సామాజిక రుగ్మతగా మారుతున్న రైతు ఆత్మహత్యలు

ఇటీవల మహబూబాబాద్‌ జిల్లాలో రెండు నెలల వ్యవధిలోనే దాదాపు 20 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డ విషయం తెలిసిందే. మనం తినే అన్నం, తొడిగే బట్టల ఉత్పత్తిలో రైతుల చెమట, నెత్తురే కాదు వాళ్ళు కోల్పోతున్న ప్రాణాలు కూడా కలిసి ఉండటం మనందరికీ ఎంతో బాధ కలిగే విషయం.

గత రెండు రోజులుగా (12 &13 తేదీల్లో) మహబూబాబాద్‌ జిల్లాలో మానవహక్కుల వేదిక, రైతు స్వరాజ్య వేదికలకు చెందిన ఎనిమిది మంది సభ్యుల బృందం కేసముద్రం, మహబూబాబాద్‌, దంతాలపల్లి, మరిపెడ మండలాల్లో ఆత్మహత్యలు చేసుకున్న పన్నెండు కుటుంబాలను కలిసి వివరాలు సేకరించింది. వ్యవసాయ అధికారులతో మాట్లాడింది.

ఈ ప్రాంతంలో రైతులు గత కొద్ది సంవత్సరాల నుండే పెద్దఎత్తున వ్యాపార పంటల సాగుకు మళ్లారు. రోజురోజుకు పెరుగుతున్న జీవన వ్యయం, ఇతర పంటలకు ధరలు లేకపోవడం రైతులను ఈ మార్పు వైపుకు నెట్టింది. మిర్చి పంట సాగుకు ఎకరానికి లక్ష రూపాయల వరకు పెట్టుబడి వ్యయం అవుతున్నది. దీనికి కౌలు విలువ అదనం. మిర్చి సాగు కోసం ఏటేటా పెరిగిన అప్పులకు తోడు ఈ సంవత్సరం అకాల వర్షాల అనంతరం సోకిన బ్లాక్‌ త్రిప్స్‌తో రైతుల కళ్లముందే పంటంతా మాడిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతులు ఒక్కసారిగా ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

 1. మేం కలిసిన 12 కుటుంబాల్లో ఒకరు రెడ్డి, ఒకరు యాదవ కాగా మరొకరు దళితులు. మిగిలిన వాళ్ళందరూ లంబాడా గిరిజనులు.
 2. అందరూ 2 నుంచి 4 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశారు. పత్తి, వరి కంటే ఈ సంవత్సరం ఎక్కువగా మిర్చి పంటను వేశారు.
 3. అత్యధికులు బ్లాక్‌ త్రిప్స్‌ సోకి పాడైన పంటను చూసిన సమయంలోనే తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
 4. అందరికీ కనీసం 6 నుండి 12 లక్షల రూపాయల అప్పు అయి వుంది. ఒకరికైతే ఇరవై ఐదు లక్షల అప్పు దాకా ఉంది.
 5. మహబూబాబాద్‌ మండలం అమన్ గల్‌కు చెందిన దేవిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబం ఒక్క సిండికేట్‌ బ్యాంక్‌ లోనే 15 ఏళ్ల కింద తీసుకున్న మూడు లక్షల రూపాయల అసలు – వడ్డీల మీద వడ్డీలై మొత్తం 20 లక్షల రూపాయలకు చేరి ఉంది. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన వెంకటరెడ్డి తన ముగ్గురు ఆడపిల్లలను కూడా తండ్రి లేని వాళ్లను చేసి వ్యవసాయం చేస్తున్న పంట చేలోనే గడ్డి మందు తాగి చనిపోయాడు.
 6. మహబూబాబాద్‌ మండలం పర్వతగిరి గ్రామంలో దళిత కుటుంబానికి చెందిన 25 ఏళ్ల యువకుడు నారమల్ల సంపత్‌ తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. ట్రాక్టర్‌ కూడా లోన్‌లో తీసుకొని తండ్రికి గల కొంత భూమికి అదనంగా మరికొంత భూమిని కౌలుకు తీసుకుని ఇద్దరూ వ్యవసాయం చేసేవారు. వరుసగా దెబ్బతిన్న పంటలను చూసి తట్టుకోలేక చేనులోనే గడ్డిమందు తాగి చనిపోయాడు. సంపత్‌ పేరు మీద ఏ మాత్రం భూమి లేనందున సంపత్‌కు రైతు బీమా కూడా వచ్చే పరిస్థితి లేదు. భార్య, ఇద్దరు చిన్న ఆడపిల్లలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
 7. దంతాలపల్లి మండలం తూర్పు తండాకి చెందిన 30 సంవత్సరాల యువకుడు మాలోతు శ్రీను డిసెంబర్‌ 24న ఇంట్లోనే ఉరి వేసుకొని చనిపోయాడు. ఎండిపోయిన మిర్చి, దిగుబడి రాని పత్తి పొలం బాధలు ఒకవైపు, కిస్తీలు  కట్టలేదని బైక్‌ని లాక్కెళ్ళిన ఫైనాన్స్‌ వాళ్ళు చేసిన అవమానం మరోవైపు వేధించగా పసివాడుగా ఉన్నప్పుడే తండ్రిని కోల్పోయిన శ్రీను తిరిగి తన ఇద్దరు పిల్లలను తండ్రి లేని వారిని చేస్తూ వెళ్ళిపోయాడు.
 8. మరిపెడ మండలం గుర్రపు తండాకు చెందిన 25 ఏళ్ల దేవేందర్‌కి సొంత భూమి లేదు. తండ్రి పేరు మీద ఉన్న 30 గుంటలకు అదనంగా మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశాడు. 12 లక్షల అప్పు అయింది. మందు తాగి చనిపోయాడు. రైతు బీమా కూడా రాదు.

