రియాజ్ ఎన్కౌంటర్ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి

అక్టోబర్ 20, ఉదయం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కానిస్టేబుల్ తుపాకీ గుంజుకుని, అతనిపై తిరగబడ్డాడనే పేరుతో షేక్ రియాజ్ ని పోలీసులు చంపేయటం బూటకపు ఎన్ కౌంటర్ మాత్రమే కాక, ఇది తెలంగాణా పోలీసు శాఖలో పెరుగుతున్న హింసాప్రవృత్తికి నిదర్శనం.

ఈ నెల 17వ తేదీ శుక్రవారం రోజున తరచుగా బైకులు, చైన్ స్నాచింగ్ లాంటి దొంగతనాలు చేసే షేక్ రియాజ్ ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించే క్రమంలో అతను బైక్ నడుపుతున్న కానిస్టేబుల్ ప్రమోద్ ను పాశవికంగా కత్తితో పొడిచి, అక్కడి నుండి పారిపోయాడు. ఊహించని ఈ దాడి కారణంగా కానిస్టేబుల్ దాదాపు అక్కడికక్కడే చనిపోయాడు. ఆ కానిస్టేబుల్ న్యాయంగా డ్యూటీ నిర్వహిస్తుండగా, అతనిపై జరిగిన దాడిలో చనిపోవటం చాలా బాధాకరం. ఇది అందర్నీ నిర్గాంతపరిచిన విషయం. హంతకునికి అందుకుగానూ ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. అయితే ఆ శిక్షను ఎవరు అమలు చేయాలనేదే నాగరిక సమాజంలో కీలకమైన విషయం.

నిందితుడు ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్ష నుండి తప్పించుకోకుండా పోలీసులు తగిన సాక్ష్యాధారాలతో అతని నేరాన్ని నిరూపించి, చట్ట ప్రకారం కోర్టు ద్వారా శిక్ష పడేలా చేయటానికి ఇక్కడ పూర్తి అవకాశాలున్నాయి. చట్టాన్నీ, రాజ్యాంగాన్నీ, కోర్టులనూ గౌరవించే వ్యవస్థలు వాస్తవంగా ఆ పని చేయాలి. కానీ, అలా కాకుండా పోలీస్ వ్యవస్థ రియాజ్ ను హత్య చేయాలని ముందే నిర్ణయించుకున్నట్టుగా అనిపిస్తున్నది. నిన్న ఉదయం, రియాజ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత, నుండే రియాజ్ ను ‘ ఎన్కౌంటర్ ‘ చేశారనే వార్తలు వచ్చాయి. స్వయంగా నిజామాబాద్ సీపీ కల్పించుకొని (ఇప్పటివరకు) ఎన్కౌంటర్ జరగలేదని చెప్పాల్సి వచ్చింది. ఇవ్వాళ ఉదయం ‘ ఎన్ కౌంటర్ ‘ జరిగిందట. ఇది పూర్తిగా ముందస్తు పథకం ప్రకారమే పోలీసుల మీద మరొకరు తిరుగుబాటు చేయకుండా, రియాజ్ ఉదంతం ఒక బెదిరింపుగా ఉండాలని చేసిన కౌంటర్ హత్య అని మా అనుమానం. తెలంగాణ పోలీసుల మానసిక వైఖరీ, వారి ‘ఎన్ కౌంటర్ల చరిత్ర‘ లే ఇందుకు ఆధారాలు.

ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు అంటే తెలియని సామాన్య ప్రజలు ఈ విషయంలో పోలీసులకు వత్తాసు పలుకుతుండవచ్చు గాక. కానీ, ఒక సమాజం నియమబద్ధంగా నడావాలా లేక, కంటికి కన్ను, పంటికి పన్ను అనే ఆటవిక సమాజంలాగా నడవాలా అనేది మెజారిటీ మద్దతు ఉందనే పేరుతో సమర్థించుకునే వ్యవహారం కాదు.

ఒక ఆసుపత్రి నాలుగవ అంతస్తులో, చుట్టుపక్కల వేరెవరు రోగులూ, వారి బంధువులూ లేకుండా ఉంచిన గదిలో జరిగిన ఈ హత్య నిజమైన ఎన్ కౌంటర్ కాదని, బూటకపు ఎన్కౌంటర్ అని నిరూపించడానికి మృతుని బంధువులకు గానీ, హక్కుల సంఘాలకు గానీ, స్వచ్ఛంద సంస్థలకు గానీ ఎటువంటి అవకాశం ఉండదు. కాబట్టి రూల్ ఆఫ్ లాను, కోర్టులను, రాజ్యాంగ నియమాలని కాపాడటమా లేక ‘ వారిలో ఒక మనిషి చనిపోతే వారు ఊరుకుంటారా?‘ అని సరిపెట్టటమా అనేది ఈరోజు ప్రభుత్వం ముందూ, రాష్ట్ర, జాతీయ మానవ హక్కుల కమిషన్ల ముందూ, హైకోర్టు, సుప్రీంకోర్టుల ముందూ ఉన్న ప్రశ్న.

  1. మేము హైకోర్టును మరియు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ను ఈ ఎన్కౌంటర్ను సుమోటోగా తీసుకొని, విచారణ జరిపి , చట్ట ఉల్లంఘనదారులు ఎంతటి వారైనా, వారికి శిక్షలు పడేలా చేయాలని కోరుతున్నాం.
  2. ఈ ఎన్ కౌంటర్ పై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి చేత విచారణ జరిపించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము.
  3. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులను తక్షణమే సస్పెండ్ చేసి వారిపై హత్యా నేరం మోపాలి.
  4. రియాజ్ చేతిలో మరణించిన ప్రమోద్ కుటుంబానికి మా హృదయపూర్వక ప్రగాఢ సానుభూతి.

ఆత్రం భుజంగరావు, రాష్ట్ర అధ్యక్షులు
డాక్టర్ ఎస్. తిరుపతయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

20.10.2025,
మానవ హక్కుల వేదిక , తెలంగాణ.

Related Posts

Scroll to Top