కొత్తవీధి, గుంటి ఆదివాసులకు సాగు హక్కు కల్పించాలి

అనకాపల్లి జిల్లా కొనాం పంచాయతీలో కొత్తవీధి గ్రామంలో ఆదివాసుల సాగులో వున్న భూములపై జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సమగ్రమైన విచారణ జరిపి, తక్షణం న్యాయం చేయాలని మానవ హక్కుల వేదిక (HRF) కోరుతుంది. భూమి రికార్డులను తారుమారు చేసి, వెబ్‌ లాండ్‌ పోర్టల్‌ లో తప్పుడు మ్యుటేషన్లకు పాల్పడుతున్న రెవెన్యూ అధికార్లపై చర్యలు తీసుకోవాలి.

మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా మానవ హక్కుల వేదిక బృందం మంగళవారం (30.08.2022) కొత్తవీధి గ్రామాన్ని సందర్శించింది. అక్కడ అదివాసులతో మాట్లాడి, వారు ఎన్నాళ్లుగానో చేస్తున్న వ్యవసాయాన్ని పరిశీలించాము. కొత్తవీధిలో 13 కొందు (PVTGలుగా వర్గీకరించబడిన అత్యంత దుర్బలమైన ఆదివాసి తెగ వారు) కుటుంబాల వారు, గుంటికి చెందిన 5 కొండదొర కుటుంబాల వారు కోనాం రెవెన్యూ సర్వే నెంబర్‌ 289-1A గత 25 సంవత్సరాలుగా సుమారు 40 ఎకరాల భూమిని సాగు చేస్తున్నారు. ప్రధానంగా జీడిమామిడి, మామిడితో పాటు ఆరుతడి పంటలు పండించుకుంటున్నారు.

ఆ గ్రామాల ఆదివాసులు వారి అనుభవంలో వున్న భూమికి సాగు హక్కు కల్పించి రెవెన్యూ రికార్డుల్లో నమోదు చెయ్యమని చాలా సంవత్సరాలుగా మండల స్థాయి నుండి డివిజనల్‌ స్థాయి వరకు వున్న రెవెన్యూ అధికార్లు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయినా వారి విజ్ఞప్తులను అధికార్లు పట్టించుకోలేదు. కొన్ని తరాలుగా వారు ఆ భూమిలో సాగు చేసుకుంటూ జీవనాధారం సాగిస్తున్న విషయం అధికార్లకు స్పష్టంగా తెలిసినా పూర్తి నిర్లక్ష్యం వహించారు.

చీడికాడ డిప్యూటీ తాసిల్డార్‌ డిసెంబర్‌ 12, 2021 నాడు స్థానిక ఆదివాసులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కొత్తవీధి వెళ్లారు. దానికంటే ముందు సర్వే సిబ్బంది వచ్చి సాగులో వున్న ఆదివాసీలకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా రాళ్ళు పాతారు. ఇది పూర్తి చట్ట వ్యతిరేకమైన చర్య. ఆంధ్రప్రదేశ్‌ భూమి హక్కు మరియు పట్టాదారు పాసు పుస్తకం చట్టన్ని ఉల్లంఘించడం. అంతే కాక సర్వే నెంబర్‌ 289-1Aను ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్న కొందరు గిరిజనేతరులను వెంటబెట్టుకుని మరీ డిప్యూటీ తాసిల్దార్‌ వెళ్లారు.

డిప్యూటీ తాసిల్దారు  ఆదివాసులు ఇచ్చిన వినతిపత్రంపై విచారణ చేయడానికి రాలేదని గ్రామస్తులకు అర్థం అయ్యింది. గిరిజనేతర భూవ్యాపారులకు తోడ్పడడానికే అతను వచ్చాడని తెలిసి ఆదివాసులు ఆందోళన చెంది అప్పటి విశాఖ జిల్లా కలెక్టర్‌ గారికి ఫిర్యాదు చేశారు. కమిషనర్‌, సర్వే&భూమి రికార్డుల వారికి కూడా మండల సర్వేయర్‌ తప్పుడు వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత సర్వే విభాగానికి చెందిన డిప్యూటీ ఇన్స్సెక్టర్‌ ఆఫ్‌ సర్వే, 31-5-2022న కొత్తవీధి గ్రామానికి వచ్చి వ్యవసాయ భూముల్ని తనిఖీ చేసి వెళ్లారు.

ఆ వెంటనే గిరిజనేతర భూవ్యాపారులు ఆదివాసులను అక్కడ నుండి వెళ్లిపోమని బెదిరించడం మొదలుబెట్టారు. ఆదివాసులు ఈ విషయాన్ని అనకాపల్లి ఎస్పీ దృష్టికి తీసుకెళ్తే ఆయన డిఎస్పిని గ్రామానికి పంపారు. డిఎస్పి కొత్తవీధికి వెళ్లి ఆదివాసీ సాగుదారులను బెదిరించవద్దని, అలా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అంతలోనే ఇంకొక విస్మయకరమైన సంఘటన బయటపడింది. గుంటి, కొత్తవీధి ఆదివాసులు 13-6-22 నాడు అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ కు ఫిర్యాదు చేస్తున్న సమయంలోనే, అదే రోజు చీడికాడ తాసిల్దార్‌ సర్వే నెంబర్‌ 289-1A లో కొందరు గిరిజనేతరుల పేరు మీదకి ఆన్‌ లైన్‌ 1B మార్పులు చేసేశారు. ఈ ప్రాంతం మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం లోకి వస్తుంది గనక స్థానిక ఎమ్‌ఎల్‌ఏ మరియు ఉప ముఖ్యమంత్రి అయిన బూడి ముత్యాల నాయుడు గారి పై ఆదివాసుల హక్కులను కాపాడే బాధ్యత ప్రత్యేకంగా వుంది.

అనకాపల్లి జాయింట్‌ కలెక్టర్‌ వీలైనంత త్వరగా కొత్తవీధి భూములను పరిశిలించి నిష్పాక్షికంగా విచారణ జరిపితే ఎప్పటినుండో సాగులో వున్న ఆదివాసుల న్యాయమైన హక్కు నిలబడుతుంది. ఆ విచారణ జరిగేంతవరకు సర్వే నెంబర్‌ 289-1A ను వివాదాస్పద రిజిష్టర్లోకి మార్చి, ఆదివాసుల సాగు హక్కుకు భంగం కలగకుండా చర్యలు చేపట్టాలని మానవ హక్కుల వేదిక డిమాండ్‌ చేస్తుంది.

మానవ హక్కుల వేదిక
ఆంధ్రప్రదేశ్
1 సెప్టెంబర్ 2022

Related Posts

Scroll to Top