నేటి పరిస్థితి

 • మృతుల కుటుంబాలపై ఉన్న బ్యాంకు, ప్రైవేటు అప్పులన్నీ ఇంకా అలాగే ఉన్నాయి. ఇప్పటికే అప్పుల వాళ్ళందరూ కుటుంబ సభ్యులను వేధిస్తున్నారు. ఆయా అప్పులను మాఫీ లేదా సెటిల్‌ చేయటానికి ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నం చేయటం లేదు.
 • మృతుల్లో కొంతమందికి రైతు భీమా అందింది. అయితే వెంకటగిరి గ్రామంలోని భూక్యా వెంకన్నను బతికించుకోవడానికి చేసిన విఫల ప్రయత్నంలో హాస్పటల్‌ ఖర్చుల కోసం కొత్తగా చేసిన అప్పుకిందే రైతు బీమాలో సగం పోయింది.
 • ఇనుగుర్తి గ్రామానికి చెందిన వొల్లం వెంకన్న, తారా సింగ్‌ తండా రాంలాల్‌ శ్రీనులకు రైతు బీమా అందాల్సి ఉంది. అయితే వెంకన్నకు అప్పు ఇచ్చిన వాళ్లు వెంటనే అప్పు తీర్చాలని ఇప్పటికే గొడవలకి వన్తున్నారు. బీమా మొత్తం కాక ఉన్న ఎకరన్నర భూమి అమ్మినా అప్పు తీరే పరిస్థితి లేదు. ముగ్గురు ఆడపిల్లల్లో ఇద్దరు ఆడపిల్లల చదువులు, పెళ్లిళ్లు ముందున్నాయి.
 • తారాసింగ్‌ తండా బానోతు లాల్‌ సింగ్‌, కేసముద్రం గ్రామం భూక్యా బాలు, అర్పణపల్లి బిపి కిష్టాపూర్‌ తండా ఈర్యా నాయక్‌లకు ఏ మాత్రం సాంత భూమి లేనందున రైతు బీమా కూడా వచ్చే పరిస్థితి లేదు.
 • బృందం తిరిగిన 12 గ్రామాలలో రైతులందరూ తమకు వ్యవసాయ, ఉద్యానవన శాఖలు, సుగంధ ద్రవ్య బోర్డుల నుండి ఎటువంటి సాంకేతిక, శాస్త్రీయ సహకారం అందటం లేదని, తమకు ఎవరికీ గత మూడేళ్లుగా బ్యాంకులో లోన్‌లు ఇవ్వడం లేదని ముక్తకంఠంతో చెప్తున్నారు.
 • వ్యవసాయ ఉద్యానవన అధికారులు కంటికి కనిపించకపోవడంతో మరో దారి లేక తమకు అందుబాటులో ఉన్న పురుగుల మందుల దుకాణదారులు ఏది చెప్తే అది చేస్తున్నామని చెప్పారు. ఫలితం మనం ఊహించవచ్చు.
 • పురుగుల మందులు, విత్తన షాపులపై ఎటువంటి నియంత్రణా, పర్యవేక్షణా లేకపోవటం వల్ల వారి మోసాలు దోపిడీలు రైతుల పెట్టుబడి వ్యయాన్ని విపరీతంగా పెంచుతున్నాయి.
 • పంటలు నష్టపోయినప్పుడు రైతులను ఆదుకునే వాళ్ళు ఉంటారు అనే నమ్మకం రైతులకు ఉంటే ఈ ఆత్మహత్యల్లో చాలా భాగం జరుగక పోవును.
 • పంటల అమ్మకాల సమయంలో ధరల హెచ్చుతగ్గుల విషవలయం అలాగే ఉంది.

