నెల్లిమర్ల లాకప్‌ మరణం మీద జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్ తో విచారణ జరిపించాలి

విజయనగరం జిల్లా నెల్లిమర్ల పోలీస్‌ స్టేషన్లో ఫిబ్రవరి 11న బేతా రాంబాబు (42) మృతి చెందాడు. పద్మశాలీ కులానికి చెందిన రాంబాబు ఎలక్ట్రీషియన్‌గా పని చేసేవాడు. అతడి మరణం విషయంలో ఒక స్వతంత్ర సంస్థతో నిష్పాక్షిక విచారణ జరిపించాలని మానవహక్కుల వేదిక (హెచ్‌.ఆర్‌.ఎఫ్‌) డిమాండ్‌ చేస్తోంది.

ముగ్గురు సభ్యుల హెచ్‌.ఆర్‌.ఎఫ్‌ బృందం 13 ఫిబ్రవరి 2022న విజయనగరం, నెల్లిమర్లలో పర్యటించి రాంబాబు మృతికి సంబంధించి వాస్తవాల సేకరణ జరిపింది. అతడి కుటుంబ సభ్యులతోనూ, పోలీసులతోనూ మాట్లాడింది. పోలీసు స్టేషన్‌ ని సందర్శించింది.

పోలీసుల కథనం ప్రకారం, నేరాలు చేసే అలవాటు వున్న రాంబాబును నెల్లిమర్ల ఉపాధి హామీ పథకం కార్యాలయంలో జరిగిన బ్యాటరీ ఇన్వర్టర్ల దొంగతనం కేసులో ఫిబ్రవరి10న పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అతడిని నెల్లిమర్ల పోలీస్‌ స్టేషన్‌ రికార్డ్‌ రూములో ఉంచారు. మర్నాడు తెల్లవారుజామున అతను గది లోపల గడియ పెట్టేసుకున్నాడు. ఉదయం 9 గంటలకు తలుపు పగులగొట్టి చూడగా రాంబాబు ఉరి పోసుకొని ఉన్నాడు. స్టేషన్లో దొరికిన తాడుతోనే అతను ఉరిపోసుకున్నాడు. పోలీసులు అతడిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు.

విషయ సేకరణ క్రమంలో మాకు అర్థమైన విషయం ఏమిటంటే పోలీసుల కథనం నమ్మశక్యంగా లేదు. వారి కథనంలో ఎన్నో పొంతన లేని విషయాలు మా అనుమానాన్ని బలపరిచాయి. ఈ కేసు విషయంలో తలెత్తుతున్న అనేక అనుమానాలు నివృత్తి కావాలన్నా వాస్తవం బయటికి రావాలన్నా పోలీసు శాఖతో, మరీ ముఖ్యంగా స్థానిక పోలీసులతో సంబంధం లేని ఒక స్వతంత్ర సంస్థచే దర్యాప్తు జరిపించాలి. ఆ దర్యాప్తులో పోలీసు సిబ్బంది ఎవరైనా నేరానికి పాల్పడినట్లు నిర్ధారణ అయితే వారిని ముద్దాయిలుగా గుర్తించి వారిపై కేసు నమోదు చేసి ప్రాసిక్యూట్‌ చేయాలి. అంతేగానీ తూతూ మంత్రంగా విచారణ జరిపించి, ఒకరిద్దరిని సస్పెండ్‌ చేసి కేసును మూసేయడం సబబు కాదు.

రాంబాబు కుటుంబానికి సరైన నష్టపరిహారం అందించాలి. కస్టడీ మరణాలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఈ పరిహారం చెల్లించాలి.

