కరువు కాలంలో ప్రజలకు ప్రభుత్వం నుంచి అందవలసిన సహాయ సహకారాలను హక్కులుగా గుర్తించి, ఒక సమగ్ర కరువు సహాయక చట్టాన్ని (Drought Relief Act) రూపొందించాలని మానవహక్కుల వేదిక కోరుతోంది. కరువు సమయంలో ప్రభుత్వం అందించవలసిన తక్షణ సహాయ సహకారాలతో పాటు కరువు దుష్ప్రభావాలను తొలగిపోయేందుకు అది చేపట్టవలసిన చర్యలన్నింటినీ ఆ చట్టంలో పేర్కొనాలి. కరువు బారిన పడ్డ ప్రజలకు రాదగ్గ హక్కులన్నింటినీ చట్టంలో క్రోడీకరించాలి. ప్రభుత్వం ఆ విపత్కర పరిస్థితులో నిర్వర్తించవలసిన విధులను కూడా చట్టంలో పొందుపరచాలి. దాని అమలు కోసం అవసరమైన యంత్రాంగాన్ని చట్టంలోనే నిర్దేశించాలి. ఏ అధికార్ల బాధ్యత ఏమిటో స్పష్టంగా పేర్కొనాలి. ఆ బాధ్యతలు నిర్వర్తించని అధికార్లపై తీసుకునే చర్యలు కూడా అందులో పొందుపరచాలి.
ఆ సమగ్ర కరువు సహాయక చట్టంలో కరువు ప్రాంత ప్రజలకు కనీస రక్షణ కల్పించాలి. కరువు తలెత్తినప్పుడల్లా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాత్కాలిక ఉపశమన చర్యల (adhocism)కు ఉపక్రమించడమో, కరువు తీవ్రత ప్రాతిపదికగా కాక అప్పటికప్పుడు ప్రజలను కాసింత తృప్తి పరచడానికి మొక్కుబడి చర్యలను చేపట్టడమో రివాజుగా మారింది. ఈ తీరు మారాలి. కరువు బారినపడ్డ ప్రజల హక్కులను గుర్తించి, ఒక సమగ్ర కరువు సహాయక చట్టాన్ని వెంటనే రూపొందించాల్సిన అవసరం ఉంది.
అటువంటి కరువు సహాయక చట్టం ఒకటి రూపొందే లోపున కరువు ఉపశమన, సహాయక చర్యలను చేపట్టడానికీ, పర్యవేక్షించడానికీ ఒక యంత్రాంగాన్ని (agency) ఏర్పాటు చేయాలి. సహాయం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుర్గతిలో కరువు రక్కసికి చిక్కిన రైతులు పడకూడదు.
ఏటా దేశంలో అనేక చోట్ల తాండవిస్తున్న కరువు ఆయా ప్రాంతాలలోని ప్రజలను దుర్భర పరిస్థితుల్లోకి నెడుతూనే ఉంది. కుటుంబాలకు కుటుంబాలు చావుబతుకుల మధ్య బతుకుతున్నాయి. వారి జీవించే హక్కుకు భంగం వాటిల్లుతోంది. అయినా కూడా మన దేశంలో కరువు ఉపశమన, సహాయక చర్యలు చట్టబద్ధ హక్కు కాలేదు. కరువు సంభవించినపుడు ప్రజలు ఎదురు చూసే మూడు ప్రాథమిక అవసరాలను ప్రభుత్వం వారి హక్కులుగా గుర్తించాలి. ప్రజలకు పని కల్పించడం, పశువులకు పశుగ్రాసం అందించడం, అందరికీ నీటిని సరఫరా చేయడం – ఈ మూడూ కరువు బారిన పడ్డ ప్రాంతాల ప్రజల హక్కులు. ఈ హక్కులను క్రోడీకరిస్తూ ఒక సమగ్ర కరువు సహాయ చట్ట రూపకల్పన కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయవలసిందిగా ప్రజాస్వామిక ఉద్యమాలకు, అన్ని రాజకీయ పక్షాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సహాయం ఒక హక్కుగా సంక్రమించిన నాడు ఆకలి దప్పులను చల్లార్చుకోవడానికి కరువు కడగళ్లలో చిక్కిన ప్రజలు వీధులబడి దేబిరించాల్సిన దుస్థితి తప్పుతుంది.
