అప్పాయిపల్లి అసైన్డ్ భూమిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలి

వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం  అప్పాయి పల్లి గ్రామంలో ఏర్పాటు చేయ తలపెట్టిన మెడికల్ కాలేజీ కోసం పేద, బలహీన వర్గాల భూములను స్వాధీనం చేసుకోవడంలో తలఎత్తిన వివాదం నేపథ్యంలో ఈ రోజు మానవ హక్కుల వేదిక రాష్ట్ర కమిటీ అప్పాయి పల్లి గ్రామంలోని బాధితులను కలిసి వివరాలు సేకరించింది.

కొడంగల్ మండలం అప్పాయి పల్లి గ్రామంలో సర్వేనెంబర్ 19 లోని 75 ఎకరాల భూమిని 1972 ప్రాంతంలో 47 కుటుంబాలకు జీవనాధారంగా అసైన్డ్ పట్టాలు అందజేయడం జరిగింది. ఆ రోజు సాగుకు అనుకూలంగా లేకుండా,  బండలు, రాళ్లు, రప్పలతో కూడిన ఆ భూములను కొన్నేళ్ల పాటు కష్టపడి, సాగు యోగ్యం చేసుకొని, మూడు తరాలుగా జీవనాధారం పొందుతున్నారు. ఆ భూముల్లో బోర్లు, బావులు వంటి వ్యక్తిగత సాగునీటి సౌకర్యాలు కల్పించుకొని ఆ భూమే ఏకైక జీవనాధారంగా ఈరోజు దాదాపు 150 కుటుంబాలు బ్రతుకుతున్నాయి.    

ముఖ్యమంత్రి గారు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో కొడంగల్ లో మెడికల్ కాలేజీ ఏర్పాటు ప్రతిపాదన చేశారు. ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటం కోసం మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలనే ఆలోచనే పెద్ద తప్పు. మెడికల్ కాలేజీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు గానీ, విద్యార్థులకు గానీ ఎటువంటి ప్రయోజనం జరగదు.  ఇప్పటికే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు  అశాస్త్రీయంగా పెంచబడి ఉన్నాయి. ఇంకా అదే విధంగా, రాజకీయ అవసరాల కోసం మెడికల్ కాలేజీలను పెంచుకోవటం అనే విధానాన్ని వదిలివేయాలి. ఈ ప్రాంత ప్రజలకు వైద్యం అందుబాటులోకి రావాలంటే నిమ్స్ లాంటి ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కట్టి, ఆ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావచ్చు.

ఇక, మెడికల్ కళాశాల నిర్మించాలనుకున్నా, ఆసుపత్రి నిర్మించాలనుకున్నా దానికి పేద, బలహీన వర్గాల పొట్టని కొట్టాల్సిన అవసరం లేదు. కొడంగల్ పరిసరాల్లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి వివిధ సర్వే నెంబర్లలో అందుబాటులో ఉంది. అప్పాయి పల్లి శివారులో 198 సర్వే నెంబర్లో 50 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. పలుగురాళ్ల తండాలోని 450వ సర్వే నెంబర్లో 250 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది అని స్థానిక ప్రజలు సమాచారం ఇస్తున్నారు.  అది కాకుండా, సీలింగ్ చట్ట పరిధి దాటిన వందల ఎకరాల భూమి ఇంకా బినామీ పేర్లతో భూస్వాముల చేతుల్లో ఉంది. ఇవన్నీ వదిలేసి అత్యంత కడగొట్టు జీవితం గడుపుతున్న 150 కుటుంబాల జీవనాధారమైన భూమిని లక్ష్యంగా చేసుకోవటం అనేది ప్రభుత్వ పెద్దలు ఆలోచించి చేసినా, అనాలోచితంగా చేసినా అది చాలా హేయమైన చర్య అవుతుంది. కాబట్టి ఈ అసైన్డ్ భూముల స్థలంలోనే మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని తక్షణమే మార్చుకొని, అటువంటి అవసరం కోసం వేరే భూమిని ఎంచుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 150 నిరుపేద దళిత వెనుకబడిన మైనారిటీ కుటుంబాల తీవ్రమైన ఆందోళన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారి ఆఫీసు నుండి అసైనీల భూమిని తీసుకోబోమనే ప్రకటనను తక్షణమే చేయాల్సిందిగా మేము ప్రత్యేకంగా ముఖ్యమంత్రిని కోరుతున్నాం. 

ఈ రోజు జరిగిన నిజనిర్ధారణ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయకర్త వి. వసంతలక్ష్మి, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్. తిరుపతయ్య, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కన్వీనర్ బొల్లి ఆదం రాజు, హైదరాబాద్ నగర ప్రధాన కార్యదర్శి సంజీవ్ మరియు మానవ హక్కుల వేదిక సభ్యులు వెంకటనారాయణ, టి. రోహిత్, జి. మధు లు పాల్గొన్నారు.

       – వి. వసంత లక్ష్మి
( ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు)

    – డా. ఎస్. తిరుపతయ్య
(తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి).

కొడంగల్

తేదీ 03.03.2024.

Related Posts

Scroll to Top