మల్లమరి మల్లికార్జున్ నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు బోధించే ఉపాధ్యాయుడు. 2018 జూలై 8వ తేదీన కోటగిరి పాఠశాలలో చేరాడు. 2022 సెప్టెంబర్ లో కొంతమంది కోటగిరి గ్రామస్తులు వినాయక చవితి సందర్భంగా చందా కోసం హైస్కూల్ కు వచ్చారు. కొందరు ఉపాధ్యాయుల వద్ద చందాలు వసూలు చేసుకున్నారు. మల్లికార్జున్ ని కూడా చందా ఇమ్మని అడిగారు. తాను ఇవ్వను అన్నాడు. ఎందుకు ఇవ్వవు అన్నారు. తనకు దేవుళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి ఇవ్వను అన్నాడు. దేవతల మీద నమ్మకం లేకపోతే నీకు చదువు ఎలా వచ్చింది అన్నారు. సరస్వతి మాత కటాక్షం వల్లనే చదువు వచ్చిందనీ, ఉద్యోగమూ వచ్చిందని వారు అన్నారు. కష్టపడి చదివితే ఎవరికైనా చదువు వస్తుందనీ అమెరికాలో, ఇంగ్లాండ్లో సరస్వతీ మాత లేకపోయినా వారు సరస్వతీ మాతను పూజించకున్నా వారికి చదువులు వస్తున్నాయని జవాబు చెప్పాడు. నాస్తికుడిగా ఉండి హిందూ దేవుళ్ళ ఉనికిని ప్రశ్నిస్తున్నావు అని వారు అన్నారు. ముస్లిం దేవుళ్ళు లేరని క్రిస్టియన్ దేవుళ్ళు లేరని చెప్పగలవా అని ప్రశ్నించారు. పాఠాల్లో ఎలా ఉంటే అలా చెబుతానన్నాడు. దేవుడు లేడని చెబుతున్నావు అన్నారు. నేను అలా చెప్పడం లేదనీ, సైన్సుని నమ్మండి అనీ చెబుతాను అన్నాడు. రామాయణ, భాగవతాలు పనిలేక రాశారా అని అడిగారు. వాళ్లకు దేవుళ్లపై నమ్మకం ఉంది కాబట్టి రాశారు అని మల్లికార్జున్ సమాధానం. దేవుడు ఉన్నాడు అనే నమ్మకం వల్ల పుస్తకాలు రాయలేదనీ దేవుళ్ళు ఉన్నారు కనుకనే ఆ పుస్తకాల రాశారు అని ఆ గుంపు వాదన. సరే పాఠంలో ఆ విషయం వచ్చినప్పుడు చూద్దాంలే అని అనవసరపు సంభాషణను ముగిద్దామనుకున్నాడు మల్లికార్జున్.
మూఢనమ్మకాల గురించి పాఠం ఉంది ఆ విషయం చెప్పాలి కదా అన్నాడు. వివేకము, జ్ఞానము లేని లేనివాడిని మూఢుడు అంటారనీ కారణం లేకుండా ఒక విషయాన్ని గుడ్డిగా నమ్మితే దాన్ని మూఢనమ్మకం అంటారు అని వివరించాడు పైగా ‘భాగ్యోదయం’ శీర్షికతో ఒక పాఠం ఉందని అది మూఢనమ్మకాలపై భాగ్యరెడ్డివర్మ చేసిన పోరాటాల గురించిన పాఠమని దాన్ని చెప్పాల్సి వస్తుందని చాలా ఓపిగ్గా వివరించాడు మల్లికార్జున్. పాఠాన్ని దాటవేయటం కుదరదని చెప్పాడు. మొదటి పాఠం ‘దానశీలం’ బలి చక్రవర్తి దాన గుణాన్ని గురించిన పాఠాన్ని చెప్పాననీ, ఆ పాఠంలో శ్రీమహావిష్ణువు గురించి కూడా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఆ విషయమూ చెప్పాను అని అన్నాడు. ఏది ఏమైనా గానీ మూఢనమ్మకాల గురించి ఉన్న పాఠాన్ని చెప్పొద్దు అని ఆ గుంపు మల్లికార్జున్ ని ఆదేశించినంత పని చేసింది. ఆ పాఠం చెప్పొద్దు అనే అధికారం మీకు లేదని, ఆ మాట విద్యాశాఖ అధికారులైనా చెప్పాలి లేదా పాఠాన్ని అయినా బుక్ నుంచి తొలగించాలి అని మల్లికార్జున్ వారి ఆదేశాన్ని ప్రతిఘటించాడు. ఆ పాఠం చెప్ప వద్దనీ, నీ మంచికే చెబుతున్నాం అని హెచ్చరించి వెళ్లిపోయారు.
