నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం కిష్టరాంపల్లి రిజర్వాయర్ నిర్వాసితులు తమకు అన్యాయం జరిగిందని ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మానవ హక్కుల వేదిక నిజనిర్ధారణ బృందం 15 నవంబరు 2021 న బాధితులను కలిసి వారి సమస్యలు తెలుసుకుంది.
పాలమూరు -డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నాంపల్లి మండలం లక్ష్మణాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న కిష్టరాంపల్లి రిజర్వాయర్ కోసం ప్రభుత్వం లక్ష్మణాపూర్ గ్రామం, లక్ష్మణాపూర్ తండా, ఈదులగండి, హైద్లాపూర్, తుంగపాటిగౌరారం గ్రామాల నుండి 2046 ఎకరాలను సేకరించింది. లక్ష్మణాపూర్ గ్రామం, లక్ష్మణాపూర్ తండాలో ప్రజలు తమ వ్యవసాయ భూములతో పాటు ఇళ్లను కూడా సాంతం కోల్పోతున్నారు. ఈదులగండి గ్రామంలో ప్రజలు ముప్పై ఇళ్లతో పాటు వ్యవసాయ భూములను కోల్పోతుండగా, మిగతా రెండు గ్రామాల్లోని ప్రజలు సాగు భూములను వదులుకోవాల్సి వస్తోంది.
ముఖ్యమంత్రి కె.సి.ఆర్ తాను నిర్మించదలచుకున్న ప్రాజెక్టులను ఆగమేఘాల మీద పూర్తి చేయటానికి ఎడాపెడా భూమిని సేకరించడమే తప్ప పారదర్శకతను పాటించడం లేదు. ఆయన ప్రభుత్వం 2018 భూసేకరణ చట్టం ప్రకారం భూమిని సేకరించకుండా నిబంధనల్ని తుంగలో తొక్కింది. ఒక భూఆక్రమణదారుడు బలహీనులైన రైతుల నుండి భూమిని కబ్జా చేసుకున్నట్టుగా ప్రభుత్వం బలవంతంగా సన్న చిన్న రైతుల భూములను కబ్జా చేస్తుంది. ఇక్కడ మెజారిటీ రైతులు లంబాడాలే. వారు స్వయంగా భూములను అమ్ముకుంటున్నట్టుగా ప్రభుత్వం చిత్రీకరించింది. అందుకోసం జి.ఓ నంబర్ 123ని ఉపయోగించి భూముల్ని సేకరించింది.
అలా నాలుగేళ్ల క్రితం భూమిని కోల్పోయిన రైతులు తాము ప్రభుత్వం నుంచి పొందిన డబ్బుతో తిరిగి కొత్తగా భూములు కొనుక్కోలేక రోడ్డున పడ్డారు. కోల్పోయిన భూములలో కనీసం పదోవంతు కూడా కొనుక్కోలేకపోయారంటే అతిశయోక్తి కాదు. నిన్నటిదాకా వ్యవసాయదారులయిన వారు ఈ రోజు చేతిలో భూమి లేక, స్థానికంగా పని కూడా లభించక పట్టణాల్లో శ్రామికులుగా మారుతున్నారు.
ఇళ్లను కోల్పోయే 200కు పైగా కుటుంబాలకు ఎక్కడ పునరావాసం దొరుకుతుందో ఇంకా తెలియదు. తమకు పరిచయం లేని ప్రాంతంలో ప్రభుత్వం ఇళ్ళు చూపించినా అక్కడ తమ చేతుల్లో భూమి లేకపోవడంతో దూర ప్రాంతాల్లో కూలిపనికి పోవాల్సిన దుస్థితి దాపురించింది. ఈ నేపథ్యంలో రిజర్వాయర్ స్థలంలోనే గత ఇరవై రోజులుగా వారు నిరసన దీక్ష శిబిరం ఏర్పాటు చేసుకుని తమ గోడును ప్రభుత్వానికి వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. వారి డిమాండ్లు:
- ప్రభుత్వం తమకు ఇచ్చిన నష్టపరిహారాన్ని పునఃసమీక్షించాలి. ప్రాజెక్టు ఆయకట్టులో వ్యవసాయం చేసుకోవటానికి కుటుంబానికి కనీసం మూడు ఎకరాల చొప్పున భూమిని చూపించాలి.
- నిర్వాసితులైన వారికి పునరావాస పథకం వారికి జీవనాధారం ఉన్నచోటనే చూపించాలి.
- నిర్వాసితులకు కూడా దళిత బంధు లాంటి పథకం రూపొందించి అమలు చేయాలి.
- అయిదేళ్ల క్రితం చేసిన సర్వే ఆధారంగా కాక పరిహారం ఇచ్చేనాటికి పద్దెనిమిదేండ్లు దాటిన వారికి కూడా పునరావాస సహాయం వర్తించాలి.
ప్రభుత్వం నిర్వాసితులతో వెంటనే చర్చించి వారి న్యాయమైన కోర్కెలను నెరవేర్చాలని మానవ హక్కుల వేదిక డిమాండు చేస్తున్నది.
మానవ హక్కుల వేదిక
తెలంగాణ
15 నవంబర్ 2021