పులుల మరణానికి బాధ్యులను చేస్తూ ఆదివాసీ యువకులపై కేసులు మోపటం అన్యాయం

ఈ జనవరి 6 మరియు 8వ తేదీల్లో మరణించిన రెండు పెద్ద పులుల విషయంలో వాంకిడి మండలం రింగారెట్ గ్రామానికి చెందిన ఇద్దరు ఆదివాసీ యువకులు ఉద్దేశపూర్వకంగా పులులను చంపినట్టు నేరం మోపి వారిని రిమాండ్ కు పంపిన కేసులో ఈ రోజు మానవ హక్కుల వేదిక రాష్ట్ర కమిటీ నిజనిర్ధారణ జరిపింది.

వాంకిడి మండలం రింగారెట్, చెరుకుపల్లి, దరిగాం గ్రామాల నుండి ఆదివాసీ ప్రజల పశు సంపద ఆహారం కోసం దరిగాం అడవికి వెళ్తాయి. ఈ నేపథ్యంలో రింగారెట్ గ్రామానికి చెందిన కోవా గంగుకి చెందిన ఆవు నెల రోజుల క్రితం దరిగాం అడవిలో తప్పిపోయింది. ఆవు తిరిగి వస్తుందేమోనన్న ఆశతో, దాని యజమాని అటవీ అధికారులకు తెలియజేయలేదు. కాగజ్నగర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ పరిధిలోకి వచ్చే దరిగాం అడవిలో పులి చనిపోయి ఉంది అనే సమాచారం గ్రామస్తులు ఇస్తే తప్ప అటవీ అధికారులకు తెలియలేదు. తదనంతరం వారు పులులు చనిపోవటానికి పరిసర ప్రాంతాల రైతులు లేదా పశువుల కాపరులే కారణమై ఉంటారని అనుమానంతో సిడాం రాము అనే ఒక 12 సంవత్సరాల బాలున్ని అదుపులోకి తీసుకొని, అతని చేత కోవగంగు, ఆత్రం జలపతులే పులుల మరణానికి కారణమని చెప్పించారు. కోవగంగును, ఆత్రం జలపతిని మరి కొంతమందిని అదుపులోకి తీసుకొని బాగా దెబ్బలు కొట్టినట్టు వారి బంధువులు తెలియజేస్తున్నారు. కేవలం దెబ్బలకు తట్టుకోలేక మాత్రమే తాము చేయని నేరాన్ని ఒప్పుకుంటున్నామని గంగు, జలపతులు చెప్పారని వారి  బంధువులు మాకు తెలియజేశారు.

కోర్టులో రేపు ఈ నేరం రుజువైనా, కాకపోయినా పులుల మరణాలకు గల కారణాలనూ, అడవులో ఆదివాసుల పరిస్థితినీ మానవీయ కోణంతో పరిశీలిస్తేనే అర్థం అవుతాయి. 

అడవులు పులులకే కాదు ఆదివాసులకు కూడా మాతృ స్థలాలు.  అడవుల్లో ఈ రోజు పులులకే కాదు ఆదివాసులకు, వారి పశుసంపదకు కూడా రక్షణ లేదు. గత సంవత్సరం సిడాం భీము అనే పత్తి రైతుపై పులి దాడి చేసి చంపేసింది. కనీసం నెల రెండు నెలలకు ఒక ఆవు లేదా ఎద్దు, ఇంకా అనేక గొర్రెలు, మేకలు పులుల బారినపడి చనిపోతున్నాయి. పులుల బారిన పడి చనిపోయే గొర్రెలకు, మేకలకు పరిహారం ఇచ్చే వెసులుబాటు చట్టంలో లేదట. మనుషులకు, ఎద్దులకు మాత్రం ప్రభుత్వం, అటవీ అధికారులు నామమాత్రపు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. కానీ పులులు చనిపోతే మాత్రం ఆదివాసీ ప్రజలను జైళ్లకు పంపుతున్నారు. పాలకులూ, సమాజం పులులకు ఇచ్చే విలువను మనుషులకు ఇవ్వకపోవడం మాని, మానవీయ దృక్పథంతో ఈ విషయాన్ని చూడాలి. 

  మా డిమాండ్లు.

1. ఆదివాసి యువకులైన కోవగంగు మరియు ఆత్రం జలపతులను వెంటనే విడుదల చేయాలి.

2. వారు ఏమైనా నేరం చేసి ఉంటే మానవతా దృక్పథంతో వ్యవహరించి వదిలివేయాలి.

3. పులుల బారిన మనుషులూ, పశువులూ పడి చనిపోకుండా ఏం రక్షణ చర్యలు తీసుకుంటుందో ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి.

4. పులులను మానవ సంచారం లేని పరిమిత, నిర్దిష్ట అటవీ ప్రాంతానికి మాత్రమే పరిమితం చేసి వాటిని సంరక్షించాలనీ, పులుల సంరక్షణ మానవాళికి శిక్షగా మారకూడదని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తున్నది.

మానవ హక్కుల వేదిక
తెలంగాణ
14 జనవరి 2024

Related Posts

Scroll to Top