రెచ్చగొట్టే రాజకీయాలకు పాల్పడకండి

హైదరాబాద్ చెంగిచెర్ల ప్రాంతంలోని పిట్టలబస్తీలో మార్చి 24 ఆదివారం నాడు మతకలహాలు చెలరేగాయన్న వార్త పత్రికలలో చూసి మానవ హక్కుల వేదిక హైదరాబాద్ బృందం 26 మార్చి 2024 న విషయ సేకరణకు ప్రయత్నించింది. అయితే 144 సెక్షన్ అమలులో ఉన్నాయని పోలీసులు అనుమతించక పోవడం వల్ల  బాధితులను కలవలేకపోయింది. ఈ బృందంలో శ్రావ్య, రోహిత్ చంద్ర, ఫిరోజ్, సంజీవ్ ఉన్నారు.  

మాములుగా హైదరాబాద్ లో మతకలహాలు అంటే పాత బస్తీలోనే జరుగుతాయనే అభిప్రాయం ఉంటుంది. కానీ ఈ సంఘటన హైదరాబాద్ శివార్లలోని చెంగిచెర్లలోని పిట్టలబస్తీలో జరిగింది. అక్కడ హిందువులు, ముస్లిములు ఇద్దరూ పక్కనే ఉన్న కబేళా (పశువుల వధ్యశాల) మీద ఆధారపడి మేక మాంసం అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. పిట్టలోళ్లు అనబడే పార్థీ కులానికి చెందిన వారు ఎక్కువమంది ఉండటంతో దీనికి పిట్టల బస్తీ అనే పేరు స్థిరపడింది. ముస్లిం జనాభా కొద్ది శాతం మాత్రమే ఉంది. స్థానికులు చెప్పిన దాన్ని బట్టి వారి మధ్య మతసామరస్యం బాగానే ఉండేది.

గత వినాయకచవితి సమయంలో మొదటిసారి హిందూ ముస్లిం గొడవలు మొదలయ్యాయి. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం రంజాన్ నెల ప్రారంభంలోనే పోలీసులు ఇరువర్గాల వారితోను మాట్లాడి, సామరస్యంగా ఉండాలని హితవు చెప్పారు. బస్తీలో అందరూ మటన్ వ్యాపారస్తులే, అందరికీ హోలీ రోజు వ్యాపారం జరగాలి కాబట్టి ముందు రోజే హోలీ జరుపుకోవడం అక్కడ ఆనవాయితీ. ఆ ప్రకారమే ముందు రోజు హోలీ సంబరాల్లో భాగంగా లౌడ్ స్పీకర్ ద్వారా పాటలు పెట్టారు. అయితే స్థానిక రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నాయకులు హిందూత్వ దూకుడును ప్రేరేపించే పాటలను (హిందూత్వ పాప్ సాంగ్స్) మధ్యాహ్నం నమాజు సమయంలో వినిపించడం మొదలుపెట్టారు. దీనికి ముస్లింలు అభ్యంతరం చెప్పడంతో అప్పుడు తాత్కాలికంగా ఆపారు కాని మళ్ళీ సాయంత్రం నమాజు పూర్తి అయి ముస్లింలు మసీదు నుంచి బయటకి వచ్చే సమయానికి తిరిగి అవే పాటలు పెట్టారు. ఉదాహరణకు “హమ్ సే పంగ లే న బేటే, హిందూ ధర్మ్ కే హమ్ షేర్ హై రే చోటే – మాతో గొడవలు పెట్టుకోకు, మేము హిందూ ధర్మానికి పులులంరా చిన్నోడా” వంటి పాటలు పెట్టారు. దానితో మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది. ఇరు వర్గాల వారికీ దెబ్బలు తగిలాయి.  పోలీసులకు ఫోన్ చెయ్యగా సర్కిల్ ఇన్స్ పెక్టర్ వెంటనే స్పందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వచ్చి కొట్టుకుంటున్న వారిని చెదరగొట్టి, కొంతమందిని అదుపులోకి తీసుకుని రిమాండుకు పంపించారు. ఎంత మందిని రిమాండుకు పంపారో తెలియలేదు.

తరువాతి రోజు భారతీయ జనతా పార్టీ నాయకులైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ పిట్టల బస్తీ వచ్చి హిందువులకు న్యాయం జరగలేదని రభస చేయడంతో ఈ సంఘటనకు వార్తా పత్రికలు  ప్రాముఖ్యం ఇచ్చాయి. ఆ తరువాత భారతీయ జనతా పార్టీ ఎం.పి బండి సంజయ్ సంఘటనా స్థలికి భజరంగ్ దళ్ తదితర హిందూత్వవాదులతో కలిసి వెళ్ళడమే కాదు, పోలీసులను నెట్టుకుంటూ బ్యారికేడ్లు దాటుకుంటూ బస్తీలోకి దూసుకువెల్లిన దృశ్యాలు అన్ని సామజిక మాధ్యమాల్లో వీడియో రూపంలో ప్రాచుర్యం పొందింది.

