డేటా సెంటర్: సమాజానికి, పర్యావరణానికి విపత్తు

గూగుల్- అదానీ డేటా సెంటర్‌ను విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలలో ఏర్పాటు చేస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో రానున్న ఈ సెంటర్ నిర్మాణానికి అన్ని సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగాల కల్పన, హరితాభివృద్ధి, డిజిటల్ పురోగతివంటి ఆశలను ప్రజలలో ప్రభుత్వం రేకెత్తిస్తోంది. ఈ హామీలలో ఏమాత్రం వాస్తవం లేదు. పైపెచ్చు ఈ ప్రాంతంలో అనేక పర్యావరణ, ఆర్థిక విపత్తులకు ఈ ప్రాజెక్టు కారణమవుతోంది. సాంకేతిక పురోగతి పేరుతో ఈ సెంటరు పెద్ద ఎత్తున ప్రజా వనరులను కైంకర్యం చేయడమే కాక శాశ్వతంగా పర్యావరణ వినాశనానికి దారి తీస్తుంది. అలాగే వనరులనన్నిటినీ కార్పొరేట్లకు కట్టబెట్టే విధానాన్ని బలోపేతం చేస్తుంది.

గూగుల్- అదానీలకు ఈ రెండు జిల్లాల్లో మూడు చోట్ల ఒక గిగావాట్(GW) అంటే 1000 మెగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్ సముదాయన్ని ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ ఏర్పాటు చేసే ఆప్టికల్-ఫైబర్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌ ఒకటి దీనికి జతకలుస్తుంది. ఈ ప్రాజెక్టుల నిర్మాణం కోసం విశాఖపట్నం జిల్లాలోని తర్లువాడలో 200 ఎకరాలు; అడవివరం, ముడసర్లోవ గ్రామాలలో 120 ఎకరాలు; అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి వద్ద 160 ఎకరాలు వెరసి 480 ఎకరాలు కేటాయిస్తూ 2025 అక్టోబరు 11న జీఓఎమ్ఎస్ నం–40ను జారీ చేసింది.

భారీ జల, విద్యుత్తు వినియోగం- కాలుష్యం..

ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా భారీ డేటా సెంటర్లు జల, విద్యుత్తు వనరులను కొల్లగొట్టేవిగా పేరుగాంచాయి. వీటి శీతలీకరణ, నిర్వహణల కోసం ఏటా బిలియన్ల లీటర్ల నీరు ఖర్చవుతుంది. భూగర్భజలాల కొరత, అనిశ్చిత వర్షపాతం, వాతావరణ అస్థిరతల కారణంగా ఇప్పటికే విశాఖపట్నం తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. సహజంగా వేడి, ఉక్కబోత ఎక్కువగా ఉండే విశాఖపట్నతీర వాతావరణంలో ప్రతిపాదిస్తున్న ఈ సముదాయ శీతళీకరణకు నీటిని ఇతోధికంగా వినియోగించాల్సి వస్తుంది. ఫలితంగా, భూగర్భ జలాలు తగ్గిపోయి నీటి ఎద్దడి మరింత తీవ్రమై స్థానిక ప్రజల నీటి అవసరాలకు గండి పడుతుంది. ఈ తరహా సముదాయాలు పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్నాయని ఇతర దేశాల అనుభవాలు వెల్లడి చేస్తున్నాయి. ఉరుగ్వేలోని గూగుల్ డేటా సెంటరు దీనికి ఉదాహరణ.

