ఆదివాసీ రైతుల సాగు హక్కును కాపాడాలి

అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం డివిజన్‌, గొలుగొండ మండలం, పాత మల్లంపేటలో వ్యవసాయం చేస్తున్న గదబ  ఆదివాసీ రైతుల సాగు హక్కును కాపాడమని మానవ హక్కుల వేదిక (HRF) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇంక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా సాగుకు సంబంధించిన రెవిన్యూ రికార్డుల్లో వారి పేర్లు నమోదు చేసి వారి హక్కులను కాపాడే చర్యలు తక్షణం చేపట్టాలి. ఆలాగే, అక్టోబర్‌ 14న రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఆదివాసులను కలిసి, గొలుగొండ మండల సర్వేయర్‌, గత గొలుగొండ మండలం తాసీల్డార్‌ ఇచ్చిన నివేదికలను రద్దు చేసి, వారి మీద ఒక వారంలోగా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ హామీని తప్పనిసరిగా నిలబెట్టాలి.

ఇద్దరు సభ్యుల HRF బృందం గదబపాలెం, పాతమల్లంపేట గ్రామాలను 9-11-22 నాడు సందర్శించి స్థానిక గడబ ఆదివాసీ రైతులను, మహిళలను కలిసి మాట్లాడాము. పాతమల్లంపేట గ్రామంలో సర్వే నెంబర్‌ 850-1 లో సాగులో వున్న 36 ఎకరాల భూమిని పరిశీలించాము. వారి వద్దనున్న పాత, కొ త్త రెవెన్యూ  రికార్డులను కూడా పరిశీలించాము.

గదబపాలెం సర్వే నెంబర్‌ 850-1లోని 36 ఎకరాల్లో మొత్తం 25 PVTG ఆదివాసీ కుటుంబాలు గత యాభై ఏళ్లుగా అక్కడ సాగు చేసుకుంటున్నట్లు మా పరిశీలనలో తేలింది. వారు అక్కడ మెట్ట పంటల తోపాటు, జీడిమామిడి, మామిడి, టేకు, గట్ల మీద తాటి చెట్లు నాటుకున్నారు. అక్కడున్న 25 కుటుంబాలకు ఈ వ్యవసాయమే ప్రధాన జీవనోపాధి అనేది స్పష్టంగా కనపడింది.

ఈ సంవత్సరం మార్చ్‌ నెల నుండి కొంత మంది ప్రవాస భారతీయులు, స్థానిక భూకబ్దా దారులు, రెవెన్యూ అధికారులు కలిసి ఈ 36 ఎకరాల భూమిని కాజేయాలనే ప్రయత్నం మొదలుబెట్టారు. ఆ ప్రయత్నంలో భాగంగానే తప్పుడు రెవెన్యూ రికార్డులను సృష్టించి, పోలీసుల ద్వారా బెదిరింపులు, వేధింపు చర్యలకు పాల్పడ్డారు. అంతేకాకుండా అప్పటి గొలుగొండ ఎస్‌.ఐ. దనుంజయ నాయుడు మార్చ్‌ 11నాడు ఆదివాసీ రైతులను, మహిళలను రాత్రి 7 గంటలనుండి మధ్యరాత్రి వరకూ పోలిసు స్టేషన్ లో బంధించి ప్రవాస భారతీయులు ఇచ్చే డబ్బు తీసుకుని భూమిని విడిచిపెట్టమని వత్తిడి చేశాడు.

ఆనాటి గొలుగొండ తాసీల్దార్‌, కె వెంకటేశ్వర రావు, 29-3-22 నాడు నర్సీపట్నం ఆర్‌.డి.ఓ.కి ఇచ్చిన నివేదికలోగానీ, తరవాత 15-6-22 నాడు అనకాపల్లి, ఏ.డీ. సర్వే & భూమి రికార్డువారికి ఇచ్చిన నివేదికలోగానీ ఆదివాసీలు సాగులో ఉన్న వాస్తవాన్ని తొక్కిపెట్టారు. గొలుగొండ మండల సర్వేయర్‌ కూడా 10-6-22 నాడు ఏ.డీ. సర్వే & భూమి రికార్డు వారికి ఇటువంటి నివేదికే ఇచ్చాడు. ఆదివాసీల సాగులో ఆ భూమి వుందన్న విషయం వీరిద్దరికీ స్పష్టంగా తెలిసినా, వారు ఈ తప్పుడు నివేదికలు ఇచ్చారు.

అయితే, ప్రస్తుత నర్సీపట్నం ఆర్డివో గత నెలలో ఈ భూమిని రెండు సార్లు సందర్శించి, గదబ ఆదివాసులు చేస్తున్న వ్యవసాయాన్ని పరిశిలించారు. కనుక, ఇంకా ఆలస్యం చేయకుండా సర్వే నెంబర్‌ 850-1 సాగుదారుల వివరాలను భూమి రికార్డుల్లో (3వ నెంబర్‌ అడంగల్‌,13వ కాలంలో) నమోదు చేసి, ఆదివాసీ రైతులకు న్యాయం చేయమని కోరుతున్నాము. అంతేకాకుండా, తప్పుడు నివేదికలు రాసిన తాసిల్దార్ పైనా, ఆదివాసులను బెదిరించిన ఎస్‌.ఐ.పైనా చట్ట ప్రకారం క్రిమినల్‌ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నాము.

మానవ హక్కుల వేదిక
ఆంధ్రప్రదేశ్
10 సెప్టెంబర్ 2022

Related Posts

Scroll to Top