ముస్లింలకు పవిత్ర మాసమైన రంజాన్ నెలలో బీజేపీ, దాని అనుబంధ సంస్థలు, బీజేపీ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు ఇంత బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించడం చాలా విచారకరం. భారతీయ జనతా పార్టీ MLA రాజా సింగ్, MIM పార్టీ నాయకుడు ఒవైసి సంఘటనా స్థలికి చేరుకోకుండా పోలీసులు అడ్డుకోబట్టి పరిస్థితి మరింత విషమించలేదు. వారిద్దరూ కూడా అక్కడ ప్రసంగించి ఉంటే పరిస్థితి కచ్చితంగా చెయ్యి దాటి పోయేదే.

ప్రస్తుతానికి, ముస్లిం కుటుంబాలలో మగవాళ్ళు అందరూ బస్తీ విడిచి వెళ్లిపోయారు. రెండు రోజులు బస్తీ మసీదులో నమాజు జరగనివ్వలేదు అని తెలిసింది. బస్తీలో దాదాపు 50 నుంచి 100 మంది వరకు లా అండ్ ఆర్డర్ పోలీసులు మరియు స్పెషల్ ఫోర్స్ సిబ్బంది నిరంతరం ఉంటున్నారు. పొద్దున 4 గంటల నుంచి మధ్యాహ్నం వరకు మటన్ వ్యాపారం కొనసాగుతోంది కాని ఆ తరువాత ఏ ఒక్క వ్యాపారాన్నీ అనుమతించడం లేదు. బస్తీ నుంచి ఒక పావు కిలోమీటర్ మేర కర్ఫ్యూ వాతావరణం నెలకొని ఉంది. బస్తీ వారిని బయటకి లోపలికి అనుమతిస్తున్నారు కానీ, కొత్త వారిని మాత్రం రానివ్వడం లేదు.

చెంగిచెర్ల సంఘటన హిందూత్వ రాజకీయాలకు ఒక ఉదాహరణ. ‘మందిర్ వహీ బనా దేంగే’ పాట హిందుత్వ పాప్ గా చలామణీలోకి తీసుకు వచ్చేసారు. అప్పుడయినా ఇప్పుడయినా హిందూత్వ విధానంలో మార్పు లేదు. ఒక వర్గాన్ని క్రూరులుగా చూపాలంటే, చరిత్రలో వారి పూర్వీకుల క్రూరత్వాన్ని మర్చిపోనివ్వకుండా చేస్తూ, జరిగిన చరిత్రకు కొంత మసాలా జోడించి ప్రజల్లో చరిత్ర పట్ల అవగాహనను మారుస్తూ, ఆ వర్గాన్ని రెచ్చగొట్టి, అదిగో రెచ్చిపోయారు, ఇలా క్రూరత్వం అనేది వీరి రక్తంలోనే ఉందని ఎదురు ప్రచారం చేస్తూ, ఈ క్రూరుల నుంచి నేనే నిన్ను కాపాడతాను కాబట్టి నాకే ఓటు వెయ్యండి అని అడగడమే ఆ విధానం. దశాబ్దాలుగా భారతదేశంలోని హిందువులకు, ముస్లింలకు మధ్య చిచ్చు పెట్టిన బాబ్రీ – అయోధ్య తగాదా తమకే అనుకూలంగా పరిష్కరించబడడంతో హిందుత్వవాదులు దాన్ని ఒక ఘనవిజయంగా చూస్తున్నారు, చూపిస్తున్నారు. నేను గెలిచాను అని చాటింపు వేసుకుంటూ ముస్లింలను రెచ్చగొడుతున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికలలో ఈ అంశాన్ని వాడుకోవడానికి చూస్తున్నారు.

మతకలహాలు వచ్చే అవకాశం  ఉందని అనుమానపడి, ప్రజలతో ముందుగానే సంప్రదింపులు మొదలుపెట్టిన మేడిపల్లి పోలీసులను అభినందిస్తూ, ఈ ప్రాంతంలో మత సామరస్య పెంపుదలకు ప్రభుత్వం ఇరు వర్గాలతో చర్చలు, మతకలహాలలో ఎవరు నష్టపోతున్నారు ఎవరు లాభపడుతున్నారు అన్న విషయం ప్రజలకి విశదీకరించే విధంగా సాంస్కృతిక కార్యకలాపాలను  చేపట్టాలని కోరుతున్నాం.

ఈ ప్రాంతం చాలా సున్నితంగా, సులభంగా భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రాంతంగా మారింది కాబట్టి, ఈ ప్రాంతంలో స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, విజ్ఞత గల వ్యక్తులు మత సామరస్యం కోసం కృషి చేయవలసి ఉంటుందని మానవ హక్కుల వేదిక భావిస్తున్నది.ఈ పరిస్థితిని అదనుగా తీసుకొని ప్రజలను రెచ్చగొట్టకుండా విజ్ఞతతో వ్యవహరించాలని రాజకీయ నాయకులను కోరుతున్నాం.

మానవ హక్కుల వేదిక(HRF), హైదరాబాద్ శాఖ
26 మార్చి 2024

Scroll to Top