ఈ సముదాయం స్థానికులకు ఏ రకమైన ప్రయోజనాన్నీ చేకూర్చకపోగా, తరచుగా రసాయన విషవ్యర్థాలను, గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేస్తోంది. ఈ తీరును గమనిస్తే ప్రతిపాదిత గూగుల్ సెంటరు విడుదల చేసే వ్యర్థాలు, రసాయనాలు ఇక్కడి జలవనరులను కలుషితం చేస్తాయనడంలో సందేహం లేదు.ఇక్కడ ఆందోళన కలిగించే మరో ముఖ్యమైన అంశం విద్యుత్ వినియోగం. ఒక గిగావాట్ సామర్థ్యం కలిగిన ఇటువంటి సెంటర్ ఏదైనా కూడా విద్యుత్తును భారీగా వినియోగిస్తుంది. అది లక్షలాది ఇళ్లతో కూడిన ఒక మధ్య తరహా నగరం వినియోగించే విద్యుత్తుతో సమానం. ప్రతిపాదిత సదుపాయం వల్ల ఇప్పటికే అధిక విద్యుత్తు భారంతో ఉన్న విశాఖపట్నం పవర్ గ్రిడ్‌ల మీద మరింత భారం పడుతుంది. ఈ అత్యాధునిక సదుపాయం వందశాతం పునరుత్పాదక విద్యుత్తుతో నడుస్తుందని గూగుల్ చేసిన వాదనలో సత్యం లేదు.

సాంకేతికంగా కూడా అది అసాధ్యమైన పని. శిలాజ ఇంధన ప్రత్యామ్నాయం(backup) లేకుండా రాష్ట్ర గ్రిడ్ నిరంతరాయంగా పునరుత్పాదక విద్యుత్తును సరఫరా చేయలేదు. వినియోగం గరిష్ట స్థాయిలో ఉన్న సమయంలో శిలాజ ఇంధన సహకారం కావాల్సిందే. అటువంటప్పుడు ఈ ప్రాజెక్టును ‘హరిత’ అనటంలో ఔచిత్యం కనపడదు. నిజానికి, ఇంత పెద్ద డేటా సెంటర్లు తమ విద్యుత్తు అవసరాలకు శిలాజ ఇంధనంపైనే ఎక్కువగా ఆధారపడతాయి. దానివల్ల ప్రపంచ పర్యావరణ లక్ష్యాలను వెనక్కి నెట్టే పరిమాణంలో కార్బన్ వాయువులు వెలువడి వాతావరణం కాలుష్యపూరితం అవుతుంది.

అనేక దేశాలలో ప్రజల ఆందోళనలు..

పర్యావరణం, ఇంధనం, నీటి సమస్యల కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రజా సమూహాలు డేటా సెంటర్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉద్యమించాయి. వీటిలో చాలా వరకు విశాఖపట్నం, అనకాపల్లిలలో ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టు కంటే చాలా చిన్నవి. కొద్ది నెలల క్రితమే, ప్రజల ప్రతిఘటన కారణంగా ఇండియానా పోలీసు, బెర్లిన్‌లలోని డేటా సెంటర్ల ప్రతిపాదనలను గూగుల్ వెనక్కితీసుకోవాల్సి వచ్చింది. డిజిటల్ పురోగతనే వాగాడంబరం చాటున ఈ సెంటర్లు పర్యావరణానికీ, ప్రజలకూ చేసే చేటును ప్రపంచవ్యాప్తంగా ప్రజలు గుర్తించడాన్ని ఈ ఆందోళనలు సూచిస్తున్నాయి.

తీవ్ర ప్రజావ్యతిరేకత కారణంగా టెక్ దిగ్గజాలు అమెరికా, యూరప్‌లలో తమ డేటా సెంటర్ ప్రాజెక్టులను మూసివేశాయి, లేదా వాటి సామర్థ్యాలను బాగా తగ్గించుకున్నాయి. తన డేటా సెంటర్ ప్రణాళికలను బలహీనమైన పర్యావరణ నియమాలు, రాజకీయ వ్యవస్థలు ఉన్న గ్లోబల్ సౌత్‌కు గూగుల్ తరలించినట్లు కనిపిస్తోంది.

