భోజనం ఏర్పాటు చేయమని కోరింది. మావోయిస్టులు కిటుబా గ్రామస్తులు తయారు చేసిన భోజనం తినే లోపే, ఆ ప్రాంతంలో మోహరించి ఉన్న ఎస్.ఓ.జి, డి.వి.ఎఫ్ దళాలకు చెందిన 20 మంది భద్రతా సిబ్బంది ఆ ఐదుగురు మావోయిస్టులపై కాల్పులు జరిపి చంపేశారు. సుమారు మధ్యాహ్నం ఒంటిగంట వేళ ఇది జరిగింది. తమకూ, మావోయిస్టులకు మధ్య గంట సేపు కాల్పులు జరిగాయన్న పోలీసుల కథనం అవాస్తవం. మావోయిస్టులను లొంగిపొమ్మని పోలీసులు ఎటువంటి హెచ్చరిక చేయలేదు. చంపాలనే ఉద్దేశ్యంతోనే ఏకపక్షంగా కాల్పులు జరిపి వారిని హత్య చేసారు.
తమ సిబ్బంది ఆత్మరక్షణార్థం కాల్పులు జరిపారనీ, ఆ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మరణించారనీ పోలీసు ఉన్నతాధికార్లు సమర్థించి ఊరుకుంటే సరిపోదు. ఈ మరణాలకు గల కారణాలను న్యాయవ్యవస్థ దృష్టికి తీసుకుని పోవాలి. న్యాయవ్యవస్థ వాటిలోని వాస్తవాలను పరిశీలించేటట్లు చూడాలి. అలా చేయకుండా పోలీసులు కేసుని మూసివేసి కేసు క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేయడం అన్యాయం. ఎన్కౌంటర్లో ఆ ఐదుగురు మరణించారని అంటున్నారు కనుక అందులో పాల్గొన్న పోలీసు సిబ్బందిపై సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాలి. అది మాత్రమే చేస్తే సరిపోదు. కేసు దర్యాప్తు విషయంలో ఒరిస్సా పోలీసుల ప్రమేయం ఉండకూడదు. న్యాయం జరగాలంటే దర్యాప్తు సి.బి.ఐతో కానీ, రాష్ట్ర పోలీసుల ప్రమేయం లేని ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత కానీ జరిపించాలి.
భద్రతా దళాలు మావోయిస్టులను పట్టుకునే అవకాశాలు ఉన్నప్పటికీ వారిని వేటాడి కూర మృగాలను చంపినట్లు చంపుతున్నాయి. ఇదొక ఆనవాయితీ అయికూర్చుంది. హింస ద్వారా రాజ్యాధికారం సాధించాలని అనుకునే వారిని అణచివేయాలనే మిషతో రాజ్యం ఈ విధంగా మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడటం అన్యాయమని, అది క్షమించరానిదని హెచ్.ఆర్. ఎఫ్ భావిస్తోంది.
పోలీసు చర్యలకు వారిని జవాబుదారీ చేయాలనీ, ప్రజల హక్కులనూ, చట్టబద్ధ పాలననూ తమ పోలీసులు గౌరవించే విధంగా ఒరిస్సా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. మావోయిస్టు ఉద్యమాన్ని ఒక రాజకీయ ఉద్యమంగా పరిగణించి దానికి రాజకీయ పరిష్కారాలు వెతికే బదులు వారి సభ్యులను యథేచ్చగా హత్యలు చేయడానికి భద్రతా దళాలకు లైసెన్సులు ఇవ్వడాన్ని తప్పుపడుతున్నాం.
మానవహక్కుల వేదిక
ఆంధ్ర – తెలంగాణ రాష్ట్రాల సమన్వయ కమిటీ
7 జూన్ 2019