రాంబాబు మృతి విషయంలో మెజిస్టీరియల్‌ విచారణ జరపాలని ఆర్డివోకు విజయనగరం జిల్లా కలెక్టరు ఆదేశాలిచ్చారు. ఇది న్యాయ సూత్రాలకు విరుద్ధం అని హెచ్‌. ఆర్‌. ఎఫ్‌ భావిస్తోంది. పార్లమెంట్‌ 2005లో కస్టడీ మరణాలకు సంబంధించి సిఆర్‌పిసి చట్టాన్ని సవరించి సెక్షన్‌ 176 (1A) ను చేర్చింది. ఇది 23 జూన్‌ 2006 నుంచి అమలులోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం కస్టడీ మరణాలపై విచారణ చేపట్టే అధికారం ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్ కి వుండదు, కేవలం జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్ లేదా మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌కే వుంటుంది. సంస్థాగత పక్షపాతానికి తావు ఇవ్వకుండా ఉండటం కోసం ఈ సవరణ ప్రవేశపెట్టారు. న్యాయం జరగడమే కాదు, జరిగినట్లు కూడా కనబడాలనే ఉద్దేశ్యం దీని వెనక ఉన్న న్యాయ సూత్రం. న్యాయశాఖ అధికారుల కనుసన్నల్లో విచారణ జరిగితే సంస్థాగత పక్షపాతాన్ని అధికార దుర్వినియోగాన్ని నివారించవచ్చు.

కాబట్టి, నెల్లిమర్ల కస్టడీ మరణంపై విచారణ చేపట్టే అధికారం చట్ట ప్రకారం విజయనగరం ఆర్టీవోకి లేదు. అలా చేస్తే అది చట్టం నిర్దేశించిన విధానాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది. నెల్లిమర్ల కస్టడీ మరణంపై సెక్షన్‌ 176 (1A) అనుసరించి జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌తో విచారణ జరిపించాలని హెచ్‌.ఆర్‌.ఎఫ్‌ విజయనగరం కలెక్టర్‌కు విజ్ఞప్తి చేసింది.

నెల్లిమర్ల పోలీస్‌ స్టేషన్‌లో ఎక్కడా సిసిటివి కెమెరాలు లేవన్నది మేము గమనించాము. అసలు జిల్లాలోని ఏ పోలీస్‌ స్టేషన్లోనూ లేవని తెలిసి మేము ఆశ్చర్యపోయాము. రాష్ట్రమంతటా ఇదే స్థితి వున్నట్లు కనబడుతోంది. రాష్ట్రాల్లోనూ, అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ప్రతి పోలీస్‌ స్టేషన్లోనూ నైట్‌ విజన్‌ కెమెరాలు, ఆడియో రికార్డింగ్‌ సౌలభ్యం వున్న సిసిటివి కెమెరాలు అమర్చాలని సుప్రీంకోర్టు 2 డిసెంబర్‌ 2020 న ఒక మంచి తీర్పునిచ్చింది. ఈ కెమెరాలను ఎక్కడెక్కడ అమర్చాలో కూడా చాలా స్పష్టంగా పేర్కొంది. ఇంటరాగేషన్‌ గదిలో, లోపలికి బయటికి వెళ్ళే దారిలో, లాకప్‌, కారిడార్లు, రిసెప్షన్‌, ఇన్‌స్పెక్టర్‌, సబ్‌ఇన్‌స్పెక్టర్‌ గదులలో, పోలీస్‌ స్టేషన్‌ ముందు భాగం, వెనక భాగంతో పాటు వాష్‌ రూమ్‌ల బైట కూడా కెమెరాలు అమర్చాలని స్పష్టం చేసింది.

ఎంతో విలువైన ఈ తీర్పుని సక్రమంగా అమలుపరిస్తే కస్టడీలో హింస, కస్టడీ మరణాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు తగ్గుముఖం పట్టి పోలీసుల జవాబుదారీతనం పెరిగే అవకాశముంటుంది. కానీ మన రాష్ట్రంలో ఇప్పటివరకు సుప్రీంకోర్టు ఆదేశం అమలులోకి రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం త్వరగా ఆ ఆదేశాన్ని అమలు చేయాలని హెచ్‌.ఆర్‌.ఎఫ్‌ కోరుతోంది.

మానవహక్కుల వేదిక
ఆంధ్రప్రదేశ్‌
14 ఫిబ్రవరి 2022

Related Posts

Scroll to Top