సల్లూరు మల్లేష్ ది కులోన్మాద హత్యే

హంతకులను కఠినంగా శిక్షించటంతో పాటు, కులోన్మాద హత్యలు, దాడుల నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తేవాలి

ఈనెల 17వ తేదీన జరిగిన జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం, కిషన్రావుపేట గ్రామానికి చెందిన సల్లూరి మల్లేష్ హత్య విషయంలో మానవ హక్కుల వేదిక బృందం ఈరోజు మృతుని కుటుంబాన్నీ, నిందితుల కుటుంబాలనూ మరియు పోలీస్ అధికారులనూ కలిసి వివరాలు సేకరించింది.

నేతకాని కులానికి చెందిన సల్లూరి మల్లేష్ అనే యువకుడు మరియు అదే గ్రామానికి చెందిన మున్నూరు కాపు యువతి గత ఆరు సంవత్సరాలుగా ప్రేమికులుగా పరస్పర సంబంధంలో ఉన్నారు. వారి వివాహానికి కులం అడ్డుగోడగా నిలిచింది. ఇదే విషయంలో మూడు సంవత్సరాల క్రితం సల్లూరి మల్లేష్ ను యువతి తండ్రి రాజిరెడ్డి మరియు బాబాయి మల్లారెడ్డిలు కలిసి గ్రామంలో విపరీతంగా కొట్టారు. ఆ విషయంలో రాజిరెడ్డి, మల్లారెడ్డిలపై అట్రాసిటీ కేసు నమోదయి, నడుస్తున్నది. అనంతరం అమ్మాయి చేత బలవంతంగా ఐదుసార్లు మల్లేష్ పై ఫిర్యాదు చేయించి, కేసులు మోపారు. కేవలం వాటి ఆధారంగానే మల్లేశ్ పై పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. అమ్మాయి మల్లేష్ తో తన పాత సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఆరు సంవత్సరాలుగా వీరి మధ్య ఉన్న సంబంధాన్నీ , అబ్బాయి తరచుగా అమ్మాయి ఇంటికి రావడాన్నీ గమనించినప్పుడు వారి మధ్య ప్రేమ ఏకపక్షం కాదని, ఇరువురి సమ్మతితోనే నడిచినట్లుగా భావించగలం. అలాగే మల్లేష్ పై గ్రామంలో ఎవరి నుండీ ఫిర్యాదులు లేవు. ఈ విషయంలో పోలీసులు అమ్మాయి తల్లిదండ్రులకు అనుకూలంగా ఉన్నట్టు అనుమానించాల్సి వస్తున్నది. మల్లేష్ నమోదు చేసిన అట్రాసిటీ కేసు ఈనెల 18వ తారీఖున ట్రయల్ కు వచ్చేది ఉంది. 17 వ తేదీన ఈ హత్య జరిగింది.

హత్య జరిగిన రోజు మల్లేష్ ను ఇద్దరు స్నేహితులుగా చెప్పబడే వ్యక్తులు అతన్ని ఇంటి నుంచి బయటకు తీసుకువెళ్లారు. ఆ తరువాత వెల్గటూరు బ్రిడ్జి వద్ద అతనిపై నైనాల రాజిరెడ్డి మల్లారెడ్డి, చింతల హరీష్ లు కలిసి తీవ్రంగా భౌతిక దాడి చేశారు. పరిసరాల ప్రజలు, రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు అడ్డుకోవడంతో, తీవ్రంగా గాయపడి ఉన్న మల్లేష్ ను ఆటోలో ఎక్కించుకొని, కోటిలింగాల క్రాస్ నుంచి లోపలికి తీసుకువెళ్లి, కత్తులతో పొడిచి చంపారు.

దృఢకాయుడైన మల్లేష్ ను వికలాంగుడైన రాజిరెడ్డితో పాటు మరో ఇద్దరు మాత్రమే చంపగలగటం నమ్మశక్యంగా లేదు. ఈ హత్యలో ఇతర వ్యక్తుల పాత్ర కూడా ఉందని మల్లేష్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం ముగ్గురినే హంతకులుగా చూపించారు.
ఇద్దరి కుటుంబ నేపథ్యాలను పరిశీలించినప్పుడు రెండూ పేద కుటుంబాలే. గ్రామస్తులందరికీ ఇరువురి ప్రేమ విషయం తెలిసిందే. అయినప్పటికీ కులపరమైన చాందసాన్ని వదులుకోలేని రాజిరెడ్డి, అతని సోదరుడి ఆధ్వర్యంలో జరిగిన ఈ హత్య కుల దురహరంకార హత్య తప్ప మరొకటి కాదు. కుల వ్యవస్థ సృష్టించిన అసమాన విలువల కారణంగా అన్యాయంగా ఒక యువకుని హత్య జరగటం, రెండు కుటుంబాలూ పూర్తిగా నాశనమవటం బాధాకరం. సామాజిక వివక్ష కారణంగా మనుషులను హత్యలు చేసే దుస్థితి ఇంకా కొనసాగటం నాగరిక సమాజానికి సిగ్గుచేటు.

మా డిమాండ్లు:

  1. మల్లేష్ హత్యలో స్వయంగా పాల్గొన్న నైనాల రాజిరెడ్డి, నైనాల మల్లారెడ్డి, చింతల హరీష్ లపైననే కాక, వారికి సహకరించిన వారి వివరాలను కూడా పోలీసులు పరిశోధించి, అందరిపై హత్యా , ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక కేసునూ నమోదు చేసి, తగిన శిక్ష పడేలా చూడాలి.
  2. కులోన్మాద హత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కుల వ్యవస్థ సృష్టించిన సామాజిక అంతరాల కారణంగా పెరుగుతున్న దాడులు, హత్యకాండలను అరికట్టటానికి ప్రభుత్వం ప్రత్యేకమైన చట్టం తేవాలి.
  3. మల్లేష్ మృతితో ఆ కుటుంబం పోషించే వ్యక్తిని కోల్పోయింది కాబట్టి మృతుని కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్ గ్రేషియాగా కనీసం 25 లక్షల రూపాయల మొత్తాన్ని అందించాలి.

ఈ నిజ నిర్ధారణ బృందంలో పాల్గొన్నవారు.

  • డా. ఎస్ తిరుపతయ్య (రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, 9849228212)
  • టి. హరికృష్ణ (రాష్ట్ర కార్యదర్శి )
  • జి. పద్మజ ( HRF సభ్యురాలు)
  • ఎండి. అన్వర్ ( HRF సభ్యులు)
  • యాత నగేష్ (HRF ఆదిలాబాద్ జిల్ కమిటీ సభ్యులు)
  • దుర్గం అమృత రావు (HRF అదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యులు)
  • పొన్నం రాజ మల్లయ్య (టిపిజేఏసీ నాయకులు)

20.07.2025,
వెల్గటూరు.

    Related Posts

    Scroll to Top