విషపూరిత వ్యర్ధాలను వెదజల్లుతున్న క్రెబ్స్ బయో కెమికల్స్ అనుమతులను రద్దు చేయాలి

పర్యావరణ చట్టాలను, నిబంధనలను బాహాటంగా, అత్యంత ఘోరంగా ఉల్లంఘిస్తున్ననందుకు విశాఖపట్నం జిల్లాలోని కశింకోట మండలంలో క్రెబ్స్‌ బయో కెమికల్స్ అండ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (కెబ్స్‌) కి మంజూరు చేసిన పర్యావరణ అనుమతులను తక్షణం రద్దు చేయాలని మానవ హక్కుల వేదిక (హెచ్‌.ఆర్‌.ఎఫ్‌.) డిమాండ్‌ చేస్తోంది. క్రెబ్స్‌ పరిశ్రమ విషపూరిత వ్యర్థ పదార్ధాలను పరిశ్రమ పరిసరాలలో, చెరువులో, కుంటలలో వదలడం వల్ల పరిశ్రమ పరిసరాలలోని గ్రామాల ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు.

హెచ్‌.ఆర్‌.ఎఫ్‌. త్రిసభ్య బృందం గత ఆదివారం గంటవానిపాలెం (మునగకపాక మండలం), పేరంటాలపాలెం (కశింకోట మండలం), తేగడ (కశింకోట మండలం) గ్రామాలను సందర్శించి స్థానిక ప్రజలతో మాట్లాడి వివరాలు సేకరించింది. కొన్ని సంవత్సరాలుగా క్రెబ్స్‌ పరిశ్రమ వ్యర్ధ పదార్ధాలు వెదజల్లుతుందని, ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని స్థానిక ప్రజలు హెచ్‌.ఆర్‌.ఎఫ్‌.కి బృందానికి చెప్పారు. ఈ మూడు గ్రామాలు ఫ్యాక్టరీకి చాలా దగ్గరలో ఉన్నాయి. ప్రజా ఆరోగ్యానికి హానికరమైన వ్యర్థ పదార్థాలను విడుదల చేస్తున్నారనేది మాకు అర్ధమైంది. గాలిలోకి వ్యర్థ పదార్ధాలను విడుదల చేయడం వల్ల దుర్భరమైన వాసన వస్తోంది. కొన్ని సంవత్సరాలుగా ఆ గ్రామాల ప్రజలు ఆ దుర్గంధంతో సహజీవనం చేయాల్సి వస్తోంది. పరిశ్రమలు పాటించాల్సిన పర్యావరణ ప్రమాణాలను క్రెబ్స్‌ ఏమాత్రం పాటించడం లేదనేది కొట్ట వచ్చినట్లు తెలుస్తోంది.

క్రెబ్స్‌ ఫ్యాక్టరీ కొన్ని సంవత్సరాలుగా విడుదల చేసిన వ్యర్థ పదార్దాలు భూమిలోకి ఇంకి పోవడం వల్ల భూజలాలు పూర్తిగా కలుషితమైపోయాయని గంటవానిపాలెం ప్రజలు చెప్పారు. కంపెనీ పైపుల ద్వారా స్థానిక చెరువుల్లోకి, గుంటలలోకి వదలడం వల్ల ఆ నీళ్ళు తాగి చాలా మంది థైరాయిడ్‌ సంబంధిత వ్యాధికి, కీళ్ళ నొప్పులకు గురవుతున్నారు. మందుల కొనుగోలుకి వారు చాలా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఆ ప్రాంతంలో అత్యధిక భాగం ప్రజలు కూలి పని చేసుకుని బ్రతికే వారే. తమ సంపాదనలో అధిక భాగం మందులు కొనుగోలుకే సరిపొతోందని వారు వాపోయారు. బోర్‌ నీళ్ళు రంగు మారి పోయి వాసన వస్తున్నాయి. తాగడానికే కాదు ఇతర అవసరాలకు కూడా పనికి రావడం లేదు. అది వాడితే గ్రామస్తులు చర్మ వ్యాధులకు గురవుతున్నారు. బోర్లలో నీరు కేవలం బట్టలు ఉతుక్కోవడానికి పనికొస్తున్నాయి. త్రాగునీరు కావాలంటే కొన్ని కిలోమీటర్ల దూరం నుండి మోసుకుని రావాల్సి వస్తోంది. వ్యర్థ పదార్థాల ప్రభావానికి గురయ్యి పశువులు చనిపోయాయి. కొంత కాలం క్రితం వరకూ కూడా కంపెనీ వ్యర్థ పదార్థాలను పైపుల ద్వారా సమీపంలోని శారద నదిలోకి విడుదల చేసేది.

క్రెబ్స్‌ కంపెనీ ఇంత యదేచ్చగా పర్యావరణ నేరాలకు పాల్పడుతుంటే ఏ.పి. కాలుష్య నివారణ మందలి (ఏ.పి.పి.సి.బి.), పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ (ఎం.ఓ.ఇ.ఎఫ్‌.సి.సి.) ప్రాంతీయ కార్యాలయం వారు ఏమి చేస్తున్నట్లు? క్రెబ్స్‌ ఇంత బాహాటంగా షరతులతో కూడిన అనుమతులను, పర్యావరణ ప్రమాణాలను ఉల్లంఘిస్తుంటే నోరు ఎందుకు మెదపడం లేదు? ఈ ఉల్లంఘనలన్నీ వివిధ పర్యావరణ చట్టాల కింద కేసులు నమోదు చేయదగ్గ నేరాలు కాదా? ఈ కంపెనీ చేస్తున్న పర్యావరణ విధ్వంసం, తద్వారా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడటం ఈ అధికార సంస్థలకు తెలియక కాదు. స్థానిక ప్రజలు, ఇతర పౌరులు, మీడియా కధనాలు ఈ అధికార్ల దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకుని వెళ్తున్నా వారు క్రెబ్స్‌ కంపెనీపై చర్యలు తీసుకోవడం లేదు. ఏపి.సి.సి.బి., ఎం.ఓ.ఇ.ఎఫ్‌.సి.సి. అధికార్లు క్రెబ్స్‌ కంపెనీతో కుమ్మక్కు అయ్యారని అనుకుందామా? అటువంటప్పుడు అందుకు బాధ్యులైన అధికార్లపై కూడా క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని కోరుతున్నాం.

క్రెబ్స్‌ కంపనీకి మంజూరు చేసిన పర్యావరణ అనుమతులను తక్షణం రద్దు చేసే సమగ్రమైన స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని మేము మరో సారి డిమాండ్‌ చేస్తున్నాం. ఆ కంపెనీ పర్యావరణ నిబంధనలన్నిటినీ సక్రమంగా పాటించే విధంగా చూడాలి. ప్రజల ఆరోగ్యంతో, పర్యావరణంతో చెలగాటమాడినందుకు, చట్టాన్ని ఇష్టానుసారం ఉల్లంఘించినందుకు క్రెబ్స్‌ కంపెనీపై జరిమానా విధించాలి. జిల్లా పాలనా యంత్రాంగం తక్షణం Sy పరిశ్రమ పరిసర ప్రాంత ప్రజలకు స్వచ్చమైన నీరు అందించే ఏర్పాటు చేయాలనీ, ఆ గ్రామాల్లో మెడికల్‌ క్యాంప్స్‌ నిర్వహించి వారికి మందులు అందజేయాలని మేము డిమాండ్‌ చేస్తున్నాం.

మానవ హక్కుల వేదిక
ఆంద్రప్రదేశ్
6 మే 2019

Related Posts

Scroll to Top