జల్ జీవన్ మిషన్ పథకం అమలు కోసం ధనాపురం గ్రామానికి వెళ్లిన ఆదోని MLA పార్థసారధి, గుడిసె కృష్ణమ్మలు బహిరంగంగా ప్రజల సమక్షంలో దళితుడైన గ్రామ సర్పంచ్ చంద్ర శేఖర్ పట్ల కులవివక్షను ప్రదర్శించి , ఆయనను అవమానానికి గురిచేయడాన్ని మానవ హక్కుల వేదిక, ప్రగతిశీల మహిళా సంఘం, IFTU, AIFTU సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
ఆదోని పట్టణానికి సమీపంలోని ధనాపురం గ్రామంలో కూటమి ప్రభుత్వం తరపున 16 జూన్, 2025 తేదిన సాయంత్రం ” ప్రజల వద్దకు పార్ధ సారథి ” కార్యక్రమం నిర్వహించారు. ఆదోని బీజేపీ MLA గారు తాము గ్రామ ప్రజల దాహార్థిని తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం నుండి నేరుగా నిధులు మంజూరు చేయిస్తామని చెప్పారు. ఆయన గ్రామ సర్పంచ్ ను గుడి ప్రాంగణంలోని కట్ట మీదకు ఆహ్వానించారు. గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్ వేదిక మీదకు రావడాన్ని గమనించిన, గుడిసె కృష్ణమ్మ తన నోటికి చేయి అడ్డం పెట్టుకొని సర్పంచ్ ఎస్సి అని నొక్కి చెప్పడం సర్పంచ్ ను అవమానించడమే. MLA పార్ధ సారధి గారు ఆమెను వారించి, సర్పంచ్ ను వేదిక మీదకు ఆహ్వానించాలి. ఆయన రాజ్యాంగం మీద ప్రజాప్రతినిధి ప్రమాణం చేసి మౌనంగా ఉండడాన్ని తీవ్రమైన విషయంగా మేం భావిస్తున్నాం. దళితుడైన సర్పంచ్ ను అవమానించిన వీడియో చూసిన ఎవరికైనా, వారి కుల వివక్షత ప్రదర్శించిన తీరు స్పష్టంగా అర్ధం అవుతుంది.
కావున రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం వెంటనే స్పందించి ధనాపురం గ్రామ సర్పంచ్ దళితుడైన చంద్ర శేఖర్ పట్ల కుల వివక్షత ప్రదర్శించి, అతన్ని అవమానించిన టీడీపీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మతోపాటు, ఆదోని MLA పార్ధ సారధి గారిపై వెంటనే సుమోటోగా SC, ST ( అత్యాచారాల నిరోధక ) 1989 చట్టం కింద కేసును నమోదుచేసి చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని కోరుతున్నాం. ఈ విషయంలో ఏమాత్రం తాత్సారం చేసినా కలిసి వచ్చే సంఘాలతో కలసి ఆందోళన తీవ్రతరం చేయవలసి వస్తోందని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.
U. G. శ్రీనివాసులు, HRF రాష్ట్ర ఉపాధ్యక్షులు
K. సుజ్ఞానమ్మ, ప్రగతిశీల మహిళా సంఘం, (POW)
K. నర్సన్న, IFTU జిల్లా నాయకులు
H. గంగన్న, AIFTU జిల్లా నాయకులు
ఆదోని,
19-6-2025.