డేటా సెంటర్ల పరిసరాల్లో నివసిస్తున్న ప్రజలు నీటి కొరత, నిరంతర శబ్ద కాలుష్యంతో పాటు, పెరుగుతున్న విద్యుత్ ఖర్చుల గురించి ఫిర్యాదు చేస్తున్నారు. ఉదాహరణకు, తెలంగాణలోని మేకగూడ గ్రామంలో మైక్రోసాఫ్ట్ నిర్మిస్తున్న 100 మెగావాట్ల డేటా సెంటర్ తమ గ్రామానికి చెందిన గ్రామ కంఠాలను ఆక్రమించిందనీ, గ్రామ సమీపంలోని తుంగకుంట సరస్సులో పారిశ్రామిక వ్యర్థాలను వదిలి నీటిని కలుషితం చేసిందనీ ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పశువులు, పంటలు నష్టపోయేటట్టు చేయటమే కాక తమ జీవనోపాధిని దెబ్బతీసిందని ఆవేదన చెందుతున్నారు.

తుఫానులకు గురయ్యే, సున్నిత వాతావరణం ఉన్న తీరప్రాంతం వెంబడి విశాఖపట్నం ఉంది. మధురవాడ కొండలు, దాని ప్రక్కనే ఉన్న లోతట్టు ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపార దుష్ఫలితాల జాడలు కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంటాయి. ఈ పచ్చని అటవీప్రాంతం సహజత్వం కోల్పోయింది. అక్కడ సహజ నీటి పారుదల వ్యవస్థ దెబ్బతింది. అలాంటి ప్రదేశంలో తిరిగి విద్యుత్తును పెద్దఎత్తున వినియోగించే, వాతావరణ ఉష్ణోగ్రతను పెంచే సముదాయాన్ని ఏర్పాటు చేయడం అంటే పర్యావరణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయటమే. మనకు తెలిసినంతవరకు, ఈ ప్రాజెక్టుకు సంబంధించి సంచిత పర్యావరణ ప్రభావ అంచనా(EIA) నివేదికను ప్రజల ముందు పెట్టలేదు.

రాష్ట్ర స్థాయి నిపుణుల అంచనా కమిటీ ఇచ్చిన ‘క్లియరెన్స్’ ఎటువంటి గణనీయమైన మూల్యాంకనం లేకుండానే ఇచ్చినట్లు కనిపిస్తోంది. పర్యావరణ సున్నితత్వం, ప్రజలకు జవాబుదారీ తనం వంటి విలువలు పాటించని రబ్బరు స్టాంపు అధికారగణతత్వ సరళే ఇక్కడా కొనసాగిందని అర్థమవుతోంది.

డేటా సెంటర్ క్యాంపస్ కోసం ఎక్కడెక్కడ ఎంత భూమిని కేటాయించాలో, ఎవరెవరి భూమిని సేకరించాలో గుర్తించడం కోసం ప్రభుత్వం అవలంబించిన విధానంలో పారదర్శకత కొరవడింది. అస్పష్టమైన, రహస్య విధానాలను అవలంబిస్తున్నారు. మధ్యవర్తులు, స్థానిక అధికారులు ఈ ప్రాంతాలలోని రైతులను, చిన్నకమతాల యాజమానులను వారి భూములను ‘స్వచ్ఛందంగా’ వదులుకోవాలంటూ బలవంతం చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. స్థానిక ప్రజలతో అర్థవంతమైన సంప్రదింపులు జరపకపోవడం విచారకరం. ఆదరాబాదరాగా ప్రాజెక్ట్ ప్రకటన, దాని ఆమోదం జరిగిన తీరును గమనిస్తే ఈ ప్రక్రియలో స్థానిక ప్రజల సమ్మతినీ, నిర్ణయాల్లో ప్రజలు భాగస్వాములు కావాల్సిన అవసరాన్నీ విస్మరించినట్టు, అధికార నిర్ణయాలకే పెద్దపీట వేసినట్టు కనిపిస్తోంది.

ఉద్యోగాల కల్పన అసత్యం..

