యు కొత్తపల్లి మండలం యండపల్లి జెడ్పీ హైస్కూల్లో దళిత విద్యార్థుల పట్ల కుల వివక్ష మరియు విద్యార్థులను కించపరిచేలా ఉపాధ్యాయులు మాట్లాడటాన్ని మానవ హక్కుల వేదిక ఖండిస్తోంది. ది. 06-12-2025 న సదరు సంఘటనల పై మానవ హక్కుల వేదిక నిజ నిర్ధారణ చేసింది. స్కూల్ ఉపాధ్యాయులతో పాటు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి విషయ సేకరణ చేసింది. ప్రధానోపాధ్యాయుడు సురేష్ భూషణ్ విద్యార్థులను కించ పరిచేలా మాట్లాడడం, అసభ్య పదజాలంతో దూషించడం, వారి తల్లిదండ్రుల వృత్తులను అవహేళన చేయడం చేసేవారని, ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు అయిన శ్రీనుబాబు విద్యార్థులను కులం పేరుతో దూషించేవారని మా నిజ నిర్ధారణలో తేలింది. విద్యార్థుల పట్ల వివక్ష తగదని, పిల్లలని తీర్చిదిద్దాల్సిన పాఠశాలల్లో వివక్షతలు పెంచి పోషించడం తగదని వేదిక బృందం అభిప్రాయపడింది. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అయిన జిల్లా కలెక్టర్ సదరు ఉపాధ్యాయులను డిప్యుటేషన్ పై వేరే పాఠశాలలకు పంపించడం ఈ ఘటనపై చట్టబద్ధ చర్యలు తీసుకోకుండా, ప్రక్కదారి పట్టించేదిగా కనిపిస్తోంది.ఈ సంఘటనపై రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా, అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని, కుల వివక్ష చూపిన శ్రీనుబాబుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యకులు మొహమ్మద్ ఇక్బాల్, జిల్లా కార్యవర్గ సభ్యులు పి పవన్, పి సూర్య పాల్గొన్నారు.
మహమ్మద్ ఇక్బాల్
మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యకులు
యండపల్లి,
06-12-2025.