మహబూబాబాద్‌ జిల్లాలో ఈ రెండు నెలల కాలంలో అధిక సంఖ్యలో నమోదైన రైతుల ఆత్మహత్యలు కేవలం యాదృచ్చికం కావు. ఇవన్నీ వ్యవసాయ సంక్షోభ భూతం గిరిజన ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్న ఫలితాలు. ప్రభుత్వాలు తమ వ్యవసాయ విధానాన్ని పునఃసమీక్షించుకుని, రైతుల ప్రయోజనమే ముఖ్యమైనదిగా భావించాలి. భవిష్యత్తులో వ్యవసాయరంగ నిర్వహణలో మార్పులు చేయకపోతే, ఇప్పుడు మొదలవుతున్న ఆత్మహత్యల పరంపర అలలు అలలుగా కొనసాగుతూనే ఉంటుంది. మందలో బలహీనంగా ఉండి, వెనక వెనకగా నడిచే సాధు జంతువులే క్రూర జంతువుల వేటకి మొదటి లక్ష్యమైనట్టు రైతుల్లో ఆర్థికంగా, సామాజికంగా అట్టడుగున ఉన్న వాళ్ళు ఈ వ్యవసాయ సంక్షోభ భూతానికి బలయ్యే వాళ్లలో మొదటి వరసలో ఉంటారు. అందుకే మహబూబాబాద్‌ జిల్లాలో ఎన్నో వర్షాల వాళ్ళు, భూస్వాములు వ్యవసాయం చేస్తున్నప్పటికీ ఇలా ఆత్మహత్య చేసుకున్న వాళ్లలో నూటికి 90 శాతం లంబాడా గిరిజనులే ఉన్నారు.

ఆత్మహత్య చేసుకొని చనిపోయిన రైతుల కుటుంబాలనే కాక , ఆత్మహత్యా ప్రయత్నం చేసి బ్రతికి బయటపడ్డ రెండు కుటుంబాలను కూడా కలిశాం. వార్తల్లోకెక్కిన వాళ్ళు నీళ్లలో తేలే చిన్న మంచు ముక్క లాంటివాళ్ళు. నీళ్లలో కనిపించని పెద్ద మంచు ముక్క ఇంకా అలాగే ఉంది.

డిమాండ్లు

 1. రైతు బీమా పొందిన వాళ్లకు కూడా అందిన సొమ్మంతా అప్పులకే పోయే పరిస్థితి వుంది. మృతుల కుటుంబాలు భవిష్యత్తులో నిలదొక్కుకోవడం కష్టంగానే ఉంది. కాబట్టి వారి ప్రైవేటు మరియు బ్యాంకు అప్పులను వన్ టైం సెటిల్మెంట్‌ లాగా చేసి మృతుల కుటుంబాలను అప్పులవాళ్ల వేధింపుల నుండి రక్షించాలి.
 2. రైతు బీమా రాని కుటుంబాల పరిస్థితి మరింత దయనీయంగా కనిపిస్తున్నది. ఈ కుటుంబాలకు తప్పనిసరిగా జీవో నెంబర్‌ 194ను అపై చేసి, వారి కుటుంబాలను ఆదుకోవాలి.
 3. రైతు ఆత్మహత్య కుటుంబాన్ని ఒక ప్రత్యేక కేటగిరీగా గుర్తించి, ప్రతీ కుటుంబంలోని భార్య లేదా భర్తకు కొన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా ప్రత్యేక పెన్షన్ సదుపాయం ఏర్పాటు చేయాలి.
 4. ఇటువంటి మరణాలు భవిష్యత్తులో చోటు చేసుకోకుండా పెద్దఎత్తున నివారణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
 5. కౌలు రైతులకు కూడా వాస్తవ సాగుదారులుగా గుర్తించే ఒక చట్టం చేసి, ఇప్పటివరకు రైతులకు ఇస్తున్న ప్రతి సహాయాన్నీ వారికి కూడా అందించాలి.
 6. వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారుల నిరంతర పర్యవేక్షణ, సేవలు రైతులకు అవసరమని తెలిసి కూడా ప్రభుత్వం తన బాధ్యత నెరవేర్చడం లేదు. ప్రస్తుతం ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారులను రైతులకు సలహాలు ఇవ్వటం కోసం కాకుండా గతంలో విఆర్వోలు చేసిన పనులకు ఉపయోగిస్తున్నారు. తక్షణమే పెద్దఎత్తున వ్యవసాయ మరియు ఉద్యానవన అధికారులను శాశ్వత ప్రాతిపదికన నియమించి, ప్రతి గ్రామంలోని రైతులకు నిరంతరం అందుబాటులో ఉంచాలి.
 7. కల్తీ పురుగుమందుల, విత్తన దుకాణాల దోపిడినీ, మోసాలనూ అరికట్టి అమాయక పేద రైతులను వీరి మోసాల బారిన పడకుండా చూడాలి.

సరైన దిగుబడి వచ్చినా, పంట అమ్మకాల సమయంలో కూడా రైతులు భారీగా నష్టపోతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, అకస్మాత్తుగా ప్రబలే వైరస్‌లు, పురుగులు రైతుల ప్రాణాలను నిరంతరంగా బలిగొంటూనే ఉన్నాయి. ఇప్పటికైనా మృతుల కుటుంబాలను ఆదుకోవడంతో పాటు ఇటువంటి మరణాలు భవిష్యత్తులో చోటుచేసుకోకుండా వ్యవసాయ విధానాన్ని పునఃసమీక్షించుకొని తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాం.

మానవహక్కుల వేదిక, తెలంగాణ
రైతు స్వరాజ్య వేదిక
13 మార్చి 2022

Related Posts

Scroll to Top