సిగాచి యాజమాన్యం పై చర్యలు చేపట్టాలి

పటాన్ చెరు పారిశ్రామికవాడ లోని సిగాచి ఫార్మా పరిశ్రమలో జరిగిన భారీ పేలుడు, తద్వారా జరిగిన తీవ్ర ప్రాణనష్టం పైన మానవ హక్కుల వేదిక బృందం ఈ రోజు నిజనిర్ధారణ జరిపింది.

ఇంకా శవాల వెలికితీత పూర్తి కాకపోవడం, ఎంత మంది బ్రతికి ఉన్నారో కూడా తెలియకపోవడం వంటి విషయాలు, కంపెనీ పేరు తప్ప యాజమాన్యం పేర్లు ఇప్పటికీ బయటికి రాకపోవడం, మృతుల కుటుంబాలకు సమాచారం అందకపోవడం వంటి విషయాలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఎక్కువ మంది కార్మికులు వలస కార్మికులు అయినపుడు వారి ఎమర్జెన్సీ కాంటాక్ట్ వివరాలు కంపెనీ దగ్గర లేకపోవడం దారుణం. బాధితుల కుటుంబ సభ్యులు, వారి ఇంటి ఓనర్లు ఫ్యాక్టరీ ముందు శవం దొరికిందా లేదా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది.

గత కొద్ది నెలలుగా తరచుగా జరుగుతున్న ఫార్మా కంపెనీ ప్రమాదాల నుంచి ప్రభుత్వాలు , కంపెనీలు కూడా ఏమీ నేర్చుకోవడం లేదని అర్థం అవుతోంది. లేబర్ డిపార్ట్మెంట్ సేఫ్టీ ఆడిట్ జరపడం లేదని, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎటువంటి పర్యవేక్షణ చేయడం లేదని అనుమానపడాల్సి వస్తోంది. ఉన్న ఫార్మాకంపెనీలలోనే భద్రతా ప్రమాణాలు అమలు కాని ఇటువంటి పరిస్థితులలో కొత్తగా ఫార్మా సిటీలు , ఫార్మా హబ్ ల వంటివి వస్తే ఎంత ప్రాణనష్టం జరుగుతుందో తలచుకుంటే భయం వేస్తుంది.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం ప్రకటించడంలో చూపుతున్న ఉత్సాహం (చివరకు ఎంత ఇస్తారో గాని) కార్మికులను గుర్తించడంలో చూపించడం లేదని అర్థం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక కోటి రూపాయలు ఇప్పిస్తామని చెబుతోంది, కానీ ఆ నిధులు ఎవరు ఇస్తారో, ఎప్పుడు ఇస్తారో చెప్పడం లేదు.

ముందుగా ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తించి, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో పాటు, కంపెనీ యాజమాన్యం మీద తక్షణమే చర్యలు చేపట్టాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తున్నది. దర్యాప్తు పారదర్శకంగా జరిపి , నిర్ణయాలతో కూడిన వివరాలను వెల్లడించడంతో పాటు, ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలి.

సురేష్ బాబు – మానవ హక్కుల వేదిక హైదరాబాద్ యూనిట్ అధ్యక్షులు
వసంత లక్ష్మి – ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు
సంజీవ్ – మానవ హక్కుల వేదిక హైదరాబాద్ యూనిట్ ప్రధాన కార్యదర్శి

పటాన్ చెరు,
02-07-2025

Related Posts

Scroll to Top