పోనీ ప్రభుత్వం చెబుతున్నట్టు ఈ ప్రాజెక్టు ఆర్థిక ప్రయోజనాలనేమన్నా ఒనగూరుస్తుందా అంటే అదీ లేదు. భారతదేశాన్ని ‘డిజిటల్ హబ్’గా మార్చే దిశలో ఒక అడుగుగా గూగుల్ దీనిని అభివర్ణిస్తున్నప్పటికీ, దీని నుంచి అది తీసే లాభాలు స్థానిక ప్రజలకు కాకుండా బహుళజాతి వాటాదారులకే చేరుకుంటాయన్నదే నిజం. ఈ ప్రాజెక్టు వేలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. వాస్తవానికి, డేటా సెంటర్లు అత్యంత ఆటోమేటెడ్ విధానాలతో పనిచేస్తాయి. ఒకసారి పూర్తిగా దాని నిర్వహణ మొదలుకాగానే అది సృష్టించే దీర్ఘకాల ఉద్యోగాలు కేవలం వందలలోనే ఉంటాయి. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం కలిగినవారే ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎక్కువగా బయటివారికే దక్కుతాయి. స్థానికులకు వచ్చే ఉద్యోగాలు తాత్కాలికమైనవి, పెద్దగా నైపుణ్యం లేనివి. సదుపాయాల నిర్మాణం, వాటి సాధారణ నిర్వహణ వంటి పనులకే అవి పరిమితం.

ఇక వీటి ద్వారా పరోక్షంగా ఉద్యోగ కల్పన జరుగుతుందన్న మాట కూడా పూర్తిగా అవాస్తవం. డేటా సెంటర్లు అత్యాధునిక సాంకేతికతో మానవ ప్రమేయం లేకుండానే వాటంతటవి నడుస్తాయి. ఒక చీకటి గదిలో మనుషులు లేకుండానే తామంతటవి పనిచేసుకుపోయే కంప్యూటర్ల సముదాయం – ఒక కంప్యూటర్ల గిడ్డంగి అన్నమాట. వీటికి ఎక్కడో ఏదో దేశంలో ఉంటూ రిమోట్‌గా నడపవచ్చు. స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఈ సెంటర్లు చేసే మేలు సున్నా. ఈ డేటా సెంటర్ వల్ల విశాఖపట్నం, అనకాపల్లిలకు ఒనగూరేదల్లా ఇంధన భారం, కాలుష్యం, భూనష్టం, సామాజిక విస్థాపన. దీని ఆర్థిక ప్రయోజనాలు చేకూరేది స్థానికులకు కాదు. అవి ఎక్కెడెక్కడో ఉన్న ప్రపంచ పెట్టుబడిదారులకు, మౌలిక సదుపాయాల కంపెనీలకు, కార్పొరేట్ చైన్ ద్వారా వ్యాపారాలు చేసే సంస్థలకు మళ్ళిపోతాయి.

గూగుల్ స్వయంగా లౌడౌన్ కౌంటీ, వర్జీనియా గురించిన డేటా సెంటర్లపై ప్రకటించిన ‘డేటా సెంటర్ ఇంపాక్ట్ రిపోర్ట్ 2023’ ఈ తీవ్ర అసమానతలను నొక్కి చెప్తోంది. యాష్‌బర్న్, లీస్‌బర్గ్‌లలో ఉన్న తమ రెండు డేటా సెంటర్లు మొత్తం కలిసి ప్రత్యక్షంగా కేవలం 400మందికి మాత్రమే ఉపాధి కల్పిస్తుండగా; దాదాపు 3,100 పరోక్ష ఉద్యోగాలను కల్పించాయని గూగుల్ తన నివేదికలో పేర్కొంది. భారీ పెట్టుబడి – స్వల్ప స్థాయిలో ఉద్యోగాలు! ఈ గణాంకాలు వెల్లడి చేస్తున్న విషయం యిదే.