కాలం ప్రశాంతంగానే నడుస్తోంది అనిపించింది మల్లికార్జున్ కి. పాత సంవత్సరం వెళ్ళిపోయి కొత్త సంవత్సరం రావడంతోటే ఉన్మాదులకి కావరం పెరిగింది. 2023 జనవరి రెండున మల్లికార్జున్ క్లాస్ లో పాఠం చెబుతుండగా హెడ్మాస్టర్ నుంచి పిలుపు వచ్చింది. ఏమిటో అని క్లాస్ నుంచి హెడ్ మాస్టర్ రూమ్ కి వెళ్ళాడు మల్లికార్జున్. అక్కడ ఒక గుంపు ఉంది. హిందూ దేవి దేవతలను కించపరుస్తూ మల్లికార్జున్ విద్యార్థులకి పాఠాలు చెబుతున్నాడని వారు ఆరోపించారు. అలాంటి పాఠాన్ని చెప్పడం ఎప్పుడు జరిగిందో , ఏ క్లాసులో జరిగిందో రుజువు చేయమని మల్లికార్జున్ సవాలు చేశాడు. తాను టెక్స్ట్ బుక్ లో ఉన్న పాఠాలే చెబుతున్నానని, పుస్తకాన్ని దాటిపోవలేదని మల్లికార్జున్ స్పష్టం చేశాడు. మల్లికార్జున్ క్షమాపణ చెప్పాలని గుంపు పట్టు పట్టింది. తాను క్షమాపణ చెప్పను అని అన్నాడు. స్కూలు గేటు ముందు ధర్నాకు కూర్చుంది ఆ గుంపు. మల్లికార్జున్ కి వ్యతిరేకంగా నినాదాలు వస్తున్నాయి ఆ గుంపులో నుంచి. మల్లికార్జున్ దళితుడు. అతని కులం పేరుతో పిలుస్తూ ………..లుచ్చా అని స్లోగన్లు. హిందూ దేవతలను అవమానించిన మల్లికార్జున్ని ఉద్యోగం నుంచి తొలగించాలి అని గుంపు అరుస్తోంది. హెడ్మాస్టరు మల్లికార్జున్ ని పిలిచాడు. విషయాన్ని అనవసరంగా పెద్దది చేయటం ఎందుకు వాళ్లకు ఒకసారి సారి చెప్తే సరిపోతుందిగా అని సలహా ఇచ్చాడు. హెడ్మాస్టర్ ఇచ్చిన సలహాని మల్లికార్జున్ పాటించి గేటు వద్ద ఉన్న గుంపు వద్దకు వెళ్లి సారి చెప్పాడు.
ఇప్పుడు ఇక గుంపు ఆలోచన మారిపోయింది. అప్పటివరకు తమ వద్దకు వచ్చి సారీ చెప్పమని చేసిన ఒత్తిడి మారిపోయింది గుడిలోకి వచ్చి దేవతలను క్షమాపణ కోరాలని అరవటం మొదలుపెట్టారు. తాను గుడిలోకి రానని అది తన అభిమతానికి వ్యతిరేకమని, తాను నమ్మని దేవతలకు తాను చెప్పే క్షమాపణకు విలువే ఉండదని మల్లికార్జున్ చెప్పాడు అయినా సరే మల్లికార్జున్ ని తోచుకుంటూ రోడ్డు మీదకు తీసుకువచ్చారు జై శ్రీరామ్ నినాదాలతో మల్లికార్జున్ ని ముందుకు నెట్టుకుంటూ రోడ్డు మీద పెరేడ్ చేయించారు. గుడిలోకి వచ్చి క్షమాపణ చెప్పకపోతే మల్లికార్జున్ ఊరిలోకి రాడని, ఊరు నుంచి బయటకు పోలేడని బెదిరించారు.అంటే దాని అర్థం అక్కడే చంపేస్తాము అని.
హెడ్మాస్టర్ గాని మరి ఏ ఇతర టీచరు గాని మల్లికార్జున్ కి రక్షణగా రాలేదు. పోలీసులు హిందూ మతోన్మాద గుంపుతో చెట్టపట్టాలు వేసుకొని నవ్వుతూ తుళ్లుతూ పరాచకాలాడుతున్నారు కానీ తమ ముందు మల్లికార్జున్ ని కులం పేరుతో బూతులు తిట్టి అవమానిస్తుంటే చూస్తూ ఊరుకున్నారు కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మల్లికార్జున్ తాను దేవుని నమ్మను అని చెబుతున్నా బలవంతంగా గుడిలోకి తీసుకుపోయారు. భజన చేయించారు. నుదుటిన బొట్టు పెట్టారు. దేవతలకు క్షమాపణ చెప్పించారు. అతని మానసిక స్థైర్యం పై దెబ్బ కొట్టారు. అతని తాత్విక ఆలోచనపై దెబ్బ కొట్టారు. కులం పేరుతో బహిరంగంగా బూతులు తిట్టారు. అతని విధులకు ఆటంకం కలిగించారు.