మానవహక్కుల వేదిక వాస్తవ సేకరణ బృందాలు కరువు బారిన పడ్డ రాయలసీమ, ప్రకాశం, విజయనగరం జిల్లాలలోని అనేక గ్రామాలను ఇటీవల సందర్శించాయి. ప్రజలతో మాట్లాడాయి. ప్రభుత్వం తాను సహాయం చేస్తున్నట్టు ప్రకటనలు చేస్తున్నప్పటికీ, మాకు ఎక్కడా ఈ ప్రాంతాలలో ఆ దాఖలాలు కనపడలేదు. రైతులు తీవ్రమైన దుఃఖంలో ఉన్నారు. అన్ని గ్రామాలలోనూ చెరువులు ఎండి నెర్రెలు వారాయి. భూగర్భ జలాలు అట్టడుక్కి పోయాయి. పంటలు ఎండిపోయాయి. తడీ తేమా లేని భూముల్లో విత్తనాలు పోయడం దండగని భావించి రైతులు చాలా భూములను బీడుల్లా వదిలేయడం మాకు కనిపించింది. రాయలసీమలోనే కాక ఇతర జిల్లాలలోనూ సన్నకారు, చిన్నకారు రైతులు కూడా ఊళ్లు వదిలి వలస వెళ్ళిపోవడం మా గమనంలోకి వచ్చింది. కరువు విధ్వంసం సర్వత్రా కనిపించింది. వ్యవసాయం కుదేలు అయిపోయింది. మన ఇటీవలి జ్ఞాపకాల్లో అతి దుర్భరమైన, క్రూరమైన కరువుగా దీనిని భావించవచ్చు.
గ్రామీణ ప్రాంతాల్లో అప్పుల భారం చాలా తీవ్రంగా ఉంది. చాలా మంది రైతులకు ప్రభుత్వం అందించాల్సిన పరిహార నగదు ఇప్పటికీ అందలేదు. దిగ్భ్రమ కలిగించే విషయం ఏమిటంటే – గతేడాది ఇవ్వవలసిన పంట నష్ట పరిహారాన్ని ఈ ఏడాది ఇవ్వడం! అన్ని చోట్లా ఇచ్చారా అంటే అదీ లేదు. ఒక పద్ధతీపాడూ లేదు. ఉపాధి హామీ పథకాన్ని (MGNREGA) కరువు సహాయం కోసం సానుకూలంగా వాడుకున్నదీ మాకు కానరాలేదు. అతి తక్కువ కూలి రేట్లు ఇచ్చారనీ, వాటిని ఇవ్వడంలో కూడా ఎక్కడలేని జాప్యం జరిగిందనీ మాకు ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. కరువు ప్రాంతంగా ప్రకటించడం, ఆపై రైతులకు స్వల్పకాలిక పంటలు వేయాలని సెలవివ్వడం ఏ మాత్రం వారికి సాయపడదు. బాధితులు చవిచూస్తున్న భారీ నష్టాలను పూడ్చడానికి, వారికి సాయపడటానికి ప్రభుత్వం నిజాయితీతో కూడిన అర్ధవంతమైన చర్యలు చేపట్టాలి. అంతేకానీ రియల్ టైం గవర్నెన్స్ గురించి ప్రగల్బాలు పలకడం కాదు.
కరువు ప్రాంతాలలో ఆహార దినుసులు అందరికీ అందుబాటులో ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశం అమలు కావడం లేదు. కరువు ప్రాంతాలలో పిల్లలందరికీ సెలవు రోజుల్లో కూడా పౌష్టికాహారం అందివ్వాలని అదే కోర్టు 2016లో ఆదేశించింది. దానిని ప్రభుత్వాలు ఉపేక్షించాయి. కరువు సహాయంగా వచ్చిన పరిహారాన్ని బ్యాంకులు బాకీకి కట్టుకుంటున్నాయని అందరూ ఫిర్యాదు చేశారు. ఇది జరగకూడనిది. రుణం మంజూరు చేసినపుడు పంట బీమా ప్రీమియం తగ్గించి రుణం ఇచ్చారనీ, ఆ విషయం తమకు చెప్పకుండానే చేసేశారనీ రైతులు ఆరోపించారు. పంట నష్టానికి చెల్లించాల్సిన బీమాను ఇప్పటివరకూ చెల్లించలేదని వారు వాపోయారు.
ఉపాధి హామీ పథకం (MGNREGA) సెక్షను 3(4) కింద పని దినాలను 200కు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తిత్లీ (Titli) తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఉపాధి హామీ పని దినాలను 200కు పెంచుతామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హంసరాజ్ అహిర్ ఇటీవల ప్రకటించారు కూడా. దీనిని ఇతర కరువు ప్రభావిత ప్రాంతాలకు ఏ
తాత్సారం లేకుండా వెంటనే వర్తింపజేయాలి. జాతీయ విపత్తు సహాయ నిధి (National Disaster Response Fund – NDRF) నుంచి కేంద్రమూ, రాష్ట్ర విపత్తు సహాయ నిధి(State Disaster Response Fund – SDRF) నుంచి రాష్ట్రమూ నిధులను విడుదల చేయాలి.
అవాంఛనీయమైన, న్యాయబద్ధం కాని భారీ నీటి ప్రాజెక్టులను హామీ ఇచ్చే బదులు స్థానిక నీటి వనరుల మీద మినీ జలాశయాలు నిర్మించడం మీద ప్రభుత్వాలు శ్రద్ధాసక్తులను చూపాలని మానవహక్కుల వేదిక డిమాండ్ చేస్తోంది.
మానవహక్కుల వేదిక
ఆంధ్రప్రదేశ్
3 డిసెంబర్ 2018