అదేవిధంగా, మేటా సంస్థ లూసియానాలోని రిచ్‌ల్యాండ్ పారిష్‌లో పది బిలియన్ డాలర్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్న రెండు గిగావాట్ల ఏఐ డేటా సెంటర్- నిర్వహణ మొదలయ్యేసరికి కేవలం 500 శాశ్వత ఉద్యోగాలను మాత్రమే సృష్టించగలదని అంచనా.

పన్ను మినహాయింపులు, భూమి, రాయితీ సుంకాలు; ఇరవై ఏళ్లపాటు గూగుల్ డేటా సెంటర్ వారికి నీరు, విద్యుత్తు, మౌలిక సదుపాయాలపై జరిగే రూ 22,002 కోట్ల ఖర్చు వాపసులతో ఒక ఉదారమైన ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కార్పొరేట్లకు ప్రసాదించే ఇటువంటి కానుకల వల్ల ఆరోగ్య సంరక్షణ, విద్య, గ్రామీణాభివృద్ధి వంటి ముఖ్యమైన రంగాలకు కేటాయించే అరుదైన ప్రజా వనరులు దారి మళ్లి, ఆ ప్రాంత సమానాభివృద్ధి హక్కును దెబ్బతీస్తాయి.

నిరుద్యోగ యువత అధికంగా ఉన్న విశాఖపట్నం వంటి ప్రాంతంలో, ప్రభుత్వ పెట్టుబడులు స్థానికులకు జీవనోపాధిని కల్పించే సమ్మిళిత పరిశ్రమలను నిర్మించే దిశగా ఉండాలి. స్థానిక సమూహాల ఆర్థిక, సామాజిక స్థితుల్లో వికాసాన్నితెచ్చేవిగా, సమూహాల ఆర్థికపటుత్వాన్ని పెంచేవిగా ఉండాలి. అంతేగాని, ప్రభుత్వ పెట్టుబడులనేవి సమాజంలో అసమానతలను తీవ్రంగా పెంచే వనరుల భోక్తల కోసం కాదు.

ఈ వాస్తవాలతో పాటు డిజిటల్ స్వావలంబన గురించి కూడా తర్కించుకోవడం అవసరం. ఇంత భారీ గూగుల్ సౌకర్యాన్ని స్థాపించటంతో రాష్ట్ర పాలన, సంక్షేమం, భద్రతా సమాచారం సహా కీలకమైన డిజిటల్ మౌలిక సదుపాయాలన్నీ బహుళజాతి సంస్థ వారి ప్రైవేట్ నెట్‌వర్క్‌ చేతుల్లోకి పోతాయి. రాష్ట్ర ప్రజల డేటా, క్లౌడ్ సేవలు, ఏఐ మౌలిక సదుపాయాలపై నియంత్రణ కార్పొరేట్ చేతుల్లో కేంద్రీకృతమవుతుంది. అంటే ప్రభుత్వ వ్యవస్థలకు వెన్నెముకగా నిలిచే సమాచార వ్యవస్థలన్నీ లాభార్జనే ధ్యేయంగా ఉన్న కార్పొరేట్ల చేతుల్లోకి పోతాయి. ప్రజలపట్ల జవాబుదారీతనం, గోప్యత, ప్రజాస్వామ్యమనేవి ప్రమాదంలో పడతాయి. ప్రభుత్వాలు ప్రజలకు అవసరమైన సేవలను అందించడానికి క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌లపై ఎక్కువగా ఆధారపడుతున్నఈ కాలంలో గూగుల్‌కు మౌలిక సదుపాయాల నియంత్రణను అప్పగించడం అంటే రాష్ట్ర స్వయంప్రతిపత్తికీ, పౌరుల డిజిటల్ హక్కులకూ ఎంతో హాని కలిగించటమే.

అంతేకాకుండా, భారీ టెక్ కంపెనీల వల్ల మానవహక్కులకు జరిగే హాని మరింతగా పెరగడానికి ఈ ప్రాజెక్టు కారణమవుతుంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొన్నట్టు, కార్పొరేట్ల చేతుల్లో డిజిటల్ పవర్ కేంద్రీకరణ బలహీన, నిస్సహాయ సమూహాలపై విస్తృతమైన నిఘాకు, డేటా దోపిడీకి దారితీస్తుంది.