దాడి చేసిన వ్యక్తులు విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్, బిజెపి లకు చెందినవారు. అందరూ కోటగిరి వారు కాదు. పొరుగు ఉన్న రుద్రూరు, పోతాంగల్ గ్రామాలకు చెందిన వారు కూడా ఉన్నారు. వినాయక చవితి చందా కోసం వచ్చి మల్లికార్జున్ తో వాదనకు దిగిన వారి పిల్లలు ఎవరూ కూడా మల్లికార్జున్ కి విద్యార్థులు కాదు! 2023 జనవరి 2వ తారీఖున మల్లికార్జున్ పై దాడి చేసిన వారిలో ఎవరి పిల్లలూ మల్లికార్జున్ కి విద్యార్థులు కారు!! మరి దాడి చేసిన వారికి మల్లికార్జున్ హిందూ దేవతలకు వ్యతిరేకంగా పాఠాలు బోధిస్తున్నాడు అని ఎవరు చెప్పారు? ఈ విషయంలో దాడి చేసిన వారు అలాంటి పాఠాలు విన్న ఒక్క విద్యార్థి పేరు కూడా చెప్పలేకపోయారు!!! దాడి చేసిన వాళ్లలో బ్రాహ్మణులు గాని, క్షత్రియలు గాని, వైశ్యులు గాని ఎవరూ లేరు. ఉన్నదంతా శూద్రులే. అందునా కుల గణనలో బీసీలుగా నమోదు అయినవారే. శూద్రులకు ఇంత కోపం ఎందుకు?
ఒకనాడు హిందూ మతోన్మాదం, చాతుర్వర్ణ వ్యవస్థలో పై మూడు వర్ణాలకే పరిమితమై ఉండేది. అద్వానీ రథయాత్ర నుంచి శూద్రులను కూడా హిందుత్వ ఫోల్డ్ లోకి తీసుకురావటం మొదలయ్యింది. బాబ్రీ మసీదు కూల్చివేతకు జరిగిన సన్నాహాల్లో శూద్రులను ముందుకు నెట్టారు. వీళ్ళనే కరసేవకులుగా తయారు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేతలో పాల్గొన్నది కూడా ఎక్కువమంది శూద్రులే. బిజెపి అధికారంలోకి రావాలంటే అంతకుముందు హిందుత్వ ఫోల్డ్ కి దూరంగా ఉన్న శూద్రులందర్నీ ఏకం చేయటానికి ప్రయత్నాలు నడుస్తున్నాయి. అందుకు ముస్లింలు అనే మైనారిటీని పెద్ద శత్రువుగా సృష్టించడం అవసరం అయింది వాయికి! ముస్లింలను శత్రువులుగా చిత్రించినంత కాలం హిందూ మతాన్ని అనుసరించే వారిని హిందుత్వ ఫోల్డ్ లోకి తీసుకువచ్చి అధికారానికి ఎగబాకగలమని మొట్టమొదటిసారి గుజరాత్ ప్రయోగం రుజువు చేసింది. దాంతో శూద్ర కులాల వారిని మరీ ముఖ్యంగా బీసీలుగా నమోదు కాగలిగిన వారిని గల్లీ నుంచి నాయకులుగా ప్రమోట్ చేయడం మొదలయ్యింది. రాజకీయంగా ఎదగాలంటే దేవుళ్ళని ముందు పెట్టాలనేది ఈ నాయకుల భావన. అదే అగ్ర నాయకత్వం నేర్పిన భావజాలం కూడా.
దేవుళ్ళని అవమానించారు అనే సెంటిమెంటును రెచ్చగొట్టి రాజకీయంగా పబ్బం గడుపుకుందాం అనేది ఈ దాడి వెనుక గల అసలు కారణం. పైగా మల్లికార్జున్ దళితుడు. శూద్రుల కింద అణగి మణిగి ఉండవలసిన వాడు. నాస్తికుడు. దేవుని నమ్మను అని బహిరంగంగానే వాళ్లకు చెప్పాడు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వమే రూపొందించిన పాఠ్య పుస్తకంలోని పాఠం చెప్పినప్పుడు మూఢనమ్మకాలకూ సైన్స్ కూ పొసగదు అని కాస్త గట్టిగానే ఉదాహరణలతో సహా పాఠం చెప్పి ఉంటాడు. మూఢనమ్మకాలను ఎలా దూరం చేయగలమనే ప్రశ్న కూడా ఆ పాఠానికి అనుబంధంగా ఉంది కాబట్టి సైన్సును నమ్మండి మూఢనమ్మకాలను కాదు అని చెప్పగలగటమే అదీ తగినన్ని ఎక్కువ ఉదాహరణలతో చెప్పగలగటమే మంచి ఉపాధ్యాయుడి లక్షణం. పైగా శాస్త్రీయ అవగాహనను అభివృద్ధి చేయడం, హేతుబద్ధ ఆలోచననూ, సంస్కరణనూ అభివృద్ధి చేయడం ప్రతి భారతీయుడి విధి అని రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A (h) ఘోషిస్తుందికదా.