ప్రజల గోప్యత మీద వ్యవస్థీకృత దాడులు పెరుగుతాయి. ఇంత భారీ డేటా, ఏఐ హబ్ పెద్దెత్తున ప్రజల వ్యక్తిగతమైన, ప్రవర్తనాపరమైన సమాచారాన్ని ప్రాసెస్ చేయగలదు. సాధారణంగా ఏదైనా సమాచారం ప్రాసెస్ చేసి ఫలితం(output)రాబట్టడానికి ఏఐకు శిక్షణ ఇస్తారు. ఏఐకు ఇచ్చే శిక్షణకు వినియోగించిన సమాచారంలో వివక్ష ఉన్నా, కృత్రిమ మేధ గ్రహింపులో లోపాలున్నా, అది వివక్షాపూరిత ఫలితాలకు దారి తీస్తుంది. వీటిని ‘అల్గారిథమిక్ బయసెస్’ అంటారు.

గూగుల్ తరహా ఏఐ హబ్‌లు ఇటువంటి బయసెస్‌లకు కారణమవుతాయి. అవి భారతదేశంలో కుల, లింగ, మతపరమైన వివక్షను శాశ్వతం చేస్తాయి. డిజిటల్ అంతరాలు విస్పష్టంగా ఉన్న మన దేశంలో తమ సమాచారాన్ని(కార్పొరేట్లు) ఎలా వినియోగిస్తున్నాయో, ఆ సమాచారం ఎలా వ్యాపారమవుతుందో ప్రజలకు అవగాహన లేదు. ఆ డేటా మీద వారికి ఎటువంటి స్వీయ నియంత్రణా లేదు. ఇది అసమానతలను మరింత విస్తృతం చేస్తుంది.

ఉపశమన చర్యలు, రక్షణ/భద్రతలు, జవాబుదారీతనం వంటి వివరాలేవీ లేకుండానే ఆర్భాటాల నడుమ గూగుల్- అదానీ వారితో జరిగిన ఈ అపారదర్శక ఒప్పందం టెక్ దిగ్గజాల రహస్య కార్యకలాపాలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న అసంతృప్తిని సూచిస్తోంది.

ప్రధానంగా ఈ ప్రాజెక్టు పట్ల మనకుండాల్సిన వ్యతిరేకత ఏమిటంటే అది కలిగించే పర్యావరణ, సామాజిక ప్రమాదాలు. ప్రజలు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, సమతుల్యమైన వాతావరణంలో జీవించాలన్న ప్రాథమిక హక్కును అది ఉల్లంఘిస్తోంది. అంతర్జాతీయ చట్టాల్లో, మన న్యాయశాస్త్రంలో ఈ హక్కును స్పష్టంగా పేర్కొన్నారు.

గూగుల్ ప్రతిపాదించిన డేటా సెంటర్ సముదాయం అభివృధ్ధిని సూచించడం లేదన్న మాటలో అతిశయోక్తి లేదు. ‘హరిత వికాసం’, ‘డిజిటల్ పరిణామం’ అనేవి ఉత్త వాగాడంబరం కోసం వాడుతున్నవే. నిజానికి ఇది విశాఖపట్నం మీద విరుచుకు పడబోతున్న సామాజిక, పర్యావరణ విపత్తును సూచిస్తుంది. గత కొద్ది కాలంగా జరుగుతున్న భారీ ప్రభుత్వ ప్రచారం వెనుక ఉన్న వాస్తవాలు ఏమిటంటే- ఇక్కడ జరిగే భూకబ్జా, పర్యావరణ విధ్వంసం, కార్పొరేటు భోక్తల వనరుల కైంకర్యం.

వికేంద్రీకరణ, సమ్మిళితత్వం, స్థానిక స్వయంప్రతిపత్తిలతో కూడిందే నిజమైన సాంకేతిక పురోగతి. అంతా తమ గుప్పెట్లో పెట్టుకుని విధ్వంసకర దోపిడి చేసే‘బిగ్ టెక్’ ఆధిపత్యంలో సాంకేతిక అభివృద్ధి ఉండకూడదు. అంతేకాకుండా, గూగుల్ ఏమీ ‘తటస్థ సాంకేతికత సంస్థ’ కాదు. గూగుల్ వారి ప్రాజెక్ట్ నింబస్, ఇజ్రాయెల్ సైన్యంతో చేసుకున్న క్లౌడ్- ఏఐ ఒప్పందాల ద్వారా గాజాలో పాలస్తీనియన్లపై జరుగుతున్న మారణహోమంలో క్రియాశీలకంగా పనిచేస్తోంది.

గాజా సామూహిక హత్యాకాండలో ఉపయోగించిన నిఘా, లక్ష్య, లాజిస్టికల్ సామగ్రికి గూగులే సామర్ధ్యాన్నిచ్చింది. ఇది కార్పొరేట్ నీతి అనే ముసుగు కూడా తీసేసి ఒక జాతి విధ్వంస ప్రచారంలో పూర్తిగా మునిగిపోయింది.

గాజా కరువుతో విలవిలలాడుతుంటే గూగుల్ గాజాలో “ఆహారం ఉంది” అనే తప్పుడు ఇజ్రాయెల్ ప్రభుత్వ ప్రచార ప్రకటనలను యూట్యూబ్లో అనుమతించింది. దీని సాంకేతికత వర్ణవివక్షను పెంచుతుంది; ఆకలిని, జాతి నిర్మూలనను కప్పిపుచ్చుతుంది; అల్గారిథంలను తోడుదొంగలుగా మార్చుకొని సత్యం గొంతు నొక్కుతుంది. ఒక పక్క గాజా కాలిపోయి, ఆకలితో అలమటిస్తుంటే, గూగుల్ దాని లాభాలను లెక్క పెట్టుకునే పనిలో వుంది. దాని సాంకేతికత మారణహోమ యంత్రాంగానికి భాగస్వామి.

అదానీ సంస్థ కూడా ఈ క్రూరమైన యుద్ధ ఆర్థిక వ్యవస్థలో పాలు పంచుకుంటున్నది. ఇజ్రాయెల్ సైనిక మౌలిక సదుపాయాల కల్పనతో ముడిపడి ఉన్న, అతి పెద్ద ప్రైవేట్ ఆయుధ తయారీదారైన ఎల్బిట్ సిస్టమ్స్‌తో జాయింట్ వెంచర్లో అదానీ సంస్థ ఉంది.

పారదర్శకతతో, ప్రజల భాగస్వామ్యంతో చట్టబద్ధమైన సమీక్ష చేపట్టే వరకు విశాఖపట్నం- అనకాపల్లి జిల్లాల్లో ప్రతిపాదిత గూగుల్ డేటా సెంటర్ కోసం చేసే భూసేకరణనూ, అలాగే పర్యావరణ క్లియరెన్స్ ప్రక్రియలనూ వెంటనే నిలిపివేయాలి. అలాగే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని ఎంఓయూలు, విద్యుత్, నీటి కేటాయింపు ఒప్పందాలు, అసెస్మెంట్లు, పరిహార నమూనాలు, పర్యావరణ ప్రభావ నివేదికలు సహా అన్ని పత్రాలను ఆలస్యం లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంచాలి. నిజమైన పురోగతి అనేది పారదర్శకత లేని విధానాలు, కార్పొరేట్ కుమ్మక్కులపై కాకుండా ప్రజాస్వామ్య పద్ధతులు, సమానత్వం, పర్యావరణ న్యాయం, ప్రజల హక్కుల పట్ల గౌరవంతో కూడిన సమ్మిళిత అభివృద్ధి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.

Y. RAJESH
V.S KRISHNA
HUMAN RIGHTS FORUM

Related Posts

Scroll to Top