మల్లికార్జున్ ఈ రాజ్యాంగ విధిని సక్రమంగా నిర్వర్తించాడు. తన ఉపాధ్యాయ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తానని ఉన్మాదులతో తెగేసి చెప్పి తన స్వాతంత్ర్యన్ని కాపాడుకున్నాడు. అందుకు మల్లికార్జున్ అభినందనీయుడు. విద్యార్థి తప్పు చేస్తే ప్రేమతో ఆ తప్పుని సరిదిద్దుకునేలా చెప్పే మల్లికార్జున్ తను విశ్వసించే భావజాలంపై, తను నమ్మిన సైన్స్ పై, తాను నిర్వర్తించే ఉపాధ్యాయ వృత్తి ధర్మంపై, తనపై ఓ విధిని మోపిన భారత రాజ్యాంగంపై, తన అభిజాత్యం పై జరిగిన దాడిని మాత్రం క్షమించదల్చుకోలేదు. పోలీస్ స్టేషన్ కి వెళ్లి 2023 జనవరి 3వ తారీకున ఫిర్యాదు రాసి ఇచ్చాడు. ‘నువ్వు కేసు పెడుతున్నావు … ఆలోచించుకో, వాళ్లు నీపై కేసు పెట్టగలరు’ అని కోటగిరి పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ ని కేసు పెట్టకుండా నిరుత్సాహపరచాలని ప్రయత్నించాడు. అయినా మల్లికార్జున్ నేరస్తులను వదిలి వేయడం కూడా చట్ట వ్యతిరేక చర్య అవుతుంది అనే స్పృహతో కేసు పెట్టవలసి వచ్చింది.
ఇప్పుడు రాజ్యం, అంటే పోలీసు రూపం లో కనబడే రాజ్యం, హిందూ ఉన్మాదులకి మద్దతుగా నిలబడింది! మల్లికార్జున్ పోలీసు స్టేషన్ కి పోయేంతవరకు అతని మీద దాడి చేసిన వారు పోలీసు స్టేషన్ కి పోలేదు. అయినా వాళ్లే ముందుగావచ్చి ఫిర్యాదు చేసినట్లు వారి ఫిర్యాదును క్రైమ్ నంబర్ 4/23 గానూ మల్లికార్జున్ రాసి ఇచ్చిన ఫిర్యాదును క్రైమ్ నెంబర్ 5/23 గాను నమోదు చేశాడు సబ్ ఇన్స్పెక్టర్. మల్లికార్జున్ ఐపీసీ లోని సెక్షన్ 153A కింద నేరం చేశాడని ఎఫ్ఐఆర్ రాశారు. ఏ రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టాడు అనేది మాత్రం లేదు. నేను దేవుని నమ్మను అంటే సెక్షన్ 295A ఐపిసి ఎలా వర్తిస్తుందో? ఎస్ఐ జే మచ్చేందర్ రెడ్డి అత్యుత్సాహమే ఎక్కువగా కనిపిస్తోంది. మల్లికార్జున దాఖలు చేసిన ఫిర్యాదు పై దర్యాప్తు చేస్తున్న బోధన్ ఏసిపి ఇంతవరకూ ఏ ఒక్క ముద్దాయినీ అరెస్టు చేయకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. దాంతో నేరస్తులు హాయిగా తిరుగుతున్నారు. అందువలన
మల్లికార్జున్ పై పెట్టిన కేసును ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి.
మల్లికార్జున్ పెట్టిన కేసులోని ముద్దాయిలను వెంటనే అరెస్టు చేయాలి.
ఉపాధ్యాయుల ఎకడమిక్ స్వేచ్ఛను ఎవరూ హరించనీయకుండా ప్రభుత్వం రక్షణ కల్పించాలి.
తన అకాడమిక్ స్వేచ్ఛను రక్షించుకుంటూ, శాస్త్రీయ అవగాహనను కల్పిస్తూ, రాజ్యాంగ విలువలను సమున్నతంగా ఎత్తి పడుతున్న మల్లికార్జున్ కి మద్దతుగా పౌర సమాజం